హైకోర్టు ముంగిటకు కేసీఆర్- గవర్నర్ తమిళసై వివాదం!

Friday, March 14, 2025

గత రెండేళ్లుగా గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుల మధ్య తలెత్తిన వివాదాలు చాలావరకు పరస్పరం విమర్శలు, ఆరోపణలకు పరిమితమవుతున్నాయి. ఈ వివాదాలపై ఇప్పటివరకు కేసీఆర్ బహిరంగంగా వాఖ్యానించక పోయినప్పటికీ గవర్నర్ వీలుచిక్కినప్పుడల్లా మీడియా ముందు తనను అవమాన పరుస్తున్నారని, తన విషయంలో ప్రోటోకాల్ పాటించడం లేదని అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

అయితే ఇప్పుడు రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న దృష్ట్యా వీరిద్దరి మధ్య ఘర్షణ హైకోర్టు ముంగిటకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిపబ్లిక్ డే పెరేడ్ విషయంలో వీరిద్దరి మధ్య తలెత్తిన వివాదంలో మరెవ్వరో హైకోర్టుకు వెడితే, కేంద్ర మార్గదర్శకాల ప్రకారం జరపాలని అంటూ న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వంకు ఆదేశాలు ఇచ్చింది.

అయితే, మొదటిసారిగా నేరుగా కేసీఆర్ ప్రభుత్వమే గవర్నర్ ధోరణిని తప్పుబడుతూ హైకోర్టును ఆశ్రయించడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ నుంచి అనుమతి పోవడంతో కేసీఆర్ ప్రభుత్వం ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఫిబ్రవరి 3న బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రాష్ట్ర గవర్నర్‌ ఆమోదం తెలపాల్సి ఉన్నందున, అనుమతి కోరుతూ ఈ నెల 21నే గవర్నర్‌కు లేఖ పంపింది. అయితే గవర్నర్‌ తమిళిసై మాత్రం ఇప్పటికీ అనుమతి తెలపలేదు. ఈ విషయమై స్పందించడం లేదు.

పైగా గవర్నర్‌ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి ఒక రిటర్న్‌ కమ్యూనికేషన్‌ వెళ్లింది. బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టేముందు గవర్నర్‌ ప్రసంగం ఉంటుందని, అందుకు సంబంధించిన కాపీ తమకు పంపారా? లేదా? అని గవర్నర్‌ కార్యాలయం ప్రభుత్వాన్ని కోరింది. 

గత ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం పంపిన ప్రసంగాన్ని పక్కన బెట్టి, కేంద్రాన్ని పొగుడుతూ గవర్నర్ డా. తమిళసై సొంత ప్రసంగం పంపడంతో ఆమె ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరిపారు. అదేమంటే, డిసెంబర్ లో జరిగిన సమావేశాలు ప్రోరోగో కాకపోవడంతో, ఆ సమావేశాలకు కొనసాగింపుగా జరుగుతున్న ఈ సమావేశాలలో గవర్నర్ ప్రసంగం అవసరం లేదంటూ ప్రభుత్వం వాదించింది.

అప్పటి నుండి అసెంబ్లీ సమావేశాలను ప్రోరోగో చేయకుండానే ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఈ సారి కూడా గవర్నర్ ప్రసంగం ప్రసక్తి లేకపోవడంతో గవర్నర్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తున్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 202 ప్రకారం బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ ఆమోదం తెలపాల్సివుండటంతో ఈ విషయమై ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

రాజ్యాంగంలో ఎక్కడా గవర్నర్‌ ప్రసంగించాలన్న విషయం లేదని పేర్కొంటూ బడ్జెట్ కు లింక్ పెట్టడం పట్ల ప్రభుత్వ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టికల్‌ 202 ప్రకారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ కచ్చితంగా ఆమోదం తెలపాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నాయి. ఆమోదం తెలపకపోవడం రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందని పేర్కొంటున్నాయి.

ఇతరత్రా విషయాల్లో గవర్నర్‌ తన విచక్షణను ప్రదర్శించవచ్చని, కానీ.. బడ్జెట్‌ ఆమోదం లాంటి విషయంలో మాత్రం గవర్నర్‌ విచక్షణ ప్రదర్శించే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నాయి. దానితో హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయ్హించింది. సోమవారం లంచ్ మోషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది.  సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవేను అందుకోసం రంగంలోకి దించింది.

ప్రజాపద్దును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు తక్షణమే అనుమతించేలా గవర్నర్‌కు ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరనుంది. ఈ పిటిషన్‌ చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ తుకారాంజీ నేతృత్వంలోని మొదటి కోర్టుకు వచ్చే అవకాశం ఉంది. అయితే గవర్నర్‌ పదవి రాజ్యాంగబద్ధమైనది కావడంతోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణ స్వీకారం చేయుంచేది కూడా గవర్నరే.

ఈ నేపథ్యంలో గవర్నర్‌ను ఏ విషయంలోనైనా.. నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించగలదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టులు గవర్నర్‌ను ఆదేశించజాలవని గతంలో పలు సందర్భాల్లో ఉన్నత న్యాయస్థానాలు తమ తీర్పుల్లో పేర్కొనడం గమనార్హం.

ఇలా ఉండగా, ప్రభుత్వం గతేడాది బడ్జెట్‌ సందర్భంగా కూడా గవర్నర్‌ ప్రసంగం లేకుండానే ప్రవేశపెట్టిన్నప్పుడు ప్రజా సంక్షేమం దృష్ట్యా, ప్రజాపద్దును దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌కు ఆమోదం తెలిపానని గవర్నర్‌ తమిళిసై గతంలో వెల్లడించారు. అయితే, ఈసారి మాత్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకే ఇప్పటిదాకా ఆమోదం తెలపలేదు.ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయిస్తే ఏవిధంగా స్పందిస్తారో చూడవలసి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles