హైదరాబాద్ లో పవన్, చంద్రబాబు కలిస్తే, తాడేపల్లిలో ఉలిక్కిపాటు!

Wednesday, November 20, 2024

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇంటికి హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రావడం, వారిద్దరూ రెండు గంటల సేపు భేటీ జరపడం ఏపీ రాజకీయాలలో కలకలం రేపుతున్నది. వీరిద్దరూ హైదరాబాద్ లో కలిస్తే తాడేపల్లిలో ఉలిక్కి పడుతున్నారు. మరోవంక జగన్ ప్రభుత్వానికి `రక్షాకవచం’గా ఉంటున్న బిజెపి నేతలు సహితం ఖంగుతిన్నారు. 

కుప్పంలో జరిగిన ఘటనతో చంద్రబాబుకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చానని పవన్, ముఖ్యంగా జీవో-1పైనే చర్చ జరిగినట్లు చంద్రబాబు చెప్పినప్పటికీ, వచ్చే ఎన్నికలలో రెండు పార్టీల మధ్య పొత్తు ప్రధాన అంశంగా మారుతుంది. 

వారిద్దరూ రాజకీయంగా దగ్గర కాకుండా ప్రధాని నరేంద్ర మోదీని ఉపయోగించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న విఫల ప్రయత్నాల నేపథ్యంలో ఏర్పడిన అస్పష్టతను తొలగించడం కోసమే ఈ భేటీ జరిగిన్నట్లు స్పష్టం అవుతుంది. జగన్ తో కుమ్ముక్కు రాజకీయాలకు పాల్పడుతున్న బిజెపి నాయకులకు ఈ భేటీ ఓ విధంగా చెంపపెట్టు అని చెప్పవచ్చు. 

తెలుగుదేశం- జనసేన పార్టీల మధ్య ఇక పొత్తులు లాంఛనప్రాయమేనని, పొత్తుల దిశగా పవన్ కల్యాణ్ ఓ అడుగు ముందుకు వేశారని ఈ భేటీ స్పష్టం చేస్తున్నది.  పొత్తు విషయంలో ఇరువురు నాయకులు నర్మగర్భంగా మాట్లాడటం గమనార్హం. ఎన్నికల సమయంలో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పగా, ఏదేమైనా జగన్ వ్యతిరేక ఓట్లు చీలకుండా, ఈ ప్రభుత్వాన్ని ఓడిస్తామని పవన్ స్పష్టం చేశారు.

“రాజకీయాల్లో పొత్తులు సహజం. కానీ పొత్తులకు ఇంకా సమయం ఉంది. ఎప్పుడు ఏం చేయాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై మాకు వ్యూహాలు ఉంటాయి. ఆ సమయం వచ్చినప్పుడు అందరితో మాట్లాడుతాం. పొత్తులపై ఆ సమయంలోనే నిర్ణయం తీసుకుంటాం” అని చంద్రబాబు పరోక్షంగా టిడిపి, జనసేనల మధ్య పొత్తు ఉంటుందనే సంకేతం ఇచ్చారు. 

 కేవలం జగన్ వ్యతిరేక ఓటర్లలో చీలిక తెచ్చే  విధంగా ఏపీలో కేసీఆర్ రాజకీయ విన్యాసాలు జరుపుతున్న నేపథ్యంలో బిఆర్ఎస్ రాష్ట్రంలో ప్రవేశించడాన్ని స్వాగతిస్తున్నట్లు పవన్ చెప్పడం ద్వారా ఇటువంటి `కుప్పిగంతులు’ తమను ఏమీ చేయలేవని భరోసాను వ్యక్తం చేసిన్నట్లయింది. 

చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీ నేపథ్యంలో తెలుగుదేశం- జనసేన పార్టీ మధ్య అధికారిక ప్రకటనలు, సీట్ల పంపకాలు మాత్రమే మిగిలి ఉన్నాయని రెండు పార్టీల వర్గాలు స్పష్టం చేస్తున్నారు. దసరా లోపుగా ఈ విషయమై కూడా స్పష్టత ఇస్తారని ఎంపీ రఘురామకృష్ణంరాజు పేర్కొనడం గమనార్హం. 

వీరిద్దరి భేటీ వైసీపీలో ఎటువంటి ప్రకంపనాలు సృష్టిస్తుందో కొందరు మంత్రులు చేసిన ప్రకటనలే అద్దం పడుతున్నాయి.  చంద్రబాబు దగ్గర పవన్‌ కల్యాణ్‌ ఊడిగం చేస్తున్నారని అంటూ అంబటి రాంబాబు తన అక్కసు వెళ్లగక్కుకున్నారు. టీడీపీ, జనసేన వేర్వేరు పార్టీలు అనుకోరాదని,  ఇవి రెండూ ఒకటే అని అంటూ తమ అసహనాన్ని వెల్లడించారు. 

‘బీజేపీతో ఉంటేనే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబుతో ఉంటే పవన్ సీఎం అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే.. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీకి అనేక అస్త్రాలు ఉన్నాయి. అటు వైఎస్సార్సీపీ.. ఇటు టీడీపీ చిన్నచిన్న పార్టీలను మింగేస్తాయి. అదే బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే.. పవన్ కళ్యాణ్‌కు లాభం…” అంటూ బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి తన తత్తరపాటును కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేశారు.

 “చంద్రబాబు-పవన్ కళ్యాణ్ కలిస్తే మీరెందుకు ఉలిక్కిపడుతున్నారు? ఇద్దరు కలిస్తే ఓడిపోతామన్న భయంతోనే మీరు అలా మాట్లాడుతున్నట్టు ఉంది” అంటూ  మాజీ హోంమంత్రి, టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప ధ్వజమెత్తారు. 

చంద్రబాబు, పవన్‌కల్యాణ్ కలిస్తే ప్రభంజనమేనని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తేల్చి చెప్పారు.  వైసీపీతో కలిసేందుకు ఒక్క పార్టీ కూడా ముందుకు రావడం లేదని పేర్కొంటూ పవన్‌-చంద్రబాబు భేటీతో వైసీపీ నేతలకు ప్యాంట్లు తడిసిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ఎందుకైనా మంచిది వైసీపీ నేతలు డైపర్స్‌ వాడితే మంచిది అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles