ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ నోటీసులు జారీ చేయడంతో ఎఫ్ఐఆర్ పేరు లేకుండా తనను ఎందుకు పిలిచారు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్యెల్సీ కవిత ధర్మసందేహం వ్యక్తం చేశారు. అయితే వ్యవస్థపై నమ్మకంతో విచారణకు తాను సహకరిస్తాను అంటూ ఏదో దయతలస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆమె వాదన నిజామైతే, తెలంగాణ పోలీసుల ఆధ్వర్యంలోని సిట్ ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కు ఏవిధంగా నోటీసులు వరుసగా జారీ చేస్తున్నారో? అన్న అనుమానం కలుగుతుంది. ఈ కేసులో ఆయన ప్రమేయం ఉండిఉండొచ్చని సిట్ ను అనుమానాలు ఉండవచ్చు లేదా వారి వద్ద ఏవైనా ఆధారాలు ఉంది ఉండవచ్చు.
కానీ ఎఫ్ఐఆర్ లో ఎక్కడా ఆయన పేరు లేకపోవడం గమనార్హం. పైగా, 41 ఏ సిఆర్ పీ సి కింద నోటీసు ఇచ్చారు. కవితకు గౌరవంగా సెక్షన్ 160 కింద కేవలం సమాచారం కోసం సాక్షిగా అన్నట్లు సీబీఐ నోటిస్ ఇచ్చింది. బిఎల్ సంతోష్ కు అయితే ఓ నిందితుడిని పిలిచినట్లే పిలిచారు. విచారణకు హాజరు కానీ పక్షంలో అరెస్ట్ కూడా చేస్తామని బెదిరించారు.
చట్టం ముందు అందరు సమానులయితే, సీఎం కుమార్తెగా తనకు ప్రత్యేక హోదా ఉంటుందని కవిత భావిస్తున్నారు. వాస్తవానికి సీబీఐ నోటీసులు జారీ చేయగానే డిసెంబర్ 6న విచారణకు అందుబాటులో ఉంటానని చెప్పిన టీఆర్ఎస్ ఎమ్యెల్సీ కవిత రోజుకొక మాట మారుస్తున్నారు. ఆ మరుసటి రోజే తనకు ఎఫ్ఐఆర్, హోమ్ మంత్రిత్వ శాఖ చేసిన ఫిర్యాదు ప్రతులు ఇవ్వాలంటూ సీబీఐకి లేఖ వ్రాసారు.
సిబిఐ గౌరవంగా తమ వెబ్ సిట్ లో వాటిని చూసుకో వచ్చని ఆమెకు సమాధానం ఇచ్చారు. అయితే వెబ్ సిట్ అంతా వెతికినా ఎక్కడా తన పేరు లేదు గదా అంటూ అమాయకంగా ఆమె ఓ ప్రశ్న వేశారు. ముందుగా విచారణకు డిసెంబర్ 6న అందుబాటులో ఉంటానని చూపిన ఆమె, తర్వాత ఆ రోజు వీలు కాదంటూ సమాధానం ఇచ్చారు. ముందే ఖరారైన కార్యక్రమాలు ఉండటంతో ఆ రోజు విచారణకు రాలేనని చెబుతూ
ఆమె సీబీఐ అధికారి రాఘవేంద్ర వత్సకు లేఖ రాశారు. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో అందుబాటులో ఉంటానని చెబుతూ ఆ రోజుల్లలో ఏదో ఒక రోజు తనను విచారణ చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. ఇదంతా ఏదో ఒక సాకుతో కాలయాపన చేయడానికి తప్పా ఆమెకు మరో ఉద్దేశ్యం ఉన్నట్లు కనిపించడం లేదు.
కాగా, సీబీఐ ఎఫ్ఐఆర్లో తన పేరులేదన్న కారణంతో ఎమ్మెల్యే కవిత విచారణకు హాజరుకానని చెప్పడం పట్ల న్యాయవాది, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రచనా రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. విచారణకు ఎఫ్ఐఆర్ లో పేరుండవలసిన అవసరం లేదని అంటూ, ఆ విధమైన సలహా కవితకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.