తెలుగుతెర యిలవేల్పుల్లో ఒకరు ఘట్టమనేని కృష్ణ (80) కన్నుమూశారు. కార్డియాక్ అరెస్టుతో ఆస్పత్రిలో చేరిన నటశేఖరుడు మంగళవారం ఉదయం అస్తమించినట్టుగా హైదరాబాదులోని కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ధ్రువతారల్లో ఒకరైన కృష్ణ మనకికలేరు.
1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు జన్మించిన కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి (79). కార్డియాక్ అరెస్టుతో సోమవారం హైదరాబాదులోని ప్రెవేటు ఆస్పత్రిలో ఆయనను చేర్చారు. మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. తెలుగు సినిమా ప్రపంచాన్ని శోకంలో ముంచేసి కృష్ణ వెళ్లిపోయారు.
ఎన్టీఆర్ కు దీటైన మొనగాడు
ఎదురులేని మొనగాడు వంటి చిత్రాలు అనేకం తీశారు కృష్ణ. కానీ ఆయన నిజజీవితంలో కూడా మొనగాడే. తెలుగు సినిమా పరిశ్రమను నందమూరి తారకరామారావు ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్నప్పుడు.. ఆయనకు పోటీగా సినిమాలు తీసిన ఘనత కృష్ణది. అలాగే అక్కినేని నాగేశ్వరరావు మీద కూడా పోటీగా సినిమాలు తీశారు. ఎన్టీఆర్ తాను అల్లూరు సీతారామరాజు పాత్ర చేయాలని అనుకుంటున్న సమయంలోనే.. కృష్ణ .. ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రం పూర్తి చేసేశారు. కృష్ణ సినిమా వచ్చేసింది గనుక.. మళ్లీ అదే చిత్రం చేయడం బాగుండదని ఎన్టీఆర్ వెనక్కు తగ్గారు. అయితే.. ఆ సినిమా చూసిన తర్వాత.. కృష్ణను కలిసిన సందర్భాలో.. ‘చాలా బాగా చేశావని, నేనైతే అంత బాగా చేసి ఉండేవాడిని కాదని’ ఎన్టీఆర్ స్వయంగా అన్నారు. అంతటి ప్రతిభాశీలి కృష్ణ.
సినిమా రంగంనుంచే ఎన్టీఆర్ కు, భిన్నమైన, తన సొంత సామ్రాజ్యాన్ని కలిగిఉన్న నటశేఖర కృష్ణ.. ఆయన రాజకీయాల్లోకి వచ్చాక ఇంకా తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెసు పార్టీతో అనుబంధం ఉన్న కృష్ణ ఎన్టీఆర్ నటజీవిత ప్రస్థానాన్ని, రాజకీయ జీవితాన్ని ఎద్దేవా చేస్తూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో తొలితరం పొలిటికల్ సెటైర్ సినిమాలను తీశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా తీసుకున్న కీలక నిర్ణయాల మీద వ్యంగ్యంగా సినిమాలు తీసి మెప్పించిన ఘనత కృష్ణది.
ఎక్కడా తాను నమ్మిన భావజాలం, నమ్మిన సిద్ధాంతాలు, తన రాజకీయ భావాలు ఏవీ మార్చుకోకుండా.. ఎవరికీ లొంగకుండా, ఎవరికీ భయపడకుండా, అధికారం కోసం పదవులకోసం అర్రులు చాచకుండా, అధికారం ఉన్నవారికి గులాంగిరీ చేయకుండా తన సొంత వ్యక్తిత్వాన్ని కాపాడుకున్న సూపర్ స్టార్ కృష్ణ 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
ఆయన మృతికి ఆంధ్రావాచ్ డాట్ కామ్ ప్రగాఢ సంతాపం తెలియజేస్తోంది.