వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత.. పోలీసులను తమ పార్టీ పనివాళ్లులాగా వాడుకుంటుున్నదనే సంగతి అందరికీ తెలుసు. రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి, తమ దందాలను ఇష్టారాజ్యంగా నడిపించడానికి పోలీసులతో పాటు ప్రభుత్వయంత్రాంగాలను కూడా విచ్చలవిడిగా వాడుతున్నారనే సంగతి ప్రజలు గుర్తిస్తున్నారు. అయితే పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి ఎంతగా దాసోహం అయింది అనడానికి, వారి అడుగులకు మడుగులొత్తడంలో ఎంతగా దిగజారిపోయింది అనడానికి మాచర్ల విధ్వంసం ఒక పెద్ద ఉదాహరణగా కనిపిస్తోంది. మాచర్లలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు.. రాష్టవ్యాప్తంగా ప్రజలను ఆలోచింపజేస్తోంది. మరీ ఇంతగా బరి తెగించి.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారా? అనుకునేలా చేస్తోంది. పర్యవసానంగా పోలీసుల మీదకంటె.. వారిని ఇలా దిగజార్చిన అధికార పార్టీ మీదనే ఆలోచన పరుల్లో కోపం, అసహ్యం పుడుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పరువు గంగపాలు అయిపోతోంది.
మాచర్లలో తెలుగుదేశం, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం తొలుత ఏర్పడింది. పోలీసులు బలవంతంగా.. తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డిని ఊరినుంచి గుంటూరుకు పంపేసిన తర్వాత.. ఆ ఉద్రిక్తతలు తగ్గాల్సింది బదులుగా.. పూర్తి ఏకపక్షంగా మారిపోయాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి దాడులుగా మారాయి. గృహదహనాలు, వాహనాలను కాల్చేయడం పార్టీ ఆఫీసును తగులబెట్టడం వంటి అనేకం జరిగాయి. అయితే అన్నింటికీ కలిపి టీడీపీ నాయకుల మీద మాత్రమే కేసులు నమోదుకావడం విశేషం. మాచర్ల పోలీసుల తీరు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ విషయంలో చంద్రబాబునాయుడు చాలా సీరియస్ గా స్పందిస్తున్నారు. డీజీపీ, డీఐజీ, ఎస్పీల సహకారంతోనే దాడులు జరిగాయని ఆరోపిస్తున్నారు. రాజకీయంగా వైసీపీ వారు చేసిన దాడులు, దహనకాండ వ్యవహారాలను ఫ్యాక్షన్ గొడవలుగా పోలీసులు తేల్చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. బాధితుల మీద హత్యాయత్నం కేసులు పెట్టి, దాడిచేసిన వారి మీద ఆ సెక్షన్లు లేకుండా తేలికపాటి కేసులు పెట్టడం కూడా పోలీసుల తీరును ప్రశ్నార్థకం చేస్తోంది.
మొత్తానికి రాష్ట్రంలో రాజకీయ హింస చెలరేగిన ప్రతిసందర్భంలో పోలీసుల తీరు ప్రశ్నార్థకం అవుతోంది. అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే ఇదివరకటి హింస, దాడులు వేరు.. ఇప్పుడు మాచర్ల విధ్వంసం వేరు. వైసీపీ వారి అరాచకత్వానికి పరాకాష్టగా ఈ ఉదంతం నిలుస్తోందనే అభిప్రాయం పలువురిలో ఉంది. అటూ ఇటూ కలిపి.. పోలీసులు అనుసరిస్తున్న అరాచకపోకడలు.. అధికారపార్టీకే నష్టం చేస్తున్నాయి. ప్రజల దృష్టిలో వారి పరువు తీస్తున్నాయని ప్రజలు అనుకుంటున్నారు.
మాచర్ల పోలీస్ దెబ్బ.. వైసీపీ పరువు గంగపాలు!
Monday, December 23, 2024