‘రాజుగారి పెద్దభార్య చాలా మంచిది’ అంటే అర్థం ఏమిటి? ‘చిన్నభార్య చెడ్డది’ అనే కదా? ఇదే తరహాలో నర్మగర్భ వ్యాఖ్యలతో మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రమాదఘంటికలు మోగించారు. ‘ముందస్తు వస్తే ముందే ఇంటికిపోతాం’ అంటే అర్థం ఏమిటి.. ‘ముందస్తు రాకపోతే.. కాస్త లేటుగా ఇంటికిపోతాం’ అనే కదా! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని.. స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యేనే చెబుతున్నారు.. ఆయనేమీ యథాలాపంగా ఒక నింద వేస్తున్నట్టుగా అసంతృప్తి వెళ్లగక్కుతున్నట్టుగా ఈ మాటలు అనలేదు. కారణాన్ని కూడా వివరించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతుండగా.. చిన్న చిన్న పనులు కూడా పూర్తి కావడం లేదని, దీనిపట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఆయన చెప్పారు.
ఆనం రామనారాయణ రెడ్డి చాలా కాలంగా ప్రభుత్వం పట్ల తన ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉండగానే.. నియోజకవర్గంలో సొంతపార్టీ అధిష్ఠానం తనకు పొగపెడుతున్నదని ఆయనకు కోపం. తాను ఉన్నంత వరకు తానే ఎమ్మెల్యేనని ఆయన పాపం.. ప్రతి సభలోనూ ప్రజలకు చెప్పుకుంటూ ఉంటారు.
అలాంటి ఆనం రామనారాయణ రెడ్డి.. ప్రభుత్వ వైఫల్యాల గురించి పలు సందర్భాల్లో ప్రస్తావిస్తున్నారు. సంక్షేమ పథకాల పేరుతో కేవలం డబ్బులు పంచుతూ ఉన్నంత మాత్రాన ప్రజలు ఓట్లు వేయరని, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు అస్సలు జరగడం లేదని ఇటీవలే ధ్వజమెత్తారు. వైఎస్సార్ హయాంలో తలపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడం గురించి కూడా జగన్ నామమాత్రంగానైనా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.ఈ నిర్లక్ష్యం చేటుచేస్తుందని అంటుంటారు.
తాజాగా నియోజకవర్గంలో సచివాలయ భవనాలను పూర్తి చేయడం లేదంటూ ఆనం రామనారాయణరెడ్డి మరోసారి ఆగ్రహోదగ్రులయ్యారు. కొన్నింటిని పునాదులు వేసి వదిలేస్తే.. కొన్నింటిని దాదాపు పూర్తవుతున్న దశలోనూ వదిలేసి కాంట్రాక్టర్లు పారిపోతున్నారని.. ఎందుకలా వెళ్లిపోతున్నారో కూడా అర్థం కావడం లేదని ఆనం విమర్శలు కురిపించారు. పనులు ఇలా జరగకపోతే గనుక.. ఎన్నికలు వస్తే ఎమ్మెల్యేలు ఇక ఇంటికి వెళ్లాల్సి వస్తుందని జోస్యం చెబుతున్నారు.
కేవలం ప్రజల ఖాతాల్లోకి డబ్బు పంచడం అనేది ప్రజల ఓట్లను కొల్లగొట్టదని, అభివృద్ధి పనులేమీ జరగకపోతే.. ప్రజలు ప్రభుత్వాన్ని దారుణంగా తిరస్కరిస్తారని.. ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి చాలా స్పష్టత వచ్చింది. మరి అదే క్లారిటీ ముఖ్యమంత్రి జగన్ కు ఎప్పటికి వస్తుందో? సంక్షేమం అందిన ప్రతి ఇల్లూ గంపగుత్తగా ఓట్లు కుమ్మేస్తారనే భ్రమల్లో ఆయన ఇంకా ఎక్కువకాలం ఉంటే ప్రమాదమే.
ఆనంకు ఉన్న క్లారిటీ జగన్‌కు ఉందా?
Friday, November 15, 2024