మొత్తం మనదేశంలోనే ఒక స్థాయికి చేరుకున్న సంపన్నులు ఆశించే అతివిలువైన నామినేటెడ్ పోస్టు టీటీడీ బోర్డు సభ్యత్వం. ముఖేష్ అంబానీ భార్య నీతూ అంబానీ కూడా.. టీటీడీ బోర్డు సభ్యురాలిగా చేశారంటే.. ఏ స్థాయి వారి వరకు ఆ పదవికోసం ఆశపడుతుంటారనేది మనకు అర్థమవుతుంది. అయితే.. టీటీడీ బోర్డు సభ్యత్వాన్ని, ఇతర పదవులను రాజకీయ దళార్లకు కట్టబెట్టడం అనేది చాలా ఏళ్ల కిందటే మొదలైంది. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అది కాస్తా మరింతగా శృతిమించి అక్రమార్కులకు, మోసగాళ్లకు కూడా అందులో చోటు దక్కుతోంది. తాజాగా తన బయోపిక్ తీసి, తనను ప్రజల దృష్టిలో మహానుభావుడిగా సినిమా ద్వారా ప్రొజెక్టు చేయడానికి సిద్ధపడిన సినిమా నిర్మాతకు కూడా జగన్ ఈ అరుదైన అవకాశాన్ని కట్టబెట్టేశారు.
దాసరి కిరణ్ కుమార్ అనే సినిమా నిర్మాతను తాజాగా టీటీడీ బోర్డు సభ్యత్వం వరించింది. గతంలో జీనియస్, వంగవీటి, సిద్ధార్థ, రామ్ లీల వంటి చిత్రాలను నిర్మించిన కిరణ్ కుమార్ ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘వ్యూహం’ అనే చిత్రం నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ వ్యూహం సినిమా వైఎస్ జగన్ బయోపిక్ గా రూపొందుతుందని, ఆయన రాజకీయ హీరోయిజాన్ని తెలియజెప్పే విధంగా సాగుతుందని ప్రచారం ఉంది. ఈ వ్యూహం చిత్రానికి సంబంధించి కొన్ని వివరాలు చర్చించడానికే ఇటీవల దర్శకుడు రాంగోపాల్ వర్మ జగన్ ను కలిశారని కూడా వార్తలు వచ్చాయి. ఈ వ్యూహం నిర్మాతకు టీటీడీ బోర్డు సభ్యత్వం లభించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.
గతంలో హైదరాబాద్ కు చెందిన బూదాటి లక్ష్మీనారాయణ అనే రియల్టర్ టీటీడీ బోర్డు సభ్యత్వాన్ని దక్కించుకున్నారు. అయితే ఆయన వినియోగదారులను మోసం చేసి వందల కోట్ల రూపాయలు స్వాహా చేసినట్లుగా కేసులు నమోదు అయ్యాయి. ఆ వ్యవహారాల్లో ఆయన మీద విచారణ ప్రారంభమై.. టీటీడీ పరువు కూడా భ్రష్టుపట్టిపోయే పరిస్థితి రావడతో ఆయన బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ పదవి కోసం రాజకీయ నిరాశ్రయులు, పారిశ్రామికవేత్తలు పలువురు తమ వంతు ప్రయత్నాలు సాగించారు. అయితే ఆ అరుదైన అవకాశం జగన్ బయోపిక్ నిర్మిస్తున్న దాసరి కిరణ్ కుమార్ కు దక్కింది.
బయోపిక్ అనే ముసుగులో దర్శకుడు రాంగోపాల్ వర్మ మరీ నేలబారు క్వాలిటీతో వాస్తవ చరిత్రలను తనకు నచ్చినట్టుగా, తనకు డబ్బులు ఇచ్చే నిర్మాత ఇష్టమొచ్చినట్టుగా మార్చేసి వండి వారుస్తారనే కీర్తి ఉంది. జగన్ బయోపిక్ అనే ముసుగులో.. ఆయనను దివినుంచి భువికి దిగివచ్చిన అవతార స్వరూపుడిగా రాంగోపాల్ వర్మ ఆవిష్కరించే ప్రయత్నం జరిగినా ఆశ్చర్యం లేదు. అసలే జగన్ భజన కోసం ఆయనను ప్రొజెక్టు చేయడం కోసం వ్యూహం సినిమాను ప్లాన్ చేశారు. ఇప్పుడు నిర్మాతకు టీటీడీ బోర్డు పదవి కూడా దక్కింది. ఇక ఆ వ్యూహం సినిమా స్క్రిప్టుకు మరింతగా పదును పెడతారు. జగన్ స్తోత్రాలు మరింత అద్భుతంగా అందులో వండి వారుస్తారు.. అని అందరూ అనుకుంటున్నారు.