అధికారంలో ఉన్నవారెవరైనా తమ ప్రభుత్వ పనితీరు గురించి తెలియచెప్పే ఓట్లు అడుగుతూ ఉండటం సహజం. కానీ మన దేశంలో నేడు ఏ అధికార పక్షం కూడా తమ ప్రభుత్వాన్ని చూసి కాకుండా, తాము ప్రతిపక్షాలపై నిత్యం సంధించే దుర్భాషలు, విమర్శలు చూసి ఓట్లు వేయమని అడుక్కునే దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది.
మూడున్నరేళ్ల పాలనలో కొత్తగా ప్రజలలో మంచిపేరు సంపాదించుకోలేక పోవడమే కాకుండా, సొంత పార్టీ శ్రేణులు, సామజిక వర్గంలో కూడా వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక వంక టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, మరోవంక జనసేన నేత పవన్ కళ్యాణ్ లపై నిత్యం విమర్శలు సంధిస్తూ వారిని ఎన్నుకుంటే జాగ్రత్త అన్నట్లు ప్రజలను హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారు.
ఆయన మంత్రివర్గంలో అందరికన్నా ఎక్కువగా చంద్రబాబు, పవన్ లను దూషించడంలో సినీ నటి, మంత్రి రోజా ఎల్లప్పుడూ ముందువరసలో ఉంటున్నారు. టిడిపిలోనే రాజకీయ అరంగ్రేటం చేసి, చంద్రబాబు ప్రోత్సాహంతోనే దశాబ్ద కాలం పాటు ఆ పార్టీలో మేటి నాయకురాలిగా రాటుతేలిన రోజా, ఆ తర్వాత అక్కడుంటే లాభం లేదనుకొని వై ఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
అయితే కాంగ్రెస్ లో చేరికకు సూచికగా ఆమె ఆతిధ్యం స్వీకరించేందుకు చిత్తూర్ వైపు వెడుతూ రాజశేఖర్ రెడ్డి అకాల మరణానికి గురయ్యారు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డితో చేరి రెండు సార్లు ఎమ్మెల్యే కాగలిగారు. ఆలస్యంగానైనా మంత్రి పదవి చేపట్టారు. అయితే, వైసిపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆమెకు సొంత నియోజకవర్గంలో, జిల్లాలో కూడా పార్టీలో, ప్రజలలో ఏమాత్రం పెరగడం లేదు.
ఆమె పేరుతో నగిరి నియోజకవర్గంలో నిత్యం చేస్తున్న దందాలకు ఆమె సొంత అనుచరులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె నియోజకవర్గంలో ఆమె పార్టీ కీలక నాయకులెవరూ ఆమెను లెక్కచేయడం లేదు. పరిస్థితి గ్రహించిన జగన్ సహితం ఆమెను తీవ్రంగా వ్యతిరేకించే వారికి పదవులు కట్టబెడుతున్నారు.
ఆమె మంత్రి అయినా ఉమ్మడి చిత్తూర్ జిల్లాలో అంత సీనియర్ మంత్రి డా. రామచంద్రారెడ్డి పెత్తనమే చెల్లుబాటు అవుతుంది. ఆమెను ఎవ్వరు లెక్కచేయడం లేదు. దానితో ఆమెకు మళ్ళి సీట్ ఇస్తే వైసిపి ఓటమి తధ్యమని ఆమె పార్టీ వారే బహిరంగంగా చెబుతున్నారు. గత నెలలో జరిగిన ఎమ్యెల్యేల సమావేశంలో స్వయంగా జగన్ నియోజకవర్గంలో ఆమె పరిస్థితి బాగోలేదని తేల్చి చెప్పేసారు.
దానితో వచ్చే ఎన్నికల్లో ఆమెకు ఎమ్యెల్యే సీటు రావడం అనుమానాస్పదంగా మారింది. సీట్ ఇచ్చినా ఆమె గెలవడం దుర్లభమని ఆమె పార్టీ వారే స్పష్టం చేస్తున్నారు. దానితో నియోజకవర్గంలో తన పరిస్థితి మెరుగు పరచుకునేందుకు పార్టీ కార్యకర్తలను దగ్గరకు తీసే ప్రయత్నం చేయకుండా, నిత్యం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను కఠినమైన పదజాలంతో దూషిస్తూ ఉండటం ద్వారా ముఖ్యమంత్రి దృష్టి ఆకర్షించి, మరోసారి ఎమ్మెల్యే కావాలని ఆమె తంటాలు పడుతున్నట్లు కనిపిస్తున్నది.
తాజాగా, 30 ఏళ్ళ తర్వాత చివరి ఛాన్స్ అంటుంటే.. ఇదేం ఖర్మరా బాబూ అని చంద్రబాబును ఆమె ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ప్రజలు తరిమికొట్టినా మళ్ళీ ఇదేం ఖర్మరా బాబూ? అని ఆమె ఎద్దేవా చేశారు. టూరిస్ట్ బాబు.. వీకెండ్ బాబులను 2024లో మరోసారి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ ధ్వజమెత్తారు.
తన నియోజకవర్గం నగిరిలో తానేమి చేశానో చెప్పుకోలేని రోజా తరచూ కుప్పం నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నారు. ఉమ్మడి చిత్తూర్ జిల్లాలో అత్యంత అవినీతిపరులైన శాసన సభ్యులు ఎవ్వరంటే వైసిపి వారెవరిని అడిగినా ఆమె పేరే చెప్పే పరిస్థితి నెలకొంది. చిన్న చిన్న ఉద్యోగుల పోస్టింగ్ లకు, ప్రభుత్వ కార్యక్రమాలకు, సంక్షేమ పథకాలకు ఆమె ఏజెంట్ లకు ముడుపులు చెల్లించనిదే పనులు కానీ పరిస్థితి నెలకొంది.
మరోవంక, సొంత పార్టీ నేతలలో ఎవ్వరితోను ఆమెకు చెప్పుకోదగ్గ సంబంధాలు లేవు. ఆమె ధోరణి పట్ల వారే విసుగు చెందుతున్నాను. మంత్రిగా ఆమె పనితీరు పట్ల ముఖ్యమంత్రి సహితం అంత సంతృప్తిగా లేరని చెబుతున్నారు. పనితీరు బాగోలేదని మంత్రులకు సహితం వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వబోమని జగన్ ఎప్పుడో స్పష్టం చేశారు. ఆయన ప్రస్తావించిన మంత్రులలో మొదటి వరుసలోనే రోజా ఉన్నారని అన్ని పత్రికలు దాదాపుగా వ్రాసాయి. అటువంటి కధానాలను ఆమె గాని, ఆమె పార్టీ గాని ఎప్పుడు ఖండించక పోవడం గమనార్హం.