ఒక వంక ముఖ్యమంత్రి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీని ఏర్పర్చి, జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర వహించాలని, ఇతర రాష్ట్రాలకు సహితం వ్యాపింప చేసి 2024 ఎన్నికలలో కనీసం 100 సీట్లలో అభ్యర్థులను పోటీకి దింపాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా, ఆయన కుటుంభ సభ్యులలో ముఖ్యమంత్రి పదవికి వారసత్వం కోసమై అంతర్గత పోరు జరుగుతున్నట్లు కధనాలు వెలువడుతున్నాయి.
ఢిల్లీలో బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవంలో కేటీఆర్ పాల్గొనక పోవడానికి ముందే ఖరారైన అధికారిక కార్యక్రమాలే కారణం అంటూ మీడియా ద్వారా సుదీర్ఘ వివరణ ఇచ్చినప్పటికీ వారసత్వం విషయంలో కేటీఆర్, కవితల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న పోరే కారణం అని పలువురు భావిస్తున్నారు.
బిఆర్ఎస్ ఆవిర్భావ సదస్సుకు కవిత హాజరు కాకపోవడం గమనార్హం. 2014లో నిజామాబాద్ నుండి లోక్ సభకు ఎన్నికై, జాతీయ నాయకులతో తండ్రితో కలసి దగ్గర కావడానికి కవిత ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఒక దశలో ఎన్డీయేలో టిఆర్ఎస్ ను చేర్చి, కేంద్ర మంత్రివర్గంలో చేరాలని కూడా ఆమె ప్రయత్నం చేశారు. అయితే బిజెపి నాయకత్వం నుండి సుముఖత వ్యక్తం కాకపోవడంతో సాధ్యం కాలేదు.
అయితే 2019లో నిజామాబాదు లో ఓటమి చెందడంతో అధికార పదవులకు దూరంగా ఉండడం ఆమెకు ఇబ్బందికరంగా మారింది. ఆలస్యంగా ఎమ్యెల్సీ అయినప్పటికీ రాష్ట్ర మంత్రివర్గంలో చేరే ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా, ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమె పేరు రావడంతో జాతీయ స్థాయిలో ఆమెకు ప్రచారం లభించినట్లయింది.
మొదట్లో మేనల్లుడు టి హరీష్ రావు, కేటీఆర్ ల మధ్య ముఖ్యమంత్రి పదవికి పోరు ఉంటూ ఉండెడిది. పార్టీ ప్రారంభించినప్పటి నుండి కేసీఆర్ తో కలసి పనిచేసిన హరీష్ రావుకు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులతో మంచి సంబంధాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిపోతున్నారని అమెరికాలో ఉంటున్న కేటీఆర్, కవిత హడావుడిగా హైదరాబాద్ కు వచ్చి తమదైన రీతిలో ఉద్యమంలో పాల్గొంటూ వచ్చారు.
కేటీఆర్ ధోరణి కొంత అహంకారపూరితంగా ఉంటూ ఉండడంతో సీనియర్ నేతల నుండి కొంత వ్యతిరేకత ఏర్పడుతున్న వారిలో చాలామందికి క్రమంగా పక్కకు తప్పించి, ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి కీలక పదవులు అప్ప చెబుతూ పార్టీలో, ప్రభుత్వంలో తిరుగులేని నేతగా కేటీఆర్ ను చేసేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చారు.
వచ్చే ఏడు జరిగే అసెంబ్లీ ఎన్నికలలో తిరిగి గెలుపొందితే, ముఖ్యమంత్రి పదవిని కేసీఆర్ చేపట్టారని, కేటీఆర్ కు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నారని కధనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వంలో అంతా తానై, అన్ని మంత్రిత్వ శాఖలలో జోక్యం చేసుకొంటూ వస్తున్నారు. అయితే ఈ పరిణామాల పట్ల కవిత అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు.
వాస్తవానికి 2019 ఎన్నికలలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయితే కేసీఆర్ కేంద్ర మంత్రివర్గంలో చేరగలరని, ముఖ్యమంత్రి పదవిని కేటీఆర్ చేపట్టగలరని కధనాలు వచ్చాయి. అయితే బిజెపికి సంపూర్ణ ఆధిక్యత లభించడంతో వారి అంచనాలు తలకిందులయ్యాయి. అప్పటి నుండి కేసీఆర్ ను జాతీయ రాజకీయాలకు పరిమితమై, ముఖ్యమంత్రి కుర్చీని తనకు వదిలివేయమని కేటీఆర్ వత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు.
అయితే కేటీఆర్ నాయకత్వంలో ఎన్నికలకు వెడితే పార్టీలో తిరుగుబాటు తప్పదని, ప్రజలలో సహితం ప్రతికూలత ఏర్పడగలదనే భయంతో కేసీఆర్ వారిస్తూ వస్తున్నారని తెలుస్తున్నది. తాజాగా కవిత రంగప్రవేశం చేసి ముఖ్యమంత్రి పదవి తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు కధనాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ ఈ విషయమై బహిరంగ ప్రకటన కూడా చేశారు.