మామూలు పరిస్థితుల్లో అయితే ఎన్నికలు ఇంకా ఏడాదికి పైగా దూరంలో ఉన్నట్టే. కేంద్రం విషయానికి వస్తే ఇప్పట్లో ఎవ్వరికీ ఇంకా ఎన్నికల మూడ్ రానేలేదు. కానీ ఏపీలో పరిస్థితి వేరు. కొన్ని నెలల ముందునుంచే అక్కడ ఎన్నికల వాతావరణం వచ్చేసింది. నాయకులు ఎన్నికల సభల్లో మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు. అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. ఒకరి మీద ఒకరు ఫైర్ అయిపోతున్నారు. సంక్షేమం అనే ముసుగులో తాను చేపట్టిన కార్యక్రమాలు, జనానికి పంచిపెట్టిన డబ్బులే తనను మళ్లీ గెలిపిస్తాయని జగన్ చాలా ధీమాగా ఉన్నారు. అందుకే ఆయన ఎవ్వరినీ ఖాతరు చేయడం లేదు. ఆయన నమ్మకం నిజమో కాదో ప్రజలు తేలుస్తారు గానీ.. ఆచరణలో ముఖ్యమంత్రికి ఒక కొత్త తలనొప్పి వచ్చి పడింది.
పార్టీలో తన మాట వేదవాక్కుగా చెలామణీ కావాలని ముఖ్యమంత్రి అనుకుంటారు. అలాగే గడపగడపకు వైసీపీ కార్యక్రమం నిర్వహించాలని ఆయన నిర్దేశించారు. ఎమ్మెల్యేలు ఇల్లిల్లూ తిరిగి, ప్రతి ఇంటికీ తమ సర్కారు ఎన్ని వేల, లక్షల రూపాయలు పంచిపెట్టిందో గుర్తుచేస్తే చాలు.. ఓట్లు వచ్చేస్తాయనేది ఆయన స్కెచ్. అయితే ఎమ్మెల్యేలు గ్రామాల్లో ఇళ్లకు తిరుగుతున్నప్పుడు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అనేక సమస్యలను నివేదిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, స్థానిక నాయకుల దందాలను ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు జవాబు చెప్పలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు మొక్కుబడిగా అప్పుడప్పుడూ నిర్వహిస్తూ రోజులు నెడుతున్నారు. నెలకోసారి దీనిని సమీక్షిస్తున్న జగన్ దాదాపు 40 మందికి పైగా ఎమ్మెల్యేలు సరిగా తిరగడం లేదంటూ ఆగ్రహించిన సంగతి తెలిసిందే. అలాంటి వారికి టికెట్లు ఇవ్వనని కూడా ఆయన హెచ్చరించారు.
అయితే తలనొప్పి ఏంటంటే.. ఆయన కన్నెర్ర చేస్తున్న వారిలో చాలా మంది సమర్థులు ఉన్నారు. మరికొందరు సీనియర్లు గట్టి నాయకులు పార్టీ మీదనే తిరుగుబాటు చేస్తున్నారు. ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు. కోటంరెడ్డి, ఆనం లాంటివాళ్లే ఇందుకు ఉదాహరణ. ధిక్కారంగా వ్యవహరిస్తున్న సమర్థుల్ని దూరం చేసుకుంటే పార్టీకి నష్టం. జగన్ కు అదొక భయం.
అదే సమయంలో.. జగన్ మాటను వేదంలా పాటిస్తూ గడపగడపకు ముమ్మరంగా తిరుగుతున్న విధేయుల బ్యాచ్ ఇంకొకటి ఉంది. వాళ్లందరూ అసమర్థులు. చెప్పిన మాట విన్నంత మాత్రాన.. వారందరికీ టికెట్లు ఇస్తే పార్టీ మునుగుతుందనేది జగన్ భయం. ఒకవైపు మాటవినని సమర్థులు, ఒకవైపు చెప్పింది వినే డూడూ బసవన్నల్లాంటి అసమర్థులతో జగన్ ఇరుపోటుల మద్య నలిగిపోతున్నారని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
జగన్‌కు తలనొప్పి : ఒకవైపు ధిక్కారాలు.. ఒకవైపు అసమర్థులు!
Thursday, December 19, 2024