రాజకీయాల్లో మన ఇష్టం వచ్చినట్టుగా చెలరేగడానికి.. మన భావజాలాన్ని ప్రజల మెదళ్లలోకి చొప్పించి వారి సొంత ఆలోచనలను కబ్జా చేయడానికి మీడియా ఒక ప్రధాన సాధనం అనే వాస్తవాన్ని నాయకులు ఎన్నో దశాబ్దాల కిందటే గుర్తించారు. ఇదివరకు ఒక సాంఘిక ప్రయోజనం కోసం మీడియా సంస్థలను పార్టీలు నిర్వహిస్తే.. ఫక్తు సొంత పార్టీ మరియు వ్యాపార ప్రయోజనాల కోసం మీడియాను ఇప్పుడు అడ్డు పెట్టుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపు తీసుకురావడం దగ్గరినుంచి రాష్ట్రసాధనలో కీలకంగా మారడంలో ఒక న్యూస్ పేపర్, టీవీ ఛానెల్ సొంతంగా కలిగిఉండడం ఎంత ఎడ్వాంటేజీ అవుతుందో కేసీఆర్ స్వానుభంలో గమనించారు కూడా.
అలాంటి కేసీఆర్ ఇప్పుడు భారత రాష్ట్ర సమితి రూపంలో ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తున్నారు. ఆయన ఏపీలో తమ పార్టీ సారథిని ఎంపిక చేసి, కొందరు నాయకులను కూడా చేర్చుకున్నారు. ఏపీలో తమ పార్టీ అరివీర భయంకరంగా ముందుకు వెళ్లబోతున్నదని ఆయన అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుతు ఏపీలో తన పార్టీ ప్రచారానికి, భారాసను ముందుకు తీసుకువెళ్లడానికి ఒక పేపర్ కూడా ఉండాలని ఆయన కోరుకుంటున్నట్టు సమాచారం.
తాజాగా 99 టీవీ ఛానెల్ అధినేత నిన్నటిదాకా పవన్ కల్యాణ్ కోటరీలో ఉన్నటువంటి తోట చంద్రశేఖర్ ఇవాళ భారాస పార్టీకి ఏపీ అధ్యక్షుడు. ఆయన గులాబీ కండువా కప్పుకున్న వెంటనే చానెల్ 99 కూడా భారాస కు బాకా ఊదడం సహజంగానే ప్రారంబించింది. అంటే కేసీఆర్ పార్టీకి తెలంగాణలో టీ ఛానెల్ ఉన్నట్టుగానే, ఏపీలో ఇప్పుడు 99 ఛానెల్ ఉన్నదన్నమాట. కానీ కేసీఆర్ దీనితో అంత సంతృప్తి చెందడం లేదు. చానెల్ మాత్రమే కాదు.. పేపరు కూడా ఉండాల్సిందే అని అంటున్నారట. వైసీపీ అనుకూల ప్రచారానికి సాక్షి, ఆంధ్రప్రభ, తెదేపా అనుకూల ప్రచారానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఉన్నాయి. అలాగే తన పార్టీ కోసం ఒక ప్రతిక ఉండాలని కోరుకుంటున్నారట. తెలంగాణలో నమస్తే తెలంగాణ తరహాలో తమ భావజాలాన్ని స్ప్రెడ్ చేయాలని ఆయన కోరుకుంటున్నారట.
మరి ఇప్పుడు ఉన్న పేపర్లనే గులాబీ సేవ కోసం వాడుకుంటారో.. వామపక్షాలతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీలకు ఉన్న ఏపీ పేపర్లను భారాస సేవకు వినియోగించుకుంటారో.. ఉన్న పత్రికల్లో ఎవరైనా భారాస తీర్థం పుచ్చుకుంటే ఆ పత్రికను విస్తృతంగా వాడడానికి పూనుకుంటారో.. కొత్త పత్రికనే ప్రారంభిస్తారో వేచిచూడాలి.
గులాబీసేవకోసం ఏపీలో ఒక పేపరు కావాలి!
Friday, November 15, 2024