పార్టీలో అసమ్మతి వ్యక్తం చేస్తున్న సీనియర్ నేతలను ఖాతరు చేయకుండా తన కార్యక్రమాలు తనవి అన్నట్లు దూసుకు పోతున్న టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వేగానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే బ్రేకులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి సారధ్యంలో జరిగే పార్టీ కార్యక్రమాలలో పాల్గొనబోమని ఖరాఖండిగా ప్రకటించి, దూరంగా ఉంటున్న సీనియర్ నేతలను పార్టీ అధిష్ఠానం చూసుకొంటుందిలే అన్నట్లు తనదైన శైలిలో పనిచేసుకొంటూ పోతున్నారు.
తెలంగాణ పార్టీలో కుంపట్లను సర్దుబాటు చేయడానికి మొదటగా ఖర్గే సీనియర్ నేత, గతంలో ఉమ్మడి ఏపీకి పార్టీ ఇన్ ఛార్జ్ గా పనిచేసిన దిగ్విజయ్ సింగ్ ను పంపించారు. ఆయినా నాయకులు అందరితో ఓపికగా మాట్లాడి ఇక తెలంగాణ పార్టీలో అన్ని సమస్యలు సర్దుబాటు అయ్యాయని ప్రకటించి వెళ్లారు. అయితే అసమ్మతి నేతలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న తెలంగాణ ఇన్ ఛార్జ్ మాణిక్యరావు ఠాకూర్ ను మార్పు చేయడం తన చేతిలో లేదంటూ వెళ్లిపోయారు.
అయితే దిగ్విజయ్ సింగ్ వెళ్లిన తర్వాత కూడా అసమ్మతి నేతలు ఎవ్వరు గాంధీ భవన్ వైపు చూడటం లేదు. ఈ లోగా 26 నుండి తాను పాదయాత్ర చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణాలో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, వైఎస్సాఆర్ టిపి అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల పాదయాత్రలు జరుపుతున్నారు. ఈ పాదయాత్ర ద్వారా తెలంగాణ కాంగ్రెస్ లో తాను తిరుగులేని నాయకుడిని కాగలనని రేవంత్ భావిస్తున్నారు.
అయితే ఈ పాదయాత్రకు ఏఐసీసీ అనుమతి ఇవ్వలేదంటూ అసమ్మతి నాయకుడైన మహేశ్వర్ రెడ్ డిబాంబు పేల్చారు. జనవరి 26 నుండి చేపట్టాలనుకున్న హాత్ సే హాత్ జోడో యాత్రకు హైకమాండ్ అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ఏఐసీసీ ఇచ్చిన సర్క్యులర్ లో 2 నెలల పాదయాత్ర ఉందని, కానీ జనవరి 26 నుండి 5 నెలల పాటు పాదయాత్ర అని అన్నారని తెలిపారు.
అయితే ఎవరి నియోజకవర్గంలో వారే పాదయాత్ర చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించింది. ఈ పాదయాత్రలో ఒకరోజు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొంటారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. అయితే, తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన భద్రాచలం నుండి ప్రారంభించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభతో ముగించాలని రేవంత్ చూస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
ఈ లోగా, బుధవారం బోయిన్ పల్లి ఐడియాలజీ సెంటర్లో జరిగే కాంగ్రెస్ శిక్షణా తరగతులకు హాజరుకావాలని మల్లికార్జున ఖర్గే అసమ్మతి నేతలకు ఫోన్ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పలువురు అసమ్మతి నేతలు నేరుగా ఖర్గేను కలసి రేవంత్ పై ఆరోపణల చిట్టా విప్పుతున్నారు.