బీసీలు గౌరవం కోరుకుంటారని జగన్‌కు తెలుసా?

Friday, November 22, 2024

ఎంత కాదనుకున్నా సరే.. రాజకీయాలు సమస్తంగా కులమయం అయిపోయాయి. కుల ప్రాతిపదికనే పరిపాలన సమస్తం కూడా నడుస్తూ ఉంటుంది. పార్టీలు, ప్రభుత్వాలు కూడా కులాల వారీగా బిస్కట్ పథకాలు ప్రకటించి వాళ్లను సంతృప్తి పరచే ప్రయత్నంలో ఉంటాయి. అయితే సంక్షేమం అంటే అర్థం, ఒక కులానికి మేలు చేయడం అంటే అర్థం.. వారికి కేవలం బిస్కట్ పథకాలను, సంక్షేమ పథకాలను ప్రకటించడం మాత్రమేనా? ఇంకేమీ లేదా? అనేదే ఇప్పుడు చర్చ. 

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది కాస్తా రూపుమారిపోయిందనే అభిప్రాయం పలువురిలో ఉంది. ప్రజాస్వామ్యం అంటేనే అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం ఉండే వ్యవహారంగా మనం భావిస్తాం. కానీ.. ఒక్క చాన్స్ అనే నెపం మీద వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఇక ‘అన్ని వర్గాలూ’ అనే మాటకు అర్థమే లేకుండా పోయింది.  ‘ప్రభుత్వం’ అనగా ‘ఏక కుల వ్యవస్థ’ అనే అర్థం ఏర్పడింది. దీనిని ప్రజాస్వామ్యం అని ఎలా అంటాం? ఒక కులం, ఒక కుటుంబం, ఒక వ్యక్తి అతని తైనాతీలు కలిసి పరిపాలన సాగిస్తుంటే.. అది రాజరికం అవుతుంది గానీ.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లేనప్పుడు ప్రజాస్వామ్యం అనిపించుకోదు. 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో కులాల తూకం కనిపిస్తుంది. కానీ వారెవ్వరికీ అధికారం ఉండదు. పదవులు ఉంటాయి.. పని ఉండదు! నిర్ణయాలలో వారి పాత్ర ఉండదు. అదే సమయంలో కులాల వారీగా ఫలానా పనిచేస్తున్నాం.. అంటూ ప్రభుత్వం ఊదరగొట్టేసి అదే తమ ఘనతగా చాటుకుంటుంది. 

రాష్ట్రంలో అధికారం మొత్తం ఒకే ఒక్క కులం రాజ్యమేలుతుందని అందరూ ఈసడించుకుంటున్న వేళ.. ప్రభుత్వం జయహో బీసీ మహాసభ నిర్వహిస్తోంది. ఈ నెల 7వ తేదీన విజయవాడలో చాలా పెద్ద స్థాయిలో సభ నిర్వహించడానికి అధికార పార్టీ సన్నాహాల్లో ఉంది. బీసీలకు తాము ఎంత గొప్పగా మేలు చేస్తున్నామో.. బీసీలు బాగుపడాలంటే జగన్ తప్ప మరో గత్యంతరం ఎందుకు లేదో వివరించడానికి ఈ సభను వాడుకుంటారన్నమాట. బహుశా బీసీలకు మరికొన్ని బిస్కట్ వరాలను కూడా ప్రకటించవచ్చు. అయితే.. ఈ సభ సందర్భంగా ప్రజల మదిలో మెదలుతున్న సందేహం ఒక్కటే. బీసీలను బాగు చేయడం అంటే వారికి బిస్కట్ పథకాలను ప్రకటించడం మాత్రమేనా? బీసీలకు ఆత్మగౌరవం ఉంటుందని, వారు కూడా గౌరవం కోరుకుంటారని, తమ నిర్ణయానికి విలువ దక్కాలని అనుకుంటారని ముఖ్యమంత్రి జగన్ కు తెలుసా? అనే ప్రశ్న బీసీ వర్గాల నుంచి వినిపిస్తోంది. మనుషులకు ఎలాంటి విలువ ఇచ్చే అలవాటు లేని జగన్.. కేవలం సంక్షేమం ముసుగులో తలా కొంచెం విదిలించడం ద్వారా అన్ని కులాలను మభ్య పెట్టి మోసం చేయాలనుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles