వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణాలో తమ ఆధిపత్యం ఏర్పాటు చేసుకోవాలని గత ఏడాది కాలంగా రాజకీయ పోరాటాలలో తలమునకలై ఉన్న టీఆర్ఎస్, బిజెపి మునుగోడు ఉపఎ న్నికలతో అలసి పోయిన్నట్లు కనిపిస్తున్నది. ఎన్ని ప్రయాసలతో గెలుపొందిన బీజేపీలో గెలిచిన ఉత్సాహం కనిపించడం లేదు.
మొత్తం శక్తిసామర్ధ్యాలు ప్రయోగించినా గెలుపొందలేక పోయిన బీజేపీలో రాజకీయంగా టీఆర్ఎస్ పై గెలుపొందగలమనే నమ్మకం సడలింనట్లు కనిపిస్తున్నది. అందుకనే తమ అధికార పరిధిలోని దర్యాప్తు సంస్థలతో పరస్పరం పోరాటాలకు దిగుతున్నట్లు స్పష్టం అవుతున్నది.
చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారం, అక్రమ గ్రానైట్ వ్యాపారం, ఆదాయపు పన్ను శాఖకు పన్నుల ఎగవేత ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు గత కొంతకాలంగా తెలంగాణాలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. కేవలం టిఆర్ఎస్ కు అవసరమైన ఆర్ధిక వనరులు సమకూరుస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరుగుతున్నట్లు స్పష్టం అవుతున్నది.
వచ్చే ఎన్నికల నాటికి టిఆర్ఎస్ ఆర్ధిక వనరులను కట్టడి చేయడమే బిజెపి లక్ష్యంగా కనిపిస్తున్నది. 2019 ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ లో ఇదేవిధమైన వ్యూహంతో టిడిపి ఆర్ధిక వనరులను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. తాజాగా తెలంగాణ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి, కుటుంభం సభ్యులు, బంధువులు, సన్నిహితులపై రెండు రోజులపాటు ఐటీ అధికారులు జరిపిన సోదాలు రాజకీయ కలకలం రేపాయి.
హైదరాబాద్ రీజియన్ పరిధిలోని ఐటీ అధికారులతో పాటు ఒడిశా, కర్ణాటక నుంచి వచ్చిన 400 మందికి పైగా ఐటీ అధికారులు, సిబ్బంది 65 బృందాలుగా ఏర్పడి సోదాలు జరిపి రూ 10.50 కోట్ల మేరకు నగదు సీజ్ చేశారు.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో క్యాసినో వ్యవహారంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను, గ్రానైట్ వ్యవహారంలో మంత్రి గంగుల కమలాకర్ లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు జరుపుతున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసీఆర్ కుమార్తె కవిత లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు భావిస్తున్నారు.
ఈడీ, ఐటి, సిబిఐ దర్యాప్తు బృందాలు 11 మంది టిఆర్ఎస్ నేతలు లక్ష్యంగా దాడులు చేపట్టిన్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నది.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఇక ఆర్థికంగా ఓ రేంజ్ లో ఉన్న ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, అరికెపూడి గాంధీ, ఆశన్నగారి జీవన్ రెడ్డి తదితరులపై కేంద్ర దర్యాప్తు బృందాలు దాడులు చేస్తాయని భావిస్తున్నారు.
ఎమ్యెల్యేల కొనుగోలు కేసుతో కేసీఆర్ ఎదురు దాడి
అయితే, కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులతో బెంబేలు పడకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్యెల్యేల కొనుగోలు కేసుతో బిజెపి అగ్రనాయకులు లక్ష్యంగా ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఏకంగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ నే విచారణకు రమ్మనమని సుమ్మాన్లు పంపడంతో బిజెపి వర్గాలు ఖంగారు పడుతున్నాయి.
`సంతోష్ కే సమన్లు పంపుతారా?’ అంటూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకోవడం గమనార్హం. పైగా, సంజయ్ కు సన్నిహితుడైన న్యాయవాది శ్రీనివాస్ ను మూడు రోజుల పాటు విచారణ జరపడం, అతని నుండి రాబట్టిన పేర్ల ఆధారంగా మరి కొందరికి సహితం సామాన్లు జారీ చేసేందుకు సిద్ధపడటం బిజెపిని ఆత్మరక్షణలో పడవేస్తుంది.