‘‘వచ్చే ఎన్నికల్లోగా రాష్ట్రమంతా విధ్వంసం, దహనకాండల ఆనవాళ్లు కనిపించాలి. తమ పార్టీ అంటే ప్రేమతో కాదు, భయంతో ప్రజలు తమ మాట వినాలి..’’ ఇదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎజెండాలాగా కనిపిస్తోంది. మాచర్లలో ఆస్తుల దహనానికి పాల్పడ్డారు. తంబళ్లపల్లెలో దాడులకు తెగబడ్డారు. ఇప్పుడు గుడివాడలో.. అనవసరమైన విషయాన్ని రాద్ధాంతంగా మారుస్తూ ఏకంగా వ్యక్తులనే దహనం చేసేసేకుట్రతో పెట్రోలు పొట్లాలతో దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బరితెగింపు రోజురోజుకూ శృతిమించుతున్నప్పటికీ.. పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్రకు పరిమితం అవుతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.
వంగవీటి రాధా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఆయన తండ్రి వంగవీటి రంగా వర్ధంతిని తెలుగుదేశం పార్టీ నిర్వహించడానికి పూనుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు అభ్యంతరం ఏమిటో ప్రజలకు అర్థం కాని సంగతి. రంగా మీద వారికి కూడా అభిమానం ఉంటే.. తెలుగుదేశం నిర్వహించే కార్యక్రమాలకంటె భారీగా వైభవంగా వర్ధంతిని తాము కూడా నిర్వహించి ఆ భక్తిని చాటుకోవచ్చు. కానీ.. మీరు నిర్వహించడానికి వీల్లేదు.. అనే బెదిరింపుల దగ్గరినుంచి గుడివాడలో తాజా రావణ కాష్టానికి తొలి అగ్గిపుల్ల వెలిగింది.
ఎమ్మెల్యే నాని అనుచరుడు కాళీ.. టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావును ఫోనులో చంపుతానని బెదిరించడం, నిర్వహించడానికి వీల్లేదనడం మొదలుగా గుడివాడ తాజా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కార్యక్రమం నిర్వహించి తీరుతాం అని రావి వెంకటేశ్వరరావు అనడంతో.. తెలుగుదేశం కార్యాలయం వద్ద కాళి తన అనుచరులు వైసీపీ కార్యకర్తలతో కలిసి వచ్చి కర్రలు, కత్తులు, పెట్రోలు ప్యాకెట్లతో దాడులకు తెగబడ్డారనేది వార్తల ద్వారా తెలుస్తోంది. పెట్రోలు ప్యాకెట్లు విసిరి దగ్ధం చేయడానికి ప్రయత్నించినప్పటికీ అవి అంటుకోకపోవడం వల్ల.. భారీ విధ్వంసం జరగలేదని అనుకోవాల్సి వస్తోంది. అయితే.. ఈ యావత్ దాడులు, ఘర్షణల సమయంలో పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్రకే పరిమితం కావడం గమనార్హం.
అయితే గుడివాడ గొడవలు ఆదివారంతో ముగిసిపోలేదు. సోమవారం కూడా కొనసాగే ప్రమాదం మెండుగా కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రంగా వర్ధంతి నిర్వహించి తీరుతాం అని రావి వెంకటేశ్వరరావు ప్రకటించారు. వైసీపీ దళాలు దానిని భగ్నం చేయాలని అనుకోవడం చాలా సహజం. ఈ నేపథ్యంలో పోలీసులు ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తారు.. ఏం జాగ్రత్తలు తీసుకుంటారు.. అనేదానిని బట్టి.. సోమవారం కూడా గుడివాడ రణరంగంగానే మారుతుందా? లేదా? అనేది తేలుతుంది.
గడ్డం బ్యాచ్ : రాష్ట్రమంతా తగలెట్టేసే ఆనవాళ్లు ఇవే!
Monday, December 23, 2024