ఏకం సత్ విప్రా బహుధా వదన్తి అని పెద్దలు చెబుతుంటారు. అంటే ఒకే విషయాన్ని పది మంది పది రకాలుగా అర్థం చేసుకుంటారు అని అర్థం. ఇప్పుడు అమరావతి రాజధాని విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా అలాగే కనిపిస్తోంది. సుప్రీం కోర్టు ఒక విస్పష్టమైన తీర్పు ఇచ్చిన తరువాత.. దానిని ఎవరికి తోచినట్టుగా వారు అర్థం చేసుకుంటున్నారు. తీర్పులోని అంశాలను ఎటూ మార్చలేరు గనుక.. ఎవరికి తోచినట్టుగా వాళ్లు భాష్యం చెప్పుకుంటున్నారు.
సుప్రీం కోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. కీలకమైన సంగతి ఏంటే.. ‘‘రాజధాని వికేంద్రీకరణ అనే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదు’’ అనే మాట అనడానికి, తమ తీర్పులో పేర్కొనడానికి హైకోర్టుకే అధికారం లేదు అనే విషయంలో తాము జోక్యం చేసుకోం అని తేల్చి చెప్పింది. ఇది అమరావతి రైతులకు ఊరట. ఈ విషయంలో ఇంకా సుదీర్ఘకాలం విచారణలు సాగాల్సి ఉన్నదని తేల్చి చెప్పింది. న్యాయరాజధానిని, హైకోర్టును ఎక్కడ పెట్టబోతున్నారు? ఎక్కడకు తరలించబోతున్నారు? అనే అంశానికి సంబంధించి.. సుప్రీం న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వ న్యాయవాదులు తలా ఒక రీతిగా జవాబులు చెప్పారు.
హైకోర్టు తీర్పు ఇవ్వడానికి ముందే.. అధికార వికేంద్రీకరణ చట్టం రద్దయిపోయిందని, రద్దయిపోయిన చట్టం గురించి తీర్పు ఇచ్చే అధికారం హైకోర్టుకు లేదని.. ఒకే మాట పట్టుకుని దానిచుట్టూ తిరుగుతూ తమ వాదనలు వినిపించడానికి ప్రభుత్వ న్యాయవాదులు ప్రయత్నించారు. హైకోర్టు విషయంలోనూ సుప్రీం న్యాయమూర్తులు స్పష్టంగా అడుగుతోంటే.. అమరావతిలో ఉన్నదని, కర్నూలుకు తరలుతుందని, ఆ చట్టం రద్దయింది గనుక ఇక్కడే ఉన్నట్లు అనుకోవాలని, ఈరోజు వరకు అమరావతిలోనే అని రకరకాలుగా జవాబులు చెప్పడమే ప్రభుత్వ న్యాయవాదుల బుకాయింపు వైఖరికి నిదర్శనంగా ప్రజలు భావిస్తున్నారు.
అయితే.. నెలలోగా మౌలిక వసతులు కల్పించాలి, ఆరునెలల్లోగా నిర్మాణాలు పూర్తిచేయాలి వంటి విషయాల మీద మాత్రమే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ అంశాన్ని పట్టుకుని వైసీపీ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు ప్రతిపక్షాలకు చెంపపెట్టు అని వారు మురిసిపోతున్నారు.
అదే సమయంలో.. ‘‘రాజధాని మార్చే శాసనాధికారం అసెంబ్లీకి లేదన్న హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడం కుదరదు’’ అన్నటువంటి సుప్రీం వ్యాఖ్యలను విస్మరిస్తున్నారు. అది నిజానికి రాజధాని రైతులకు మేలు చేసే అంశం. కానీ అనేకమార్లు.. న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నలు ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతున్నాయి. పనులు చేపట్టడంపై ఇచ్చిన స్టే కూడా గొప్ప విషయమేం కాదు. ఎందుకంటే.. ఎప్పటిలోగా చేపట్టగలరో, పూర్తి చేయగలరో తదుపరి విచారణ కాలానికి ప్రభుత్వం అఫిడవిట్లు వేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పుతోనైనా బుద్ధి తెచ్చుకోకుండా ప్రభుత్వం చెలరేగడమే తమాషా.
సుప్రీం తీర్పుతోనైనా బుద్ధి వస్తుందా?
Wednesday, November 27, 2024