బావ కళ్లలో ఆనందం చూడడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఏమైనా చేశారో లేదో తెలియదు గానీ.. బామ్మర్ది కళ్లలో క్రోధం చూడడానికి, బామ్మర్ది ఏలుతున్న రాష్ట్రంలో ఆయన పరువు తీయడానికి బావ మాత్రం తన శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నారు. ఏపీలో పర్యటనలో భాగంగా ఆయన జగన్ పేరు ప్రస్తావించకుండానే.. ఆయన పాలన మీద పంచ్ లు వేస్తున్నారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల్లో.. పక్క రాష్ట్రాల్లో పుట్టినా బాగుంటుంది అనే భావన ఏర్పడింది’ అని జగన్ చెల్లెలు షర్మిల భర్త, బావ బ్రదర్ అనిల్ కుమార్ వ్యాఖ్యానించడం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా ఉంది.
విశాఖ జిల్లా భీమిలి సమీపంలో ఒక క్రైస్తవ మినిస్ట్రీస్ లో క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బ్రదర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ.. జగన్ పథకాల మీద, తీరు మీద ఆయన సెటైర్లు వేశారు. ‘తమ స్వార్థం కోసం ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ఆధారపడొద్దు’ అని అనిల్ అనడం విశేషం. దేవుడి పథకాలు వేరేగా ఉంటాయని పరోక్షంగా నర్మగర్భపు వ్యాఖ్యానాలు చేశారు. జగన్ కు చురకలు అంటించేలా బ్రదర్ అనిల్ పంచ్ లు వేస్తున్నప్పుడెల్లా కార్యక్రమంలోని జనం చప్పట్లు కొట్టడం విశేషం.
చెల్లెలు షర్మిల- అన్న జగన్ కుటుంబాల మధ్య విభేదాలు ఉన్న సంగతి రెండు తెలుగు రాష్ట్రాల్లోను అందరికీ తెలిసిందే. జగన్ తో పూర్తిగా విభేదించి, తెలంగాణలో ఓ రాజకీయ పార్టీ స్థాపించి.. అక్కడ సీఎం కావడమే లక్ష్యం అంటూ షర్మిల పాదయాత్రలతో దూసుకెళ్తోంది. వారి అమ్మ విజయమ్మ కూడా పూర్తిగా కూతురుతోనే ఉంటూ, ఆమెకు అండగా నిలుస్తోంది. ఇటీవలి కాలంలో షర్మిల అరెస్టులు, ఆమె పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించడం వంటి సంఘటనలు జరిగినా కూడా.. జగన్ కనీసం పట్టించుకోలేదు. చెల్లెలిని పరామర్శించలేదు కూడా. తనకు సంబంధం లేని వ్యక్తులతో వ్యవహరించినట్లుగానే వ్యవహరించారు.
జగన్ అవినీతి గురించి షర్మిల కూడా తెలంగాణలో కొన్ని ఇంటర్వ్యూలో నర్మగర్భ విమర్శలు చేయడం జరుగుతూ వస్తోంది. కాగా తాజాగా బ్రదర్ అనిల్ కుమార్.. విశాఖ ప్రాంతంనుంచే విమర్శలు చేయడం విశేషం. ఏపీలోని ప్రజలు పొరుగు రాష్ట్రాల్లో పుట్టినా బాగుండునని అనుకుంటున్నారంటూ.. ఆయన చేసిన వ్యాఖ్య చాలా తీవ్రమైనది. ఏపీలో పుట్టడమే పాపం అని.. జగన్ పాలన పట్ల విసిగిపోయిన వారు అనుకుంటున్నారు అని అర్థం వచ్చేది. సొంత బావే జగన్ పాలన గురించి ఇలా అంటున్నారనే అంశాన్ని వాడుకుని, ప్రతిపక్షాలు కూడా జగన్ పాలన మీద విమర్శలు కురిపించడానికి, సెటైర్లు వేయడానికి సిద్ధమవుతున్నాయి. ఆల్రెడీ బావ పంచ్ లపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది.