22 నుండి ఉద్యమ పంథాలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు

Thursday, December 19, 2024

మరో ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలను ఇప్పటివరకు అమలు పరచని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు కత్తులు నూరుతున్నారు. తమ పోరాటాల ద్వారా ఈ ప్రభుత్వంకు గుణపాఠం చెప్పేందుకు ఉద్విక్తులవుతున్నారు. ఇప్పటికే దశలవారీగా నిరసనలు జరిపినా మాటలు చెప్పడమే కానీ అమలు చేయని ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అందుకనే ఈ నెల 22 నుండి దశలవారీ ఆందోళనలకు సమాయత్తం అవుతున్నారు. ఇటీవల రాజమండ్రిలో జరిగిన  ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సర్వ సభ్య సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మే 22న అన్ని తాలూకా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలతో నిరసన కార్యక్రమాలు ప్రారంభిస్తామని ఈ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు.

జూన్ నెలలో బీఆర్ అంబేడ్కర్, మహాత్మా గాంధీ విగ్రహాల వద్ద విజ్ఞాపన పత్రాలు ఇస్తామన్నారు. జులై 5, 6 తేదీలలో నంద్యాల, కర్నూలు జిల్లాల్లో మొదలుపెట్టి అక్టోబరు నెలాఖరకు అన్ని జిల్లా కేంద్రాల్లో బహిరంగ ప్రదర్శనలు చేపడతామని స్పష్టం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో ఉద్యోగులతో ఆటలాడుతుందని మండిపడ్డారు. అక్టోబరు 31 న చలో విజయవాడకు పిలుపునిస్తామని ప్రకటించారు.

ప్రతినెలా రావాల్సిన పింఛన్, జీతం కూడా ఉద్యోగులకు ఏ రోజు వస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నామని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బాకీ పడ్డ రూ. 20 వేల కోట్లు రాత్రికి రాత్రి ఇవ్వమనడం లేదని, అయితే వేల కోట్లు రూపాయలు పెండింగ్ లు పెట్టేసి చేతులెత్తేసే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.  ఒక నిర్దిష్టమైన కాలపరిమితిలో చెల్లిస్తామని ఒక చట్టాన్ని చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించాలని గతంలో గవర్నర్ కలిసి విన్నవించుకున్నారు.

తమ పట్ల రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు ధోరణిలో వ్యవహరిస్తూ ఉండడంతో ఉద్యోగుల నియామకాలు, సర్వీస్ వ్యవహారాలు గవర్నర్ నియంత్రణలోనే ఉండాలని కోరుతున్నారు. గవర్నర్ ను కలిసి సమస్యలు చెప్పుకుంటే వాళ్లను తీవ్రవాదులుగా చూస్తున్నారని ఉద్యోగసంఘ నాయకులు వాపవుతున్నారు.  ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేయడమే కాకుండా ఉద్యోగులపై అక్రమ కేసులు కూడా పెట్టారని ఆరోపిస్తున్నారు.

పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరే పరిస్థితి కనిపించడం లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాని కార్యదర్శి జి.ఆస్కార్ రావు విమర్శించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా వారు దాచుకున్న సొమ్ము ప్రభుత్వం వాడేసుకోడం ఏమిటని ప్రశ్నించారు. పీఆర్సీ సహా చాలా సమస్యలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ సమస్యల పరిష్కారం కోసం దశల వారీ ఉద్యమానికి ఈ నెల 22 నుంచి ఈ కార్యాచరణ మొదలు అవుతుందని ఆస్కార్ రావు ప్రకటించారు.  అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు ఉద్యమ కార్యాచరణకు కలిసి రావాలని పిలుపు ఇచ్చారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles