తాను ప్రశ్నించేవాడిని అంటూ నిత్యం చెప్పుకొనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల నాటికి తన రాజకీయ ప్రయాణంపై నిర్దిష్టమైన నిర్ణయంకు రాలేక తికమక పడుతున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటి వరకు ఏదో ఒక పార్టీని లేదా నాయకుడిని గెలిపించేందుకు పనిచేశామని, ఇక తాము గెలవడం కోసం పని చేస్తామని చెప్పుకొన్నప్పటికీ సొంతంగా రాజకీయ వ్యూహం ఏర్పర్చుకోలేక పోతున్నట్లు స్పష్టం అవుతున్నది.
2019 ఎన్నికలలో మొదటిసారిగా పోటీచేసి, స్వయంగా తాను రెండు చోట్ల ఓటమి చెందడమే కాకుండా మొత్తం పార్టీ అభ్యర్థులు చెప్పుకోదగిన ప్రాబల్యం చూపలేక పోవడంతో ఒక విధంగా ఖంగు తిన్నారు. కేవలం ఒక అభ్యర్థి గెలుపడినా, ఎన్నికలయిన మరుసటి రోజు నుండే అతను వైసీపీతో జతకడుతూ ఉండడంతో ఒంటరిగా మిగిలి పోయారు.
అయితే అనూహ్యంగా బిజెపితో పొత్తు పెట్టుకోండి, ఇద్దరం కలసి ముందుకు వెడతామని ప్రకటించి రెండేళ్లు అవుతున్నా రెండు పార్టీలు కలసి ఇప్పటి వరకు ఒక కార్యక్రమం కూడా ఉమ్మడిగా చేయలేదు. పైగా, రాష్ట్రంలో బిజెపి నాయకత్వం అధికార వైసీపీకి `బి’ ఏజెంట్ గా వ్యవహరిస్తూ ఉండటం తో దిక్కుతోచక ఉండిపోయారు.
అటువంటి సమయంలో వైసిపి వ్యతిరేక ఓట్ చీలకుండా టిడిపి, బీజేపీలతో కలసి పొత్తుకు సై అనడం, అందుకు టీడీపీ సానుకూలంగా స్పందించడంతో రాజకీయంగా ఒకింత చలనం కనిపించింది. విశాఖపట్నం పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ దమననీతిని స్వయంగా చూసిన పవన్ వద్దకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చి అప్రజాస్వామిక ధోరణులను కలసి వ్యతిరేకిద్దామని పిలుపివ్వడంతో ఉమ్మడి రాజకీయ పోరాటాలకు సిద్ధం అనే సంకేతం ఇచ్చారు.
కానీ ఇంతలో విశాఖపట్టణం వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పిలిపించుకొని మాట్లాడి `చంద్రబాబుతో తొందరపడి చేతులు కలపవద్దు’ అనే సంకేతం ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. దానితో చంద్రబాబు, మోదీ లలో ఎవ్వరిని విశ్వాసంలోకి తీసుకోవాలో అర్ధం కాక పవన్ కళ్యాణ్ తికమక పడుతున్నట్లు తెలుస్తున్నది.
కలసినప్పుడు చంద్రబాబునాయుడు స్పష్టంగా తన అభిప్రాయం చెప్పిన్నట్లు చెబుతున్నారు. `దళారుల మాటలు విని, ఊహాలోకంలో విహరింపకుండా వాస్తవ పరిస్థితులను బట్టి ఇద్దరం కలసి నిర్ణయాలు తీసుకొందాం’ అని ప్రతిపాదించినట్లు తెలుస్తున్నది. మరోవంక, చంద్రబాబు, పవన్ కలవకుండా చూడమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి సహకారం కోరారని ప్రచారం జరుగుతున్నది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎక్కడకు వెళ్లినా పెద్ద సంఖ్యలో జనం వస్తున్నప్పటికీ జనసేన పార్టీకి సంస్థాగత స్వరూపం పటిష్టంగా లేదు. కనీసం ఎన్నికలలో పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులు సహితం లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి పరిస్థితులలో ఒంటరిగా పోటీ చేసితే మరోసారి రాజకీయంగా పరాభవం తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ పర్యాయం కూడా రాష్ట్ర శాశన సభలో తగు ప్రాతినిధ్యం సంపాదించలేని పరిస్థితులలో రాజకీయంగా పవన్ భవిష్యత్ కు గడ్డుకాలం కాగలదు.
అందుకనే రాజకీయంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఆత్మహత్యాసదృశ్యం కలగాలని గ్రహించి నెమ్మదిగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో విశేష ప్రజాదరణ గల నేతగా ఉంటున్నప్పటికీ ఏపీలో ఆ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నదని పవన్ కు తెలుసు.
2019లో నోటా కన్నా తక్కువ ఓట్లు పొందిన బీజేపీ పరిస్థితి ఇప్పుడు మరింత దారుణంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. పైగా, మోదీ ప్రభుత్వ విధానాల పట్ల ఏపీ ప్రజలలో ఆగ్రవేశాలు నెలకొన్నాయి.
అయితే, ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దారుణమైన హింసాయుత పద్ధతులకు దిగవచ్చని,దౌర్జన్యాలతో తమ కార్యకర్తలను ఎన్నికల ప్రచారం చేసుకో నీయకుండా అడ్డుకోవచ్చని, పోలింగ్ బూత్ లను ఆక్రమించ వచ్చనే భయంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో సయోధ్య కోసం పవన్, చంద్రబాబు ఆరాటపడుతున్నారు.