అనేక రకాలుగా తమను వంచించినందుకు రాష్ట్రప్రభుత్వం మీద మండిపడుతున్న ఉద్యోగ వర్గాలను ఊరడించడం ప్రధాన ఎజెండా! 11వ పీఆర్సీకి సంబంధించిన వ్యవహారాలను ఇంకా పూర్తిగా సెటిల్ చేయనేలేదు. ఇంతలోనే 12వ పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించింది. మన్మోహన్ సింగ్ ను ఛైర్మన్ గా ప్రకటించి, ఏడాదిలోపు నివేదిక అందజేయాల్సిందిగా ప్రభుత్వం ఈ కమిటీని ఆదేశించింది. అదే సమయంలో.. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని పీఆర్సీ కమిటీకి హింట్ ఇవ్వడం గమనార్హం.
11వ పీఆర్సీ అమలు విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు అనేక విధాలుగా భ్రష్టుపట్టిపోయింది. ఎందుకంటే.. ఉద్యోగులకు ఇస్తూ వచ్చిన ఐఆర్ కంటె తక్కువ వేతనం నికరంగా తేలేలా.. పీఆర్సీ ఫైనల్ సిఫారసులను రూపొందించి.. జగన్ సర్కారు ఒక వెరైటీ ట్రెండ్ ను సృష్టించింది. ఈ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ వర్గాలు భగ్గుమన్నాయి. ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికిపోయింది. చివరకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. 11వ పీఆర్సీ విషయంలో ప్రభుత్వం దారుణమైన వంచనకు పాల్పడిందనే అపకీర్తిని మాత్రం జగన్ సర్కారు తొలగించుకోలేకపోయింది. పైగా, ఇప్పటికి కూడా.. ఆ పీఆర్సీకి సంబంధించిన ఫలాలను పూర్తిస్థాయిలో ఉద్యోగులకు అందించకుండా.. ఇంకా దారుణంగా వ్యవహరిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో 12వ పీఆర్సీ ఏర్పాటు అనేది ఒక రకంగా ఉద్యోగులకు ఊరట అని చెప్పాలి.
కానీ.. ప్రభుత్వం తీరు మీద ఉద్యోగుల్లో అనేక సందేహాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే.. ఒకవైపు మాజీ ఐఏఎస్ మన్మోహన్ సింగ్ సారథ్యంలో 12వ పీఆర్సీ నియామక ఉత్తర్వులు జారీచేస్తూనే.. కమిషన్ తమ సిఫారసుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఆకాశాన్నంటుతున్న ధరలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పీఆర్సీ కమిషన్ లు తమ సిఫారసులు రెడీ చేయాలి. కానీ.. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని చేయమని సూచించడం అంటే.. ముందుగానే సదరు కమిషన్ కాళ్లకు బంధాలు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రభుత్వం సరైన సిఫారసులు ఇవ్వకుండా నామమాత్రంగా ఇచ్చేలా ముందే హింట్ ఇస్తున్నదని ఉద్యోగవర్గాలు మండిపడుతున్నాయి. ఏడాదిలోగా సిఫారసులు తయారుచేయాలని కొత్త పీఆర్సీకి గడువు విధించిన ప్రభుత్వం.. ఆ భారాన్ని రాబోయే ప్రభుత్వం మీదికి నెట్టేయదలచుకున్నట్టు స్పష్టంగానే తెలుస్తోంది.