పైలట్ రోహిత్‌రెడ్డి సవాల్ కు ముఖం చాటేసిన బండి సంజయ్

Monday, November 18, 2024

తరచూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాళ్లు విసురుతూ, పాత బస్తి లోని భాగ్యలక్ష్మి  వద్దకు, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా వేదాద్రి దేవాలయం వద్దకు వచ్చి తనతో కలసి ప్రమాణం చేయమని సవాలు విసురుతూ ఉండే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బిఆర్ఎస్ ఎమ్యెల్యే నుండి అటువంటి సవాల్ ఎదురయ్యే సరికి ముఖం చాటేశారు.

 బెంగళూరు డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు వచ్చాయంటున్న బండి సంజయ్ అందుకు ఆధారాలు చూపించాలని, తాను చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేశానని, బండి సంజయ్ కూడా ఆదివారం ఇక్కడికి వచ్చి అమ్మవారి ముందు ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. రోహిత్ రెడ్డి సవాల్ ను తాను పట్టించుకోనని స్పష్టం చేస్తూ  ఎవరు పడితే వారు సవాల్ విసిరితే తాను స్పందించనని సంజయ్ ముఖం చాటేశారు. 

అయితే, ఆ తర్వాత రోహిత్ రెడ్డికి నిజంగానే నోటీసులు రావడం గమనార్హం. కేంద్ర దర్యాప్తు సంస్థలు పంపబోయే నోటీసుల సంగతి ముందుగానే బండి సంజయ్ కు ఏవిధంగా తెలిసాయి అంటూ ఆ తర్వాత బిఆర్ఎస్ నేతలు నిలదీశారు అనుకోండి. 

 బిజెపి నాయకులు తనపై చేస్తున్న ఆరోపణలను దమ్ముంటే రుజువు చేయాలని తాండూరు నియోజకవర్గం శాసనసభ్యుడు పైలట్ రోహిత్‌రెడ్డి సవాల్ విసిరారు. అలా రుజువు చేస్తే తన పదవికి అప్పటికప్పుడే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.బిజెపి నేతలు కేవలం తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అన్ని రాజకీయా డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

అందులో భాగంగనే తనపై తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సవాల్ విసిరినట్లుగా రోహిత్ రెడ్డి ఆదివారం భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన సవాల్‌ను ఎందుకు స్వీకరించలేదని బండి సంజయ్‌ని ప్రశ్నించారు. 

కర్నాటక పోలీసులు తనను ఎప్పుడూ విచారణకు పిలువలేదని, ఏ ఎఫ్‌ఐఆర్‌లోనూ తన పేరు లేదని స్పష్టం చేశారు. తనపై చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవాలు లేవని పేర్కొంటూ ఆ విషయంలో తాను ఏ దేవాలయానికి రమ్మన్నా వస్తానని….ఎక్కడ ప్రమాణం చేయమన్న చేస్తానని రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇందుకు బిజెపి నేతలు సిద్దమేనా? అని ప్రశ్నించారు. అయినప్పటికీ బిజెపి నేతలు పదేపదే తనపై తప్పుడు ప్రచారం చేయడం తగదని హితవు చెప్పారు.  కేంద్రంలో ఉన్నామన్న అహంతో దర్యాపు సంస్థలపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చి ప్రతిపక్షలకు చెందిన నాయకులపై ఇడి, సిబిఐ, ఐటి దాడులు చేయిస్తోందని మండిపడ్డారు.

ఇలా ఉండగా, తనను ఎమ్యెల్యేగా  అనర్హుడిగా ప్రకటించాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేయడం పట్ల ఆగ్రహం ప్రకటించారు. 2009 ఎన్నికల అఫిడవిట్ లో విద్యార్హత ఒకరకంగా.. 2018 ఎన్నికల అఫిడవిట్ లో మరో రకంగా చూపించారని ఆరోపించారు. 

దీనిపై భారత ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నామని బిజెపి ఎమ్యెల్యే ప్రకటించారు. 2009 అఫిడవిట్లో రోహిత్ రెడ్డి స్వీడన్ యూనివర్సిటీలో బీటెక్ ఎంఎస్ చదివినట్లు చూపించారని పేర్కొంటూ 2018లో ఇంటర్మీడియట్ చదివినట్లు ఎందుకు చూపారో చెప్పాలని నిలదీశారు. 

కాగా బండి సంజయ్‌కు వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్న బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్‌రావు విమర్శలను కొట్టిపారవేస్తూ తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పై వస్తున్న విమర్శల్లో కొత్తేమి లేదని చెప్పారు.  బీజేపీ నేతలకు అబద్ధాలు చెప్పటం వెన్నతో పెట్టిన విద్యని విమర్శించారు. 

కాగా, రఘునందన్ రావుకు వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని రోహిత్ రెడ్డి ఎదురు ప్రశ్నించారు. పటాన్‌చెరు ప్రాంతంలోని పరిశ్రమల యజమానులను బెదిరించలేదా? అని నిలదీశారు. స్టార్ హోటళ్లలో సంవత్సరం పొడవునా రూమ్స్ పెట్టుకొనే స్థాయికి ఎలా వచ్చావో చెప్పాలని డిమాండ్ చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles