మంత్రి ధర్మాన ప్రసాదరావు తన పదవికి రాజీనామా చేయనున్నారా? ఉత్తరాంధ్ర జాతిపితగా కొత్త కీర్తి సంపాదించుకోవడానికి, ఉత్తరాంధ్ర కోసం త్యాగాలు చేసిన మహనీయుడిగా కీర్తింపబడడానికి ఆయన మంత్రిపదవిని వదలుకునే వ్యూహం సిద్ధం చేసుకున్నారా? విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. అవుననే తెలుస్తోంది.
ధర్మాన ప్రసాదరావు ఉత్తరాంధ్రకు తాను పెద్దదిక్కుగా మారాలని అనుకుంటున్నారు. ఉత్తరాంధ్రనుంచి వైసీపీ కీలక నాయకుల్లో ఒకరు అయినప్పటికీ.. ఆయనకు జగన్ తొలి కూర్పులో మంత్రిని చేయలేదు. ఆయన తమ్ముడిని పదవి వరించింది. ఆయన చాలా చాలా అలిగారు. తనకు పదవిలేదని కుమిలిపోయారు. అలా అలకపాన్పు ఎక్కి మరీ.. రెండో కేబినెట్ లో స్థానం సంపాదించారు. అప్పటినుంచి త్యాగరాజు అనే కీర్తికోసం బిల్డప్ మాటలు వల్లిస్తున్నారు. విశాఖ ను రాజధానిగా తక్షణం ప్రకటించకపోతే తాను తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామాచేస్తానని ఆయన గతంలోనే ప్రకటించారు. ఇంతకూ ఆయన ఆ ప్రకటన ద్వారా ఎవరిని బెదిరిస్తున్నట్టు? ఆయనే స్వయంగా ప్రభుత్వంలో మంత్రి. ఆ ప్రభుత్వం విశాఖను రాజధానిగా ఆల్రెడీ ప్రకటించింది. న్యాయపరమైన ఎదురుదెబ్బవల్ల వెనక్కు తగ్గి ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. మళ్లీ ప్రకటించాలంటే అందుకు తగిన అధికారం లేదని కోర్టు చెప్పింది గనుక.. ఆలోచనలో ఉంది. అయితే ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరూ ఇవాళే, రేపే విశాఖ నుంచి పరిపాలన అంటూ ప్రజలను ఊరిస్తూనే ఉన్నారు. అలాంటి నేపథ్యంలో తాను రాజీనామా చేస్తా అని ఎవరిని బెదిరించడానికి ధర్మాన అన్నారో తెలియదు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటూ విశాఖకు రాజధాని సాధన కోసం ఆయన చాలా సభల్లో పాల్గొన్నారు. అవన్నీ అమరావతి రైతుల అరసవెల్లి పాదయాత్రకు పోటీగా, ఆ సీజన్లో జరిగినవి. ఈలోగా విశాఖలో ధర్మాన పాల్పడిన భూదందాలు కూడా బయటకు వచ్చాయి. అప్పుడు ఆయన శాంతించారు.
తీరా ఇప్పుడు విశాఖను రాజధానిగా ప్రకటించకుంటే రాష్ట్రంగా ప్రకటించాలని కోరుతున్నారు. నేరుగా వెళితే మజ్జిగకు గతిలేదురా అంటే పెరుగుకు చీటీ రాసి పంపించినట్లుగా ఉంది ఈ వ్యవహారం.
అయితే ఈ డిమాండ్ ను రాజకీయంగా వాడుకోవాలనేది ధర్మాన వ్యూహం. దీనికోసం ఆయన ఉగాది తరువాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి డిసైడైనట్టుగా తెలుస్తోంది. అది కూడా వ్యూహాత్మక నిర్ణయమే. ఏప్రిల్ తర్వాత రాజీనామా చేస్తే ఆమోదానికి రెండు మూడు నెలలు పడుతుంది. అప్పటికి ఆరేడు నెలల దూరంలోనే ఎన్నికలు ఉంటాయి గనుక.. ఈసీ ఉప ఎన్నిక పెట్టదు. అలా స్కెచ్ వేశారన్నమాట. ఉత్తరాంధ్ర కోసం రాజీనామా చేసిన కీర్తి దక్కాలి. కానీ.. ఉప ఎన్నికల ఖర్చు భారం పడకూడదు. ఇదంతా ప్రత్యేకహోదా కోసం గతంలో వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాల తరహా డ్రామా. ఆ రకంగా రాజధాని వచ్చినా రాకపోయినా, రాష్ట్రం వచ్చినా రాకపోయినా.. ఉత్తరాంధ్ర త్యాగరాజుగా, ఉత్తరాంధ్ర జాతిపితగా తనకు కీర్తి వస్తుందని ధర్మాన ప్రసాదరావు కోరిక.
ఉగాది తర్వాత ధర్మాన రాజీనామా?
Sunday, December 22, 2024