హామీలు పట్టించుకోలేదని కేసీఆర్ పై పోలీసులకు ఫిర్యాదు

Friday, November 15, 2024

తన నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అమలు పరచకుండా గాలికి వదిలేశారని అంటూ భద్రాచలం కాంగ్రెస్ ఎమ్యెల్యే పొదెం వీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. సరిగ్గా ఏడాది క్రితం గోదావరి వరదల సందర్భంగా ముంపుకు గురయ్యిన ప్రజలను పరామర్శించడానికి వచ్చిన కేసీఆర్ ఇకముందు ఇటువంటి సమస్యలు లేకుండా చేస్తానంటూ ఎన్నో హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. 

భద్రాచలం పోలీస్ స్టేషన్‌లో ఎస్సై మధు ప్రసాద్‌కు ఫిర్యాదును అందజేశారు. అక్కడి ప్రజలకు గోదావరి వరదలతో ముంపు ప్రమాదం ఉన్న నేపథ్యంలో కరకట్ట నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కరకట్ట నిర్మాణం కోసం రూ. 1000 కోట్లు విడుదల చేస్తామని అప్పట్లో కేసీఆర్ ప్రకటించారు. వరదలతో నిరాశ్రయులైన బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. 

సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి సంవత్సరం గడిచినా ఆ రెండు హామీలు నెరవేరలేదని ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఫిర్యాదులో తెలిపారు.  ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ నెరవేర్చడంలో విఫలం అయ్యారని, అందుకే పోలీసుల సహాయాన్ని కోరుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అయితే ఎమ్మెల్యే ఫిర్యాదుపై భద్రాచలం పోలీసులు కేసు నమోదు చేస్తారా? లేదా? తెలియాల్సి ఉంది.  2022లో గోదావరి వరదలతో భద్రాచలంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. 

గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో పంట నష్టం, ఆస్తి నష్టం జరిగింది. వరదలు సంబంధించినప్పుడు పరిస్థితిని సమీక్షించడానికి భద్రాచలం వచ్చిన సీఎం కేసీఆర్.బాధితులకు ఇళ్లు కట్టించి ఇస్తామని, కరకట్ట ఎత్తు పొడిగిస్తామని ప్రకటించారు. భద్రాచలం నియోజకవర్గ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని ఎమ్మెల్యే పొదెం వీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ పై ఫిర్యాదు చేయడంతో స్థానికంగా కలకలం రేగింది.

అదే విధంగా  భద్రాచలం దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణానికి మొదటిసారి వచ్చినప్పుడు రూ.100 కోట్లతో రామాలయాన్ని అభివృద్ధి చేస్తానని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. 

గత ఏడాది జులైలో భారీ వర్షాలకు గోదావరి పోటెత్తింది. 2022 జులై 15 నాటికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 71.3 అడుగులకు చేరింది. దీంతో భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లోని చాలా గ్రామాలు వరద ముంపునకు గురైయ్యాయి. వేలాది ఇళ్లు, పంటలు వరద నీటిలో మునిగాయి. భద్రాచలం, బూర్గంపహడ్, చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, మణుగూరు మండలాల్లో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 

సీఎం కేసీఆర్జులై 17న భద్రాచలం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. గోదావరి వరదలపై సమీక్ష నిర్వహించారు. భద్రాచలం వద్ద వరద 90 అడుగులకు వచ్చినా ఇబ్బందులు రాకుండా బాధితులకు 2 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కట్టిస్తామని హామీ ఇచ్చారు. రూ.వెయ్యి కోట్లతో వరద నివారణ చర్యలకు చేపడతామన్నారు. అయితే ఈ హామీలు నేటికీ నెరవేరలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఈ సంద‌ర్భంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ, ‘‘భద్రాచలం ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్న  ఇంతవరకు నెరవేర్చలేదు. భద్రాచలం నియోజకవర్గ ప్రజలను ఆయన మోసం చేశారు. గతంలో రామాలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించి, ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు” అని మండిపడ్డారు.

వర్షాలు కురుస్తుండటంతో మళ్లీ గోదావరి ఉప్పొంగే అవకాశం ఉందని, ఈ సంవత్సరం కూడా భద్రాచల ప్రాంత ప్రజలు గోదావరి ముంపునకు గురికావాల్సిందేనా అని ఆయన ప్రశ్నించారు. త‌క్ష‌ణం ఇంత‌కు ముందు ప్ర‌క‌టించిన ప‌థ‌కాల‌కు,అభివృద్ధి ప‌నుల‌కు వెంట‌నే నిధులు విడుద‌ల చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles