వైఎస్ జగన్ పాలనను అంతమొందించడమే లక్ష్యంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సాగిపోతున్న `యువగళం’ పాదయాత్ర మంగళవారం మరో మైలురాయిని అధిగమించింది. లోకేష్ చేపట్టిన పాదయాత్ర 138వరోజు గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం అరవపాలెం వద్ద పాదయాత్ర 1800 కి.మీ. మజిలీకి చేరుకుంది.
ఐదు నెలలుగా యాత్ర సాగిస్తున్నారు. మధ్యలో మహానాడు, ఎన్నికలు వంటి రెండు, మూడు సందర్భాలలో మినహా విరామం లేకుండా యాత్ర సాగుతుంది. ఇప్పటికే రాయలసీమలో యాత్రను పూర్తి చేసుకున్న ఆయన ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ జిల్లాలో టిడిపి బాగా బలహీనంగా ఉన్నట్లు భావిస్తున్న సూళ్లూరుపేటలో యాత్ర జరుపుతున్నారు.
138వరోజు సూళ్లూరుపేట నియోజకవర్గంలో పూర్తయి గుణపాటిపాలెం వద్ద గూడూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. గూడూరు నియోజకవర్గ ప్రజలు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు యువనేతకు హారతులు పడుతూ, పూలవర్షం కురిపించి అపూర్వ స్వాగతం పలికారు.
అడుగడుగునా వివిధవర్గ్లాల ప్రజలు లోకేష్ కు ఎదురేగి, తాము ఎదుర్కొంటున్న సమస్యలు విన్నవించుకున్నారు. అన్నమేడులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ప్రజలనుంచి అపూర్వ స్పందన లభించింది. అనంతరం యువనేత పాదయాత్ర పొడవునా వివిధ వర్గాల ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు.
మరో ఏడాదిలో రాబోయే చంద్రబాబు ప్రభుత్వం అందరి సమస్యలకు పరిష్కారం చూపుతుందని భరోసా ఇచ్చారు.138 వ రోజు యువనేత లోకేష్ 19.2 కి.మీ. పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1806 కి.మీ. పూర్తయింది. ఈ సందర్భంగా శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. వైసిపి పాలనలో కుదేలైన ఆక్వారంగానికి, టీడీపీ అందించబోయే ప్రోత్సాహకాలు ఊతమిస్తాయని ప్రకటించారు.
నాలుగేళ్లుగా జగన్ పాలన లో జనం నరకం అనుభవిస్తున్నారని, టిడిపి హయాంలో ఇళ్లు కట్టుకున్న పేదలకు సైకో జగన్ బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నాడని లోకేష్ ఆరోపించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
కులమతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుతున్నారని మండిపడుతూ అందరూ కలిసి పనిచేస్తేనే రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకువస్తామని చెప్పుకొచ్చారు. గతంలో తాము చేసిన కార్యక్రమాలు ప్రజలకు చెప్పుకోలేకపోయామని, అందుకే ఓడిపోయామని తెలిపారు.
జగన్ పాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వలన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జగన్ చెత్త పాలన కారణంగా రైతు ఆత్మహత్యల్లో ఏపి నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2గా ఉందని విమర్శించారు.