హైదరాబాద్ లో ఇతర పార్టీల నేతలతో మంతనాలకు  భయపడుతున్న బిజెపి!

Monday, December 23, 2024

ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో ఏకంగా బిజెపి జాతీయ నాయకులనే అరెస్ట్ చేసే ప్రయత్నం కేసీఆర్ ప్రయత్నం చేయడంతో బిజెపి జాతీయ నాయకత్వం ఖంగు తిన్నది. ప్రస్తుతం ఈ కేసును తెలంగాణ హైకోర్టు సీబీఐకి బదిలీ చేయడంతో కొంత ఊపిరి పీల్చుకొంటున్నప్పటికీ రాబోయే రోజులలో తిరిగి అటువంటి సమస్యలు రాకుండా చూసుకొనే ప్రయత్నం చేస్తున్నది. 

వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో తెలంగాణాలో ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న బిజెపి నాయకత్వం ఇక్కడ క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని గ్రహించింది. ముందుగా ప్రజలకు తెలిసిన బలమైన అభ్యర్థులు బీజేపీలో లేరని అంతర్గత సర్వేలలో వెల్లడైనది. సుమారు 20 నియోజకవర్గాలలో మించి బలమైన అభ్యర్థులు లేరని తెలుసుకొంది. 

అందుకనే ఇతర పార్టీల నుండి బలమైన అభ్యర్థులను ఆహ్వానించడం కోసం ఏకంగా `చేరికల కమిటీ’ అంటూ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అధ్యక్షతన ఏర్పరిచింది. ఈ కమిటీ సభ్యులు దాదాపుగా ఇతర పార్టీల నుండి వచ్చినవారే. ఎమ్యెల్యేల కొనుగోలు కేసు కారణంగా రెండు నెలలుగా టిఆర్ఎస్ నుండి ఎవ్వరిని ఆకర్షించే ప్రయత్నం చేయడం లేదు. కాంగ్రెస్ కు మాత్రమే పరిమితమవుతున్నారు. 

ఎన్నికలు దగ్గరకు వస్తుండటం, ఎక్కడా చెల్లుబాటు కానీ వారు తప్పా ప్రజలలో పలుకుబడి కలిగిన వారెవ్వరూ పార్టీలో చేరేందుకు ముందుకు రాకపోతూ ఉండడంతో రాష్ట్ర పార్టీ ఇన్ ఛార్జ్ లు తరుణ్ ఛుగ్,  సునీల్ బన్సల్ లు బుధవారం చేరికల కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఇంకా సమయం వృద్ధ చేయకుండా ఇతర పార్టీల వారిని తీసుకొచ్చే ప్రయత్నాలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. 

రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీకి బలమైన అభ్యర్థులు ఎక్కడ లేరో గుర్తించి, వెంటనే అక్కడ ఇతర పార్టీల్లోని బలమైన నాయకులను చేర్చుకోవాలని తరుణ్ చుగ్ సూచించారు. మంచి ఛరిష్మా, మాస్ ఫాలోయింగ్ ఉంటే వారికి టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి చేర్చుకోవాలని చెప్పారు. 

అయితే, కొత్తవారికి సీట్లు ఇస్తుంటే పార్టీలో చాలాకాలంగా ఉన్నవారిలో చెలరేగుతున్న అసంతృప్తి, అసమ్మతి పట్ల సహితం జాగ్రత్తగా వ్యవహరించాలని వారించారు. ఆయా  సెగ్మెంట్ల​లో టికెట్ ఆశించే పార్టీ సీనియర్లు ఎలాంటి అసంతృప్తికి గురికాకుండా వారిని ఒప్పించే బాధ్యతను రాష్ట్ర నేతలు తీసుకోవాలని పురమాయించారు. 

బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న ఇతర పార్టీల కీలక నేతలతో హైదరాబాద్ లో సమావేశాలు జరపడం, మంతనాలు జరపడం కాకుండా నేరుగా ఢిల్లీకి తీసుకురావాలని చేరికల కమిటీకి ఈ సందర్భంగా హెచ్చరించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లోని అసంతృప్త నేతలతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ.. వారిని బీజేపీలోకి ఆహ్వానించాలని చెప్పారు. 

చివరకు ఎన్నికలు సమీపిస్తుంటే ఓటర్లను ఆకట్టుకోవడం గురించి కాకుండా, బలమైన అభ్యర్థులను ఇతర పార్టీల నుండి దిగుమతి చేసుకోవడంపై ఇప్పుడు బిజెపి ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. కాంగ్రెస్ నుండి చేరిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మునుగోడులో బిజెపి అభ్యర్థిగా ఓటమి చెందిన తర్వాత తెలంగాణాలో బీజేపీలో చేరేందుకు ముఖ్యమైన నాయకులు ఎవ్వరు పెద్దగా ఆసక్తి చూపకపోవడం గురించి కూడా వాకబు చేసిన్నట్లు తెలుస్తున్నది. 

 ఈ మధ్య చేరికల కమిటీని ఇతర పార్టీల నేతలు ఎవరు సంప్రదించారు? వారి చేరికలకు ఉన్న అడ్డంకులేంటి? వారి చేరికతో ఆ సెగ్మెంట్​లో బీజేపీ ఏ స్థాయిలో బలోపేతం అవుతుందనే విషయాలపై ఢిల్లీ నేతలు ఆరా తీశారు. ఇక, వచ్చే ఎన్నికలలో దీర్ఘకాలంగా పార్టీలో ఉన్న చాలామంది నాయకులకు సీట్లు ఇచ్చే ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా స్పష్టమైన సంకేతం ఇవ్వడం పార్టీలో కలకలం రేపుతున్నది. 

రాబోయే ఎన్నికల్లో టికెట్ల కోసం లాబీయింగ్ లు నడువవని, కేవలం సర్వేల ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని  తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, పార్టీకి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బలమైన అభ్యర్థులు ఉండేలా ఇప్పటి నుంచే కసరత్తు చేయాలని సూచించారు. 

ప్రతి సెగ్మెంట్​లో బీఆర్ఎస్ అభ్యర్థులను దీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న అభ్యర్థి కావాలని తేల్చి చెబుతూ, ఆ దిశగా చేరికలను స్పీడప్ చేయాలని నేతలను ఆదేశించారు. అంటే, ప్రస్తుతం నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లుగా ఉన్నవారికి, గతంలో పోటీ చేసిన వారికి చాలావరకు ఈ సారి సీట్ రాకపోవచ్చని సంకేతం ఇచ్చారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles