వైఎస్‌ఆర్‌సిపికి, ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి పార్టీలో జరుగుతున్న పరిణామాలకు మనస్థాపం చెంది రెండు రోజుల క్రితం రాజీనామా ప్రకటించిన మాజీ ఎమ్యెల్యే పంచకర్ల రమేష్ బాబు జనసేనలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది.
ఈ నెల 17న మంగళగిరి వద్ద జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరేందుకు సిద్దపడుతున్నారు.
ప్రస్తుతం అభిమానులు,మద్దతు దారులతో సమాలోచనలు జరుపుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే జనసేన నేతలతో సంప్రదింపులు పూర్తయినట్లు చెబుతున్నారు. 2009లో ప్రజారాజ్యం ద్వారా రాజకీయ జీవనం ప్రారంభించిన ఆయన ఆ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నికై, ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైనప్పుడు ఆ పార్టీలో చేరారు. ఆ తర్వాత టిడిపి నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పంచకర్ల రాజీనామాతో విశాఖ జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైంది.
పెందుర్తి అసెంబ్లీ స్థానాన్ని ఆశించిన రమేష్ బాబు, టిక్కెట్ దక్కదని తేల్చి చెప్పడంతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పెందుర్తి నుంచి అదీప్ రాజ్ అన్నపురెడ్డి పోటీ చేసి గెలిచారు. ఈసారి తనకు అవకావం కల్పించాలని పంచకర్ల కోరినా ఫలితం లేకుండా పోవడంతో పార్టీని వీడినట్లు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సిపి కీలక నేత, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ రాజీనామా తొందరపాటు చర్య అని చెప్పారు. ఏదైనా తనతో చర్చిస్తే బాగుండేదని చెబుతూ పార్టీలో మొదటినుండి ఉన్నవారిని కాదని రమేశ్ కు జిల్లా అధ్యక్ష పదవిని ఇచ్చి గౌరవించామని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి జగన్ ను కలిసే అవకాశం తనకు రాలేదని పంచకర్ల అనడం అబద్ధమని సుబ్బారెడ్డి కొట్టిపారేసారు. సీఎంను కలవాలనే విషయం తనతో చెపితే తప్పకుండా ఆ విషయంలపై చర్చించేవారమని తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా రమేష్‌బాబు తన దృష్టికి తెచ్చిన సమస్యల్ని సిఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించానని చెప్పారు.
సిఎంఓ అధికారులు, జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తెచ్చానని, సిఎం విశాఖ వచ్చిన ప్రతిసారి ఆయనకు సిఎంను కలిసే అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు. మరో వారం రోజుల్లో అందరితో చర్చించి కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని చెప్పారు.