సీబీఐ కేసులున్నోళ్లకే జగన్ టాప్ ప్రయారిటీ!

Monday, December 23, 2024

‘‘సైన్యంబు చెడుగైన దండనాధుని తప్పు’’ అని ఒక సూక్తి ఉంటుంది. సైన్యం దారితప్పిపోతే.. తప్పుడు వ్యక్తులుగా ఉంటే, ఖచ్చితంగా ఆ సైన్యాధిపతిదే తప్పు అని దీని భావం. పార్టీలో నాయకులు తప్పుడు వ్యక్తులు అయిఉంటే.. ఖచ్చితంగా అది పార్టీ అధినేత తప్పు అవుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఇంకా చిత్రంగా ఉంది. పార్టీ అధినేత, నెంబర్ టూ నేత.. వీళ్లందరూ స్వయంగా సీబీఐ కేసుల్లో ఉన్నవాళ్లు కాబట్టి.. తమ పార్టీలో టాప్ ప్రయారిటీ దక్కాలంటే, పెద్దపీట వేయాలంటే.. సీబీఐ కేసులు ఉండడాన్ని ఒక క్వాలిఫికేషన్ గా పరిగణిస్తారా అని కూడా అనిపిస్తోంది. జగన్ చేసిన తాజా నియామకం అలాంటి అభిప్రాయాన్నే కలిగిస్తోంది. 

గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గానికి అదనపు ఇన్చార్జిగా కత్తెర సురేష్ కుమార్ ను వైసీపీ అధిష్ఠానం నియమించింది. ఈ ‘అదనపు’ పోస్టులో ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్ ను తాజాగా గుంటూరు జిల్లా అధ్యక్షుడిని చేశారు. నిజానికి తాడికొండలో ఉన్నది వైసీపీ ఎమ్మెల్యేనే. ఇంకో ఇన్చార్జి అనవసరం. కానీ.. వైసీపీ ఎమ్మెల్యే తాడికొండ శ్రీదేవికి చెక్ పెట్టడానికి, నియోజకవర్గంలో ఆమె సాగిస్తున్న అవినీతి దందాల మీద నిఘా పెట్టడానికి వైసీపీ ఇక్కడ అదనపు ఇన్చార్జిని నియమించింది.  నియమించారు సరే.. కానీ కత్తెర సురేష్ కుమార్ లాంటి వివాదాస్పద, సీబీఐ కేసులున్నవ్యక్తిని ఇంత కీలకపోస్టులో నియమించడం పార్టీలోనే పలువురిని విస్మయానికి గురిచేస్తోంది. అవినీతి, అక్రమాల ఆరోపణలతో సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న వారిని ముఖ్యమంత్రి జగన్ అదనపు ప్రేమతో ఆదరిస్తారేమో అని జనం అనుకుంటున్నారు.

కత్తెర సురేష్ కుమార్.. క్రిస్టియన్ మత ప్రచారకుడు. ఆయన భార్య హెన్రీ క్రిస్టినా గుంటూరు జడ్పీ ఛైర్మన్ గా ఉన్నారు. ఆయన హార్వెస్ట్ ఇండియా సొసైటీ అనే సంస్థను స్థాపించి.. ఆ ముసుగులో భారీ ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్టుగా కేసులు నమోదు అయ్యాయి. FCRA నిబంధనలకు విరుద్ధంగా విదేశీ నిధులు తరలించారనే ఆరోపణలపై ఆయనపై సీబీఐ కేసులు నమోదు చేసింది. అరెస్టు అయ్యారు. ఆయన సంస్థ హార్వెస్ట్ ఇండియా అనుమతులను కూడా రద్దుచేశారు. అంతటి వివాదాస్పదుడు అయిన కత్తెర సురేష్ కుమార్ ను తాడికొండ నియోజకవర్గానికి ఇన్చార్జిని చేయడం.. వచ్చే ఎన్నికల్లో ఉండవిల్లి శ్రీదేవి స్థానంలో కత్తెర సురేష్ కుమార్ పోటీచేస్తారని స్థానికంగా పార్టీలో ప్రచారం జరగుతుండడం విశేషం. 

తాడికొండ ఎమ్మెల్యే ఉండవిల్లి  శ్రీదేవి తొలినుంచి వివాదాస్పదంగానే ఉన్నారు. ఆమె సీఐని ఫోనులో దారుణమైన భాషలో బెదిరించిన ఆడియో రికార్డింగ్ తో వార్తల్లోకి వచ్చారు. పేకాట క్లబ్ లు నిర్వహిస్తుంటారనే పేరుంది. అధిష్ఠానం పట్ల కూడా లెక్కలేనితనంతో వ్యవహరిస్తారని పార్టీలో వారు అంటుంటారు. ఆమెకు చెక్ పెట్టడానికి మొన్నటిదాకా డొక్కా మాణిక్యవరప్రసాద్ ను అక్కడ అదనపు ఇన్చార్జిగా పార్టీ నియమించింది. ఆయనకు జిల్లా పదవి అప్పగించిన తర్వాత.. ఆ స్థానంలో.. అంతకంటె అవినీతి పరుడుగా ముద్ర ఉన్న, వివాదాస్పద బిషప్ కత్తెర సురేష్ కుమార్ ను తీసుకువచ్చారు. అవినీతిపరుల్ని వైసీపీ ప్రోత్సహిస్తుందనే ప్రచారానికి ఇలాంటి నిర్ణయాలు మరింత బలం ఇస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles