రావణకాష్టంలా మారిన మాచర్ల..

Monday, December 23, 2024

గాయం సినిమాలో రౌడీమూకలు సాగించే విధ్వంసం నగరం మొత్తాన్ని రావణకాష్టంగా మార్చేసిన తర్వాత.. ఒక పాట వస్తుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఆ అద్భుతమైన పాట.. ప్రేక్షకులు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. శుక్రవారం నాడు మాచర్ల ఎంతగా అతలాకుతలం అయిపోయిందంటే.. పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు సాగించిన దమనకాండ, దహనకాండకు సంబంధించిన విజువల్స్ తీసుకుని వరుసగా ప్లే చేస్తూ.. ‘గాయం’ సినిమాలోని పాటను జోడిస్తే.. అచ్చంగా సరిపోతుంది.

సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని
సుఖాన మనలేని వికాసమెందుకని
నిజాన్ని బలికోరే సమాజమెందుకని
అడుగుతోంది అదిగో.. తగలబడే మాచర్ల..

అంటూ సినిమా పాటను మార్చి పాడుకోవాల్సినటువంటి పరిస్థితి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక రేంజిలో దాడులు, దమనకాండ,విధ్వంసకాండ, దహనకాండ అన్ని రకాలనూ మాచర్ల ప్రజలకు శుక్రవారం నాడు రుచిచూపించారు. తెలుగుదేశం కార్యకర్త అనుకోదగిన వ్యక్తి కనిపిస్తే చాలు చితక్కొట్టారు. వారి ఆస్తులకు, వాహనాలకు నిప్పు పెట్టారు. నగరం మొత్తాన్నీ తగలబెట్టకుండా వదిలేయడం మాత్రమే జరిగింది. రాళ్లు విసురుతూ కర్రలతో స్వైరవిహారం చేస్తూ ఇళ్లు, వాహనాల మీద పెట్రోలు పోసి తగలబెడుతూ ఉంటే.. పోలీసులు యథోరీతిగా ప్రేక్షకపాత్ర పోషించడమే ఇక్కడ విశేషం. ఇంత దహనకాండ జరిగిన తర్వాత కూడా.. తెలుగుదేశం నాయకులమీదనే కేసులుపెట్టి జైళ్లకు పంపేందుకు వ్యూహరచన సాగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.ఇవి రాజకీయ దాడులు కాగా, ఇవి ముప్ఫయ్యేళ్లుగా పట్టణంలో కొనసాగుతున్న ఫ్యాక్షన్ గొడవలు మాత్రమేనని పోలీసు అధికారులు తేల్చేయడం విశేషం.
ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూనుకోవడంతోనే జరిగింది. మాచర్ల రింగ్ రోడ్డు నుంచి ఈ కార్యక్రమం ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలుగుదేశం ముందేప్రకటించింది. దీనికి టీడీపీ మద్దతుదారులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. అది కొనసాగుతుండగా.. మధ్యలో వైసీపీ నాయకులు దాడికి తెగబడ్డారు. ఇరువర్గాల ఘర్షణ కూడా జరిగింది. పోలీసులు అప్పటికి ఇరువర్గాలను చెదరగొట్టి.. పంపేశారు. ఆ తర్వాత.. పోలీసులు బలవంతంగా తెలుగుదేశం ఇన్చార్జి బ్రహ్మారెడ్డిని గుంటూరు పంపేసిన తర్వాత.. వైసీపీ దళాలు మళ్లీ రెచ్చిపోయాయి. బ్రహ్మారెడ్డి ఇల్లు, తెలుగుదేశం ఆఫీసుల మీద దాడిచేసి పెట్రోలు పోసి నిప్పంటించారు. వాహనాలనుకూడా తగులబెట్టారు.
ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం కింద ప్రజల నుంచి వారి సమస్యలు తెలుసుకోవడానికి తెలుగుదేశం నాయకులు ఇంటింటికీ వెళ్లడానికి పూనుకుంటేనే ఇంత దారుణంగా రచ్చరచ్చ చేస్తున్న వైసీపీ.. తమ పట్ల ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకత గమనించి అసహనానికి గురవుతోందని అనిపిస్తోంది. టీడీపీ వారు ఇంటింటికీ తిరిగినంత మాత్రాన ఏమవుతుంది.. ప్రజలు తమ వెంటే ఉన్నారు కదా.. అనే స్పృహ వారికి లేదు. వారిలోని భయమే.. ఇలా దాడులకు తెగబడేలా చేస్తోందని పలువురు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles