గత ఎన్నికలలో అనూహ్యంగా 151 సీట్లు గెల్చుకున్న మనం ఈ సారి మొత్తం 175 సీట్లను (వై నాట్ 175) గెల్చుకోలేమని కొద్దికాలంగా అంటూ, అన్నిటి సీట్లను వైసిపి గెల్చుకొంటుందని ధీమా వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చూస్తుంటే తడబాటుకు గురవుతున్నట్లు కనిపిస్తున్నది. తాజాగా తెనాలిలో జరిగిన బహిరంగసభలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం మీకుందా..? అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను ముఖ్యమంత్రి సవాల్ చేశారు.
ఇప్పటి వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను రెచ్చగొట్టి, వారిద్దరూ కలిసి ఎన్నికలలో పోటీచేయకుండా చేసేటట్లు చూడాలని మంత్రులు, ఇతర వైసిపి నాయకులు ప్రకటనలు ఇస్తుంటే ఇప్పుడు నేరుగా జగన్ రంగంలోకి దిగారు. నిజంగా తమ పార్టీ మొత్తం 175 సీట్లు గెల్చుకొంటుందనే ధీమా ఉన్నప్పుడు ప్రత్యర్ధులు ఎవ్వరు, ఏ విధంగా పోటీచేస్తే ఎందుకు భయపడాలి? అనే ప్రశ్న తలెత్తుతుంది.
టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసే వైసిపి గాలిలో కొట్టుకుపోతుందనే భయం జగన్ ను వెంటాడుతున్నట్లు ఆయన మాటలే స్పష్టం చేస్తున్నాయి. అయితే వైసిపి నేతలు ఎంతగా రెచ్చగొట్టినా చంద్రబాబు, పవన్ సహనం కోల్పోకుండా నిబ్బరంగా వ్యవహరిస్తున్నారు. తమవైన రాజకీయ ఎత్తుగడలతో జగన్ పాలనకు ముగింపు పలికే దిశలో ప్రయాణిస్తున్నారు.
మేనిఫెస్టోలో 98.5 శాతం హామీలను నెరవేర్చి ఓటు అడుగుతున్నాను అని చెబుతున్న జగన్ నిజంగా తన పాలన అంతదివ్యంగా ఉంటె ప్రభుత్వ వ్యతిరేకత ఎదురవుతుందనే భయం ఎందుకు? ” నేను చంద్రబాబుకు, దత్తపుత్రుడికి సవాల్ విసురుతున్నా.. 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు పోటీ చేసి గెలిచే ధైర్యం మీకుందా అని సవాల్ విసురుతున్నా” అంటున్న జగన్ తనకా ధైర్యం ఉంటె వారెన్ని సీట్లు గెలుస్తారనే ప్రసక్తి ఎందుకు తీసుకు రావాలి?
ఒకపక్కా 175 కు 175 సీట్లు గెలుస్తామంటారు. మరోవంక, ఎమ్యెల్యేలు, మంత్రులతో సమీక్షా సమావేశాలు జరుపుతూ “మీ పట్ల మీ నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇట్లాగైతే గెలవడం కష్టం” అంటూ ఆయనే స్వయంగా చెబుతూ వస్తున్నారు. అంటే, జనం తనకు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు గాని, తన పార్టీ ఎమ్యెల్యేలు, మంత్రులకు వేయడానికి సిద్ధంగా లేరని అనుకొంటుంన్నారా?
జగన్ మాటలలో లాజిక్ తప్పుతున్నది. ఆర్ధిక వ్యవస్థను అధ్వాన్నంగా మార్చిన ఆయన లెక్కలలో దారితప్పుతున్నట్లు అనుకోవాల్సి ఉంటుంది. ఇంతవరకు దేశంలో ఏ ఎన్నికలలో ఏ పార్టీ, ఏ నాయకుడు కూడా అన్ని సీట్లను గెల్చుకున్న దాఖలాలు లేవు. కానీ తాను గెల్చుకుంటాననే ధీమా నిజంగా ఉంటె ఈ విధంగా ప్రతిపక్షాలపై విరుచుకు పడాల్సిన అవసరం ఉండదు గదా!
తాను సొంతంగా నిర్వహించుకున్న సర్వే నివేదికలు జగన్ వద్ద ఉన్నాయి. ప్రభుత్వంలోని నిఘా విభాగం ఎప్పటికప్పుడు అందిస్తున్న నివేదికలు ఉన్నాయి. ప్రజలలో, చివరకు సొంత పార్టీ శ్రేణులలో తన ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకత గురించి తెలియక కాదు. కానీ మాటల గారడితో ప్రజలను వంచించే ప్రయత్నం గతంలో మాదిరిగా తిరిగి చేసే ప్రయత్నం చేస్తున్నట్లుంది.
నిజంగా అంత ధీమా ఉంటె, తన పర్యటనల సందర్భంగా ప్రతిపక్ష నేతలను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తెనాలి పర్యటన సందర్భంగా జనసేన పార్టీ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామిక అంటూ
జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వస్తే ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేయాలని ఏ చట్టం చెబుతోంది? అని ప్రశ్నించారు.
“అధికార పార్టీ నాయకులకు, అధికారులకు ఎందుకు అంత అభద్రతా భావం? ప్రజలన్నా, ప్రశ్నించే ప్రతిపక్షాలన్నా ముఖ్యమంత్రికి భయం. అందుకే ప్యాలెస్ నుంచి బయటకు రాకుండా… వచ్చినా పరదాల మాటున తిరిగే వ్యక్తికి భయం కాక మరేముంటుంది?” అంటూ ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి పర్యటన ముస్తాబుల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి విద్యుత్ సరఫరా నిలిపి రోగులను ఇబ్బందుల పాలు చేశారని మండిపడ్డారు. ఈ రోజు తెనాలి పట్టణంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం సృష్టించారని మనోహర్ విమర్శించారు. నాయకులను అరెస్టు చేయడం, ప్రజలను బయటకు రానీయకపోవడం, షాపులు మూయించడం… చూస్తుంటే రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారనిపిస్తుంది స్పష్టం చేశారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో భయానక వాతావరణం సృష్టించడమే వైసీపీ మార్కు పాలన అని ఎద్దేవా చేశారు.