రాముడు అంటే తమ జేబులో బొమ్మ మాత్రమే అని భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది. రాజకీయ లంపటం మీద వీసమెత్తు ఆసక్తి లేని తటస్థ ఆధ్యాత్మవాది ఎవడైనా కూడా.. తలవని తలంపుగా జై శ్రీరామ్ అని ఎన్నడైనా అంటే గనుక.. వాడు ఖచ్చితంగా జై మోడీ అని కూడా అని తీరవలసిందే అని కమలనాధులు పట్టుపట్టగలరు. రాముడు తమ పార్టీ సొత్తు అని వారు భావిస్తారు. అయితే ఇలాంటి వారందరికీ బుద్ధి వచ్చేలా ఉమాభారతి చాలా గొప్ప సందేశం ఇచ్చారు. రాముడు హనుమంతుడు భాజపా కార్యకర్తలు కాదని, వారు ఏ ఒక్క పార్టీకి సొంతం కాదని ఉమాభారతి వ్యాఖ్యానించారు.
రాముడుని తమ ప్రాపర్టీగా మార్చేసుకుంటూ..అడ్డగోలుగా చెలరేగిపోతూ ఉండే కమలదళాలకు తమ సొంత పార్టీ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి ఈరేంజి ఝలక్ ఇవ్వడం పెద్ద చెంపపెట్టు. ఎవరి వ్యాఖ్యలకు కౌంటర్ గా ఉమాభారతి ఈ మాటలు అన్నారనేది ఇదమిత్థంగా తేలలేదు గానీ.. సాధారణంగా రాముడి విషయంలో బిజెపి వాదులు అనుసరించే పెత్తందారీ యాజమాన్య పోకడలకు ఇది షాక్ అని చెప్పాలి.
భాజపా, జనసంఘ్ పార్టీలు లేని రోజుల్లో కూడా రాముడు, హనుమంతుడు ఉన్నారని, ఈ పార్టీల అస్తిత్వాలు, అసలు రాజకీయ వ్యవస్థ కూడా లేని రోజుల్లోనే వాళ్లు ఉన్నారని అన్నారు. మనం కళ్లు తెరచినప్పుడే సూర్యచంద్రులు ఉద్భవించారని అనుకునే అజ్ఞానాన్ని తమ పార్టీ కార్యకర్తలు వదలిపెట్టాలని ఉమాభారతి హితవు చెప్పారు.
ఉమాభారతి ఆషామాషీ నాయకురాలు కాదు. మధ్యప్రదేశ్ కు చెందిన ఆమె, చిన్న వయసులోనే పురాణాల అధ్యయనం కొనసాగిస్తూ.. అక్కడి రాజమాత విజయరాజె సింధియా సంరక్షణలో పెరిగారు. హిందూత్వ ప్రచారకురాలిగా మారారు. కాషాయం ధరించడం ప్రారంభించారు. అనేక దేశాలు తిరిగి హిందూత్వ ఔన్నత్యం గురించి ఆమె ప్రసంగించారు. అలాంటి చరిత్ర ఉన్న ఉమాభారతి బిజెపిలో చేరిన తర్వాత ఎంపీ అయ్యారు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా సేవలందించారు. రామజన్మభూమి ఉద్యమంలో చాలా కీలకపాత్ర పోషించిన ఉమాభారతి.. రాముడి మీద పెత్తనం తమకు లేదని చెప్పడం భాజపా నాయకులకు కనువిప్పు కావాలి.
రాముడిని బిజెపి తొలినుంచి కూడా తమ ప్రచారాస్త్రంగా, ఎన్నికలకు ట్రంపుకార్డులాగా వాడుకుంటూ ఉంటోంది. ప్రతిసారీ రాముడి పేరు చెప్పి ఎన్నికలకు వెళుతుంటుంది. ఈ సారి రామాలయం విషయంలో తీర్పు వచ్చేసింది. ఇప్పుడు వారికి నిజానికి తురపుముక్క లేనట్టే. కానీ.. రామాలయాన్ని ఎన్నికలకు కొన్ని నెలల ముందు మాత్రమే పూర్తిచేసి.. రామాలయాన్ని పూర్తిచేసిన రామభక్త పార్టీగా ప్రజల ఎదుటకు వెళ్లి ఓట్లు దండుకోవాలనేది వారి ప్లాన్. ఇలాంటి సమయంలో రాముడు బిజెపి సొత్తు కాదు అని ఉమాభారతి చెప్పడం గమనార్హం.
కమల దళంలో పరివర్తన వస్తుందా?
Sunday, December 22, 2024