ఖమ్మం వేదికగా చంద్రబాబునాయుడు సింహనాదం చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏదీ ఎక్కడ? అంటూ ఎద్దేవా చేసేవారు.. ఖమ్మం సభకు హాజరైన యువతరం ఉత్సాహాన్ని గమనించాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ బలపడాల్సిన అవసరం ఉందని ఆయన సంకేతం ఇచ్చారు. రకరకాల కారణాల వల్ల పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయిన సీనియర్ నాయకులందరూ.. తెలుగుదేశానికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు మళ్లీ పార్టీలోకి తిరిగి రావాల్సిన సమయం ఆసన్నం అయిందని ఆయన ఆహ్వానించారు. తెలంగాణలో ఇక పార్టీ పని అయిపోయినట్టే అని అనుకుంటున్న తెలుగుదేశం పార్టీ తరఫున ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగసభ విజయవంతం అయిన తీరు.. తెలంగాణ పాలిటిక్స్ లో ప్రకంపనాలు సృష్టిస్తోంది. అదే సమయంలో పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లి, అక్కడి అరాచకత్వంతో ఇమడలేక ఇబ్బంది పడుతున్న సీనియర్ నేతలలో ఆలోచన పుట్టిస్తోంది. తమ సొంత గూటికి తిరిగి రావడానికి వారు ఆలోచిస్తున్నారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పునరుత్తేజం తీసుకురావాలని నిర్ణయించిన తర్వాత.. ఖమ్మంలో తొలి బహిరంగ సభను నిర్వహించడం అనేది వ్యూహాత్మకంగా గొప్ప ఎత్తుగడ. గత ఎన్నికల్లో పెద్దగా సీట్లు దక్కకపోయినప్పటికీ.. మౌలికంగా పార్టీకి అభిమానులు పుష్కలంగా ఉన్న జిల్లా ఖమ్మం.తాను అధ్యక్షుడు అయిన నాటినుంచి.. పార్టీకి కొత్త నెత్తురు నింపడానికి ప్రయత్నిస్తున్న జ్ఞానేశ్వర్ ఖమ్మంలో సభ ఏర్పాటుచేశారు. చంద్రబాబునాయుడు హైదరాబాదు నుంచి రోడ్డు మార్గంలో వెళ్లి ఖమ్మం సభలో పాల్గొన్నారు. ఖమ్మం సభ అనుకున్నదానికంటె విజయవంతం అయింది.
తెలుగుదేశం పార్టీకి తెలంగాణ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో అభిమానుల్లో కొరత లేదు. కానీ.. పార్టీ సరైన బలంతో లేకపోవడం వల్ల మాత్రమే తెలుగుదేశం పార్టీవి అనుకున్న ఓట్లు కూడా ఇతరులకు పడుతూ వచ్చాయి. తెలుగుదేశం అభిమానులు నిర్లిప్తంగా ఉండిపోతున్నారు. అలాంటి వారందరికీ కూడా.. ఇప్పుడు ఖమ్మం సభ ఉత్సాహాన్నిస్తోంది. పైగా టీడీపీని వీడి వెళ్లిన సీనియర్ నాయకులు కొందరు ఇతర పార్టీల్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం వారి కెరీర్ స్తబ్దుగా ఉంది. అలాంటి వారు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది. ఖమ్మం జిల్లాలోనే భారాసలో లోకల్ రాజకీయ కుట్రల వల్ల 2018లో ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావు కొంత అసంతృప్తితో ఉన్నారు. టీడీపీ బలంగా ఉండేట్లయితే.. ఆయన కూడా వచ్చి ఆ బలానికి తాను కొంత జత కాగల అవకాశం ఉంది. ఈతరహాలో గులాబీ దళం నుంచి పలువురు నేతలు తిరిగిరావాలనే కోరిక పార్టీకి ఉంది. కాంగ్రెసులో కూడా గ్రూపు రాజకీయాలు.. టీడీపీ నుంచి వెళ్లిన వారిని అసహనానికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నాయకులు తిరిగి వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. మొత్తానికి ఒక్క ఖమ్మం సభను విజయవంతం చేయడం ద్వారా.. తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో మార్పుచేర్పులకు చంద్రబాబు శ్రీకారం చుట్టినట్టయింది.
బాబు పిలుపుతో సీనియర్లలో చలనం!
Monday, December 23, 2024