మామ మాటకు నో.. జగన్ దూకుడు!

Tuesday, November 26, 2024

తన సొంత జిల్లాలో, తనకు ప్రత్యేకశ్రద్ధ ఉన్న నియోజకవర్గాల్లో తన మాట నెగ్గాలని, తన వారుగా ముద్రపడిన నాయకులే ప్రధానంగా ఉండాలని సీనియర్లు కోరుకోవడం చాలా సహజం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారులో అత్యంత కీలకమైన ముగ్గురు మంత్రుల్లో ఒకరుగా ఉంటూ, విస్తరణ నేపథ్యంలో ఆ హోదాను కోల్పోయిన.. జగన్ మామ బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అలాగే కోరుకున్నారు. కానీ ఆయన మాటను తిరస్కరించి, ఆయన అభీష్టానికి భిన్నంగా పర్చూరు నియోజకవర్గం విషయంలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అక్కడ పార్టీ సమన్వయకర్తగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను నియమించారు.
2020లో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన దగ్గరినుంచి ఆ నియోజకవర్గం మొత్తం ముఠా కక్షలతో రావణ కాష్టంలాగా మారిపోయిన సంగతి ప్రజలందరికీ తెలుసు. ఆమంచి కృష్ణమోమన్, కరణం బలరాం వర్గీయులు ఎన్నెన్ని సందర్భాల్లో నడిరోడ్ల మీద కర్రలు, కత్తులు, రాళ్లతో కొట్టుకుంటూ స్వైరవిహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారో కూడా లెక్కలేదు. జగన్ బర్త్ డే, పార్టీ వ్యవస్థాపక దినం, వైఎస్సార్ జయంతి- వర్ధంతి.. ఏ కార్యక్రమం అయినా కావొచ్చు. ఆరోజున రెండు ముఠాలు రెండు శిబిరాలు కార్యక్రమాలను నిర్వహించడానికి పూనుకోవడం మాత్రమేకాదు.. ఒకరు కట్టిన ఫ్లెక్సిలను మరొకరు తొలగించడం, ఒకరి మీద మరొకరు దాడులు చేసుకోవడం వంటివి అక్కడ రివాజుగా మారాయి.
ఈ నేపథ్యంలో ఇటు పర్చూరు నియోజకవర్గం అనాథలాగా తయారైంది. గత ఎన్నికల సమయానికి రావి రామనాథం బాబు అక్కడ పార్టీ ఇన్చార్జిగా ఉండగా.. జగన్ ఆయనకు టికెట్ నిరాకరించి దగ్గుబాటి వెంకటేశ్వరరావును తెరపైకి తెచ్చారు. ఆయన పరాజయం పరిపూర్ణం అయింది. ఆ తర్వాత చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను పర్చూరు ఇన్చార్జిగా వెళ్లమని జగన్ కోరితే ఆయన ససేమిరా అని ఒప్పుకోలేదు. ఈలోగా సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి కుమారుడు మధుసూదన్ రెడ్డిని పర్చూరు ఇన్చార్జి చేయాలనుకుని చివరలో ఆపేశారు.
ముఠాలకు వర్గాలకు పేరుమోసిన వైఎస్సార్ కాంగ్రెస్ లో ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు ఇన్చార్జిగా రావడం, జగన్ మామ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇష్టం లేదు. ఆయన కంది రవిశంకర్ పేరును తెరపైకి తెచ్చారు. అయితే మామ మాటను తోసిపుచ్చిన జగన్మోహన్ రెడ్డి.. ఆమంచినే పర్చూరు ఇన్చార్జిగా నియమించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన కూడా వచ్చేసింది. ఈ నియామకంతో చీరాల రచ్చ చల్లబడుతుందని జగన్ అనుకుని ఉండవచ్చు గానీ.. అసలే మంత్రి పదవి కొనసాగించలేదని ఉడికిపోతున్న మామ బాలినేనిలో అసంతృప్తి పెరుగుతుందనే సంగతి కూడా ఆయన గమనించాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles