ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ‘గడపగడపకు’ అనే కార్యక్రమాన్ని జిందా తిలిస్మాత్ అని భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. తన బుర్రలో పుట్టిన ఈ ఆలోచన ఒక్కటీ.. పార్టీని గెలిపిస్తుందనీ.. మరేమీ అక్కర్లేదనీ ఆయన అనుకుంటున్నట్టున్నారు. గడపగడపకు ఎమ్మెల్యేలు వెళుతుండడం వల్ల.. ప్రజలు వారిని ఎంతగా నిలదీస్తున్నారో.. సమస్యల వర్షం కురుస్తున్నదో.. ఆ చిన్న సమస్యల పరిష్కారం పేరిట కాంట్రాక్టులను నామినేషన్ పద్ధతిలో తమ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడం వలన ఎంత దోపిడీ జరుగుతున్నదో.. ఆ దోపిడీని ప్రజలంతా ఎంత నిశితంగా గమనిస్తున్నారో.. ఇవేవీ జగన్ కు అర్థం కావడం లేదు.
గడపగడపకు కార్యక్రమం గురించి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమం చాలా గ్రేట్ అని చెప్పారు. 32 మంది ఎమ్మెల్యేలు చాలా పూర్ గా పనిచేస్తున్నారని.. వీళ్లు పనితీరు మార్చుకోకుంటే టికెట్లు ఇచ్చేది లేదని కూడా హెచ్చరించారు. అంటే వాళ్లెవ్వరూ గడపగడపకు లో సక్రమంగా తిరగడం లేదని ఆయన భావం. జనవరిలో మళ్లీ సమీక్షిస్తానని ఈలోగా మారాలని హెచ్చరించారు. మేలో ఈ కార్యక్రమం ప్రారంభం అయితే.. డిసెంబరు దాకా తిరగని ఎమ్మెల్యేలు.. ఈ ఒక్కనెలలో ఏం ఉద్ధరించబోతారు అనేది ఆయన గమనించుకోలేదు. ఆ లెక్క ఏమీ లేకుండానే.. ఏదో నామ్ కే వాస్తేగా హెచ్చరించి వదిలేశారు.
పైగా జగన్ తెలుసుకోవాల్సిన అంశం మరొకటి ఉంది. గడపగడపకు కార్యక్రమంలో 32 మంది ఫెయిలయ్యారు సరే. ఈ కార్యక్రమంలో ఇల్లిల్లూ తిరుగుతున్నంత మాత్రాన.. తమ తమ నియోజకవర్గాల్లో విపరీతమైన ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుని ఉన్నవారు ఎంతమంది? వారి పరిస్థితి ఏమిటి? ఈ కార్యక్రమంలో తిరిగినంత మాత్రాన వారందరికీ ఏకపక్షంగా జగన్ టికెట్టు ఇచ్చేసి.. పార్టీ పరాజయానికి బాటలు వేస్తారా? అనేది అందరి మదిలో మెదలుతున్న ప్రశ్న. ఎగ్జాంపుల్ కోసం మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి అవినీతి మాకొద్దు అని సొంత పార్టీ సీనియర్ నేతలో రభస చేస్తోంటే.. వారిని పోలీసులతో బెదిరిస్తున్నారు తప్ప.. ఎమ్మెల్యే తీరు మారడం గురించి పట్టించుకోవడం లేదు. ఇలాంటి వారిని మళ్లీ ఎలా పోటీచేయిస్తారు?
అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలో భూబకాసురులుగా, కబ్జాకోరులుగా, ప్రజాకంటకులు, స్వాహారాయుళ్లుగా, నియోజకవర్గంలో ఏ పని జరుగుతున్నా సరే.. వాటాలు భోంచేసే దుర్మార్గులు బోలెడంత కీర్తి గడించారు. అలాంటివారు ఎటూ అవినీతిమీదనే బతుకుతున్నారు గనుక.. పార్టీ నిర్దేశించిన ఈ గడపగడపకు వంటి కార్యక్రమంలో చాలా జాగ్రత్తగా తిరుగుతున్నారు. కానీ వారికి మళ్లీ టికెట్టు ఇస్తే.. పార్టీ పరాజయం మాత్రం గ్యారంటీ అని ఆయా నియోజకవర్గాల్లో అందరూ అంటారు. మరి జగన్ వారినందరినీ ఏం చేస్తారు? ఈ 32 మందిని మాత్రం పక్కకు తప్పించి.. ఆ అవినీతి బకాసురుల్ని గడపగడపకులో బాగా తిరుగుతున్నారు గనుక కంటిన్యూ చేస్తారా? అలా చేస్తే పార్టీకి ఆత్మహత్యాసదృశం అవదా? అని ప్రజలు అనుకుంటున్నారు.