కరీంనగర్ లో నడ్డా, సంజయ్ లకు నిరసన సెగలు 

Thursday, December 19, 2024

తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు రావచ్చని అంచనాతో తన ప్రజాసంగ్రామ పాదయాత్రను అర్ధాంతరంగా ముగించాలని నిర్యానించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఐదవ విడత యాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్ లో గురువారం భారీ బహిరంగసభ నిర్ణయించారు.  స్థానిక ఎంపీ కావడంతో పెద్ద ఎత్తున జనసమీకరణ చేశారు. 
ప్రత్యేకంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ముఖ్యఅతిధిగా వచ్చారు. ఆయన 

పర్యటనకు వీలుగా ఉండడంకోసం ఒకరోజు ముందుగానే యాత్రను ముగించారు. అయితే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా  ఒక వంక సంజయ్, మరోవంక నడ్డా నిరసనలను ఎదుర్కోవలసి వచ్చింది. సంజయ్ కాంగ్రెస్ శ్రేణుల నుండి నిరసన ఎదుర్కోవలసి వస్తే, నడ్డాకు బిఆర్ఎస్ శ్రేణుల నుండి ఎదురయింది. 

బీజేపీ బహిరంగలో ప్రసంగించేందుకు వస్తున్న ఆ పార్టీ జాతీయ  జేపీ నడ్డాకు గోబ్యాక్ నడ్డా అంటూ ప్లకార్డులతో బీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది నడ్డా కాన్వాయ్ని అడ్డుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు వచ్చి వారిని అడ్డుకుని పక్కకు లాక్కెళ్లారు. అయితే.. సీఎం కేసీఆర్కు ప్రజాస్వామ్యం అంటే నమ్మకం లేదని, తనను అడ్డుకోవడానికి యత్నించారని జేపీ నడ్డా సభా వేదిక నుంచి విమర్శలు చేశారు.

మరోవంక, బండి సంజయ్‭కు వ్యతిరేకంగా కరీంనగర్ తెలంగాణ చౌక్‭లో కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎంపీగా కరీంనగర్‭కు ఏం చేశావంటూ ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు. కాంగ్రెస్ నిరసనకు వ్యతిరేకంగా.. బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని నినాదాలు చేశారు. 

దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలు పరస్పర దాడులకు ప్రయత్నించారు.   సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారు. బీజేపీ నేతలను అక్కడి నుంచి పంపించివేశారు. కాంగ్రెస్ నేతల అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. బండి సంజయ్‭కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

నడ్డా తన ప్రసంగంలో కేసీఆర్ కుటుంబంపై దృష్టి సారిస్తూ సీఎం కేసీఆర్ కు కొడుకు, కూతురు, అల్లుడు తప్ప ఎవరూ కనిపించడం లేదనిధ్వజమెత్తారు. కుటుంబవాదాన్ని వ్యాపింపజేసే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టారని ఆరోపించారు. క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతి, అక్రమాలకు తెగబడ్డారని పేర్కొంటూ ధరణి పోర్టల్ ను వాడుకొని టీఆర్ఎస్ వాళ్లు అక్రమ సంపాదన పోగేస్తున్నారని మండిపడ్డారు. 

 దర్యాప్తు సంస్థలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎందుకు విచారిస్తున్నయ్ అని నడ్డా ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ సాధన కోసం అమరులైన వారి ఆశయాలకు కేసీఆర్ తూట్లు పొడుస్తున్నారని దుయ్యబట్టారు.

బీఆర్ఎస్ రానున్న రోజుల్లో వీఆర్ఎస్గా మారి అంతరించిపోతుందని నడ్డా జోస్యం చెప్పారు. చాలు దొర.. సెలవు దొర నినాదంతో జనంలోకి వెళ్లి కేసీఆర్ ప్రభుత్వానికి స్వస్తి పలుకుతామని స్పష్టం చేశారు.  ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగురుతాను అన్నట్లుగా కేసీఆర్ అతిగా ఆలోచిస్తుండని అంటూ త్వరలోనే కేసీఆర్ వీఆర్ఎస్ తీసుకునే సమయం ఆసన్నమైందని నడ్డా తేల్చి చెప్పారు. 

కరీంనగర్ గడ్డ బీజేపీ అడ్డా అని..కార్యకర్తల కష్టం వల్లే తాను గెలిచానని పేర్కొంటూ అవమానాలకు తాను భయపడనని సంజయ్ స్పష్టం చేశారు.  పింక్ జెండాతో అపవిత్రమైన తెలంగాణను కాషాయ జెండాతో పవిత్రం చేయమని జాతీయ నాయకత్వం సూచించిందని తెలిపారు. అందుకే ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టినట్లు చెప్పారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles