విపక్షాలన్నీ కలిసి ఓ సమావేశం నిర్వహించాయి. అందరూ ప్రతిపక్షాలే గనుక.. వారి దాడి పాలకపక్షం మీదనే ఉండడం సహజం. కానీ సాధారణంగా ఇలాంటి సమావేశాల్లో పాలకపక్షం వైఫల్యాలు, ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వస్తాయి. కానీ.. ఈ సమావేశం పూర్తిగా ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఎజెండాగా పెట్టుకుంది. తెలుగుదేశం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం.. జగన్ సర్కారు ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం పెట్రేగిపోతున్నదని ఆగ్రహం, ఆక్రోశం వ్యక్తంచేయడం విశేషం.
ప్రతిపక్షాలు మాట్లాడాల్సి వస్తే.. ప్రజల సమస్యలను మాట్లాడే పరిస్థితి లేకుండాపోయిందిప్పుడు. తమ సమస్యలనే, తమకు ఎదురవుతున్న కష్టాలనే వారు ఏకరవు పెట్టుకుంటున్నారు. తమ పార్టీ మీద జరుగుతున్న దాడులు, తమ కార్యకర్తలకు వేధింపులు, తమ నాయకుల అరెస్టులు ఇవే ప్రధానంగా వారి ఆవేదనగా ఉంటున్నాయి. ఏ పార్టీకి కూడా ఇందులో మినహాయింపు లేదు. అందరిదీ ఒకటే గోడు. అందరిదీ ఒకటే లక్ష్యం. ఈ ప్రబుత్వాన్ని గద్దె దింపాలి.. లేకపోతే ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టే పరిస్థితి లేదు అనేది మాత్రమే.
ఎన్నికలు వచ్చినప్పుడు కావలిస్తే.. ఎవరికి వారు విడివిడిగా ప్రచారం చేసుకుందాం. కానీ.. ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో ఈ రాక్షస పాలనను అంతం చేయడానికి కలసికట్టుగా పోరాడుదాం.. అనే మాట అన్ని పార్టీల నాయకులనుంచి రావడం గమనార్హం. ప్రజల భద్రతకు ఉద్దేశించిన వ్యవస్థలు, ప్రభుత్వ యంత్రాంగాలు అన్నీ కూడా.. జగన్ సర్కారుకు తొత్తులుగా మారిపోయిన వైనంపై అన్ని పార్టీల నాయకులూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలను ప్రశ్నిస్తే చాలు.. అర్ధరాత్రి వచ్చి పోలీసులు అరెస్టు చేస్తున్నారని, హింసిస్తున్నారని దాదాపుగా అందరూ ఖండించడం విశేషం. ప్రభుత్వం విపక్ష నాయకులను అరెస్టు చేయవచ్చు.. వారి చర్యలు చట్టవిరుద్ధంగా ఉన్నాయనిపిస్తే కేసులు పెట్టవచ్చు. అంతవరకు అందరూ అర్థం చేసుకుంటారు.. కానీ.. అరెస్టు చేయడానికి అర్ధరాత్రి వేళల్లోనే నేతల ఇళ్లకు వెళ్లడం.. ప్రహరీగోడలు దూకి, తలుపులు పగలగొట్టి అరెస్టులు చేయడం వంటి పనులే.. ప్రభుత్వం పరువు తీస్తున్నాయి. తమ పార్టీ శ్రేణులను ఏమాత్రం అదుపులో పెట్టుకోలేని వైసీపీ వైఫల్యం కూడా ప్రతిపక్షాలకు అస్ర్తంగా మారుతోంది. డ్రైవరును చంపి డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు విడుదల కాగానే పార్టీ నాయకులు పండగ చేసుకోవడం, ఘన సన్మానాలు చేయడం ఇవన్నీ పార్టీ పరువు తీసే వ్యవహారాలుగా చర్చకు వచ్చాయి. తెలుగుదేశం నిర్వహించిన అఖిలపక్షసమావేశానికి జనసేన, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం లుహాజరుకాగా, బిజెపి మాత్రం డుమ్మా కొట్టడం విశేషం.
‘ఉగ్రవాదానికి కొత్త నిర్వచనం ఏపీ సర్కార్!’
Friday, November 22, 2024