రుషికొండ అనే ప్రాంతాన్ని.. ఓ రహస్య ప్రాంతంలాగా ప్రభుత్వం కాపాడుతోంది. రుషికొండ వైపుగా నరమానవులెవ్వరూ వెళ్లకుండా కట్టడి చేస్తోంది. కాస్త అతిశయంగా చెప్పాలంటే.. కేజీఎఫ్ సినిమాలో గోల్డ్ మైన్స్ ను కాపాడినట్లుగా బాహ్యప్రపంచంనుంచి ఎవ్వరూ రుషికొండలో అడుగేపెట్టడానికి లేదన్నట్టుగా పోలీసు పహరా మధ్య రుషికొండలో ప్రభుత్వం తలపెట్టిన పనులు జరుగుతున్నాయి. అయితే ఇటీవలి కాలంలో.. కేవలం పవన్ కల్యాణ్ మాత్రమే ఆ సమీపానికి వెళ్లగలిగారు. అక్కడి పనుల తీరును పరిశీలించగలిగారు. ఎంచక్కా రుషికొండ పనులను పరిశీలిస్తున్న పవన్ కల్యాణ్ ఫోటోలు మీడియాలో కూడా వచ్చాయి. అయితే.. అక్కడ కాపలా ఉన్న పోలీసులకు మాత్రం.. పవన్ టూర్.. ఇబ్బంది తెచ్చపెట్టింది. ఉన్నతాధికారులు ఆ పోలీసులందరికీ స్పెషల్ క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది.
రుషికొండ అనేదేదో నిషిద్ధ ప్రాంతంలాగా ప్రభుత్వం దారుణ భద్రతను మెయింటైన్ చేస్తోంది. కట్టడాల సమయంలో పురుగును కూడా అటువైపు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న సర్కారు.. రేపుపొద్దున్న ముఖ్యమంత్రి నివాసాన్ని, ప్రభుత్వ కార్యాలయాల్ని వారు తలపోస్తున్నట్టుగా అక్కడ ఏర్పాటు చేస్తే.. ప్రజలను వాటిచెంతకు రానిస్తారా? లేదా, కిలోమీటర్ల దూరంలో నిలిపేస్తారా? అనేది కూడా అర్థం కాదు.
టూరిజం ముసుగు తొడిగి, ప్రభుత్వ కార్యాలయాలు, సీఎం క్యాంప్ ఆఫీసుకోసం రుషి కొండ మొత్తాన్ని సర్వనాశనం చేసేస్తున్నారనే సంగతి.. మీడియా ఫోటోల ద్వారా ప్రజలకు తెలుస్తూనే ఉంది. అయితే నిర్మాణాలు మొదలైన నాటినుంచి ఎవ్వరికీ అటువైపు అనుమతి లేదు. తెలుగుదేశం నాయకులు రుషికొండ పరిశీలనకు వెళ్లాలనుకున్నా.. వారిని వెళ్లనివ్వలేదు. కమ్యూనిస్టులను కూడా అడ్డుకున్నారు. సాధారణ పౌరులను కూడా వెళ్లనివ్వడం లేదు. అలాంటిది.. ప్రతి తప్పుపై ప్రభుత్వంపై నిప్పులు చెరగుతూ ఉండే పవన్ కల్యాణ్ ఎలా వెళ్లగలిగారు. పవన్ కల్యాణ్ వెళ్లిన సమయంలో ఆయన బృందం వారు డ్రోన్ తో తీసిన విజువల్స్ బయటకు వచ్చేవరకు.. రుషికొండలో ప్రభుత్వ విధ్వంసం ఏ స్థాయిలో జరుగుతోందో తాజా పరిస్థితి ఏంటో ఎవ్వరికీ తెలియదు. కానీ అక్కడిదాకా వెళ్లడానికి పవన్ కల్యాణ్ పోలీసుల్ని బోల్తా కొట్టించాల్సి వచ్చింది.
విశాఖలో బసచేసిన పవన్ కల్యాణ్ ఏదో యథాలాపంగా బీచ్ కు వెళుతున్నట్టుగా వెళ్లారు. అక్కడివరకే ప్రోగ్రాంలో ఉంది. బీచ్ కు సరదాగా వెళుతున్నట్లు వెళ్లిన పవన్ కల్యాణ్ పై పోలీసులు పెద్దగా ఫోకస్ పెట్టలేదు. అటునుంచి ఒక్కసారిగా పవన్ రుషికొండ వైపు వచ్చేశారు. అది పోలీసులకు అనూహ్యం. దాంతో వాళ్లు కట్టడి చేయలేకపోయారు. ఈలోగా పవన్ తో ఉండే మీడియా బృందం.. ఫోటోలు,వీడియోలు, డ్రోన్ విజువల్స్ బాగానే కేప్చర్ చేసింది. ఇదంతా జరిగినందుకు ఆ తర్వాత పోలీసులకు ఉన్నతాధికారులు క్లాస్ కూడా పీకరు. బహుశా ఇప్పుడు ప్రభుత్వం రుషికొండ వద్ద మరింత ఘోరంగా భద్రతను ఏర్పాటుచేస్తుందేమో తెలియదు. అయినా ప్రజల కోసం కట్టే భవనాల వద్ద.. ప్రజలకు ఎంట్రీ కూడా లేకుండా ఈ ప్రభుత్వం ఏం గూడుపుఠానీ చేస్తున్నదో కూడా ప్రజలకు అర్థం కావడం లేదు.