చేర్చుకొనే పార్టీ కోసం  జేడీ లక్ష్మీ నారాయణ అన్వేషణ!

Monday, December 30, 2024

వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించడం ద్వారా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ మరోసారి వార్తలలోకి వచ్చారు. అయితే ఏ పార్టీ  అభ్యర్థిగా పోటీ చేయాలో ఇంకా తెలియక తన ఆలోచనలకు భావాలకు దగ్గరగా ఉన్న పార్టీ తరఫున పోటీ చేస్తాను అని ప్రకటించారు. పైగా, మన వ్యవస్థలో స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం కూడా ఉందని అంటూ ఏ పార్టీ దగ్గరకు రానీయని పక్షంగా స్వతంత్రంగా పోటీ చేస్తానని కూడా వెల్లడించారు. 

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాజకీయ కారణాలతో నాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సీబీఐ కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేయడంలో సూత్రధారిగా వ్యవహరించిన అప్పటి   సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణకు కు మీడియాలో మంచి ప్రచారం లభించింది. దానితో `ఓ తిమింగలం వంటి అవినీతి రాజకీయ నాయకుడు’ని అరెస్ట్ చేసిన `హీరో’గా ప్రచారం కూడా పొందారు. 

అయితే ఆ ప్రచారం అంతా తన ఘనత అనుకోని, అప్పటి నుండి రాజకీయాలలో ప్రవేశించాలని ఆసక్తి పెంచుకున్నారు. ఐపీఎస్ సర్వీస్ కు రాజీనామా చేసి, ఏపీ రాజకీయాలలో చక్రం తిప్పాలని ఎన్నో ఆలోచనలతో వచ్చారు. అయితే ఆయన ప్రభుత్వ పదవిలో ఉండగా ఆయనను `హీరోగా’ అభివర్ణిస్తూ, ఆయన చుట్టూ తిరిగిన రాజకీయ నాయకులూ అందరూ ఆయన రాజీనామా చేసి వచ్చాక ముఖం చాటేయడం ప్రారంభించారు. 

దానితో, ఏదైనా ఒక పార్టీలో చేరాలా లేదా సొంతంగా ఓ పార్టీ ప్రారంభించాలా తేల్చుకోలేక తికమక చెందారు. కొంతకాలం పాటు రైతు సమస్యల అధ్యయనం అంటూ గ్రామాల వెంట తిరిగారు. ఒక వంక బీజేపీలో, మరో వంక టీడీపీలో చేరేందుకు ప్రయత్నించినా ఆయా పార్టీల నుండి సుముఖత వ్యక్తం కాకపోవడంతో చివరకు జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. 

గౌరవనీయమైన ఓట్లు తెచ్చుకున్నప్పటికీ ఆ ఎన్నికలలో జనసేన ఘోరంగా విఫలం కావడంతో, అక్కడ ఉంది లాభం లేదనుకున్నారో ఏమో ఆ తర్వాత ఆ పార్టీ ముఖం చూడనే లేదు. వాస్తవానికి ఐపీఎస్ అధికారిగా ఉండగానే పలువురు బిజెపి ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లి ఆయనను సికింద్రాబాద్ నుండి పోటీ చేయమని 2014లోనే కోరారు. అయితే అప్పుడు బిజెపి గెలిచే అవకాశం లేదని, ఓటమి చెందితే తమ కుటుంభం పోషణ సంగతి ఏమిటి? అంటూ ప్రశ్నించారు. సమాధానం లేక ఆగిపోయారు. 

2019 ఎన్నికల సమయంలో సహితం బిజెపి, టిడిపి నేతల నుండి స్పష్టమైన ఆహ్వానం లేకపోవడంతో ఆయా పార్టీలలో చేరలేక పోయారు. విద్యావంతులు, ఒక రకంగా నీతిమంతుడు అనే ప్రతిష్ట ఉన్న వ్యక్తిని భరించడం కష్టం అనుకోని బిజెపి నేతలు పార్టీలో చేరమని అంటూనే ముఖం చాటేస్తూ వచ్చారు. టిడిపి ప్రోద్భలంతోనే వై ఎస్ జగన్ ను సిబిఐ అధికారిగా అరెస్ట్ చేశారనే విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, ఆ పార్టీ నుండి సహితం ఆహ్వానం లభించలేదు. 

ఇప్పటికి నాలుగు సార్లు టిడిపి అధినేత చంద్రబాబునాయుడును కలిశారు. పరామర్శలు తప్పా తమ పార్టీలో చేరమని మతమాత్రంగానైనా ఆయన ఆహ్వానించలేదని తెలుస్తున్నది. అదే విధంగా బీజేపీలో అమిత్ షా, వెంకయ్యనాయుడు వంటి అగ్రనేతల నుండి రాష్ట్ర స్థాయి నేతలు అనేకమందిని, పలు సార్లు కలిశారు. ఆర్ఎస్ఎస్ ప్రముఖులు అనేకమందిని కలవడమే కాకుండా సంఘ్ పరివార్ కార్యక్రమాలకు సహితం హాజరవుతున్నారు. 

అయితే `ఆర్ధిక నేరస్థుల’ పట్ల చూపుతున్న ఆసక్తిని బిజెపి నేతలు విద్యావంతులు, ఆలోచనాపరులు, మంచి ఇమేజ్ ఉన్నవారి పట్ల చూపడంలేదని విమర్శలు నెలకొన్నాయి. తిరిగి పవన్ కళ్యాణ్ పార్టీలో చేరదామంటే స్థిరమైన విధానాలు లేని పార్టీలో ఇమడటం గురించి ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పుడు కూడా బిజెపి లేదా టిడిపిలో ఎవ్వరు ఆహ్వానిస్తే ఆ పార్టీలో చేరాలని సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పలుమార్లు సమాలోచనలు జరిపినప్పటికీ ఆయా పార్టీ నాయకులు సాగదీస్తూ రావడమే గాని నిర్దుష్టంగా సమాధానం ఇవ్వకపోవడంతో విసుగు చెందిన్నట్లున్నారు. అందుకనే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు తనకు తానే ప్రకటించినట్లు కనిపిస్తున్నది. 

గత ఎన్నికలలో ఓటమి చెడినా తరచూ విశాఖపట్నం సందర్శిస్తూ అక్కడి ప్రజలతో సంబంధాలు కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేసే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను రాష్ట్ర హైకోర్టులో సవాల్ చేసి, న్యాయపోరాటం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయడంకు  వ్యతిరేకంగా అక్కడ పోరాటం జరుపుతున్న వారికి సంఘీభావం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles