రాష్ట్రంలో రాజకీయం హాట్ హాట్ గా తయారవుతోంది. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య పరస్పర విమర్శల స్థానంలో ఆరోపణలు, నిందలు, దూషణలు అన్నీ చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీ వారి కార్యక్రమాన్ని భగ్నం చేయడం, సక్సెస్ కానివ్వకుండా అడ్డుపడడం అధికార పార్టీకి అలవాటుగా మారిపోతోంది. తెలుగుదేశం కార్యక్రమాలు గానీ, జనసేన కార్యక్రమాలు గానీ సక్సెస్ కాకుండా ఉండడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ– ప్రభుత్వం దన్నుతో పోలీసుల అండ చూసుకొని రకరకాల కుయుక్తులు పన్నుతున్న వైనం మనం ప్రతి చోటా గమనిస్తున్నాం. ఆ క్రమంలో భాగంగానే చంద్రబాబు సభకు హాజరయ్యే వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను కట్ చేస్తామని బెదిరించడం కూడా జరుగుతోంది.
నెల్లూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు నిర్వహించిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొని జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకపోకడలను ప్రశ్నించినందుకు ఆమె మీద ఎమ్మెల్యే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ మహిళ భర్త పంచాయతీ పంప్ ఆపరేటర్ గా పని చేస్తూ ఉంటే అతడిని విధులు నుంచి తొలగించాలని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆదేశించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఆమె కుటుంబానికి సంక్షేమ పథకాలు కత్తిరించాలని హెచ్చరించడం కూడా విమర్శలకు గురైంది. ప్రభుత్వానికి భజన చేస్తే మాత్రమే పథకాలు ఇస్తారా? ప్రభుత్వాన్ని ఒక్క మాట అంటే ఉద్యోగాలను కూడా పీకేసి వేధిస్తారా? అనే ఆలోచన, భయం ఈ ప్రభుత్వం పట్ల ప్రజలలో ఏర్పడింది. దానికి తోడు చంద్రబాబు నాయుడు సభలకు హాజరయ్యే ప్రజల మీద వైసీపీ శ్రేణులు ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు కార్యక్రమాలకు ఎవరెవరు హాజరవుతున్నారు ఫోటోల సహా సేకరించి వారి వారి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను కోత పెట్టడానికి ఒక వ్యూహరచన చేస్తున్నారు.
అధికారంలో ఉన్న వారి కార్యక్రమాలకు డ్వాక్రా మహిళలను బలవంతంగా తరలించి సభికుల్లాగా వాడుకోవడం, సభ జయప్రదం అయిందని డప్పు కొట్టుకోవడం చాలా మామూలుగా జరుగుతున్న సంగతే. సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం ఎక్కడ జరిగినా పొదుపు సంఘాల మహిళలను పెద్ద సంఖ్యలో అక్కడకు తరలిస్తుంటారు. కేవలం సీఎం కార్యక్రమం మాత్రమే కాదు, ఎమ్మెల్యేలు గడపగడపకు కార్యక్రమంలో పాల్గొన్నా కూడా అక్కడ మందీమార్బలం మెండుగా కనిపించడానికి ఆయా ప్రాంతాల్లో ఉండే పొదుపు సంఘాల మహిళలందరినీ తరలి రావలసిందిగా పురమాయిస్తుంటారు. నిజానికి ‘గడపగడపకు’ అనేది సింపుల్ గా ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ చేపట్టవలసిన కార్యక్రమం అయినప్పటికీ దాదాపుగా అన్నిచోట్ల అదొక ఊరేగింపు లాగా ఎమ్మెల్యేలు ఆర్భాటంగా నిర్వహిస్తుండడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు డ్వాక్రా మహిళలు రాకపోతే వారికి రుణాలు రావని ప్రభుత్వ బెనిఫిట్స్ అందని వారి మోడరేటర్ల ద్వారా బెదిరించి మరీ కార్యక్రమాలకు రప్పించడం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమాలకు బలవంతంగా రప్పించడం ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు కార్యక్రమాలకు వెళితే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని బెదిరించడం ఇంకొక ఎత్తుగా ప్రస్తుతం నడుస్తోంది.
చంద్రబాబు ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమానికి పొదుపు సంఘాల మహిళలు ఎవరైనా హాజరైతే గనుక వారి మీద కఠిన చర్యలు ఉంటాయని డిఆర్డిఏ అధికారులు వాట్సాప్ కాల్స్ ద్వారా బెదిరిస్తూ ఎవరు వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. చంద్రబాబు కార్యక్రమాలకు వెళ్లే పొదుపు సంఘాల మహిళల ఫోటోలు తీయాలని సభల్లో విస్తృతంగా ఫోటోలు సేకరించి ఎవరైనా పొదుపు సంఘాల మహిళలు అక్కడ ఉంటే వారికి భవిష్యత్తులో రుణాలే రాకుండా అడ్డుకోవాలని పార్టీ అధికారుల్ని ఆదేశిస్తోంది. అధికారులే స్వయంగా చంద్రబాబు కార్యక్రమాలకు వెళితే మీ ఖర్మ అంటూ హెచ్చరిస్తున్నారనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.
ఇలాంటి హెచ్చరికలు బెదిరింపులు ద్వారా చంద్రబాబు నాయుడు కార్యక్రమాలకు వెళ్లకుండా ప్రజలను, పొదుపు సంఘాల మహిళలను ఆపడం సాధ్యమవుతుందేమోగానీ రేపు ఎన్నికల రోజు వచ్చినప్పుడు తెలుగుదేశానికి ఓటు వేయకుండా వాళ్ళను ఆపడం కుదురుతుందా. చంద్రబాబు మీద నిజంగా ప్రజల్లో అభిమానం గౌరవం నమ్మకం ఉంటే గనుక ఇలాంటి బలవంతపు ఆంక్షలు బెదిరింపుల ద్వారా వాటిని కట్టడి చేయడం సాధ్యమేనా? ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడితే ప్రజల దృష్టిలో ప్రభుత్వానికి మరింతగా పరువు పోదా అని ప్రజలు అనుకుంటున్నారు.