హస్తం నీడలోకి షర్మిల: అన్నను వదిలిపెడతారా?

Wednesday, January 22, 2025

తెలంగాణలో రాజకీయం చేయాలని, తెలంగాణలో తన కష్టాన్ని నిరూపించుకుని రాజకీయ పదవులు సాధించాలని ఆరాటపడుతున్న వైఎస్ షర్మిల .. ఎట్టకేలకు సొంత పార్టీ వైఎస్సార్ తెలంగాణకు ఎండ్ కార్డ్ వేసేసి కాంగ్రెసులో విలీనం కావడానికి నిశ్చయించుకున్నట్లే కనిపిస్తోంది. కొన్ని నెలలుగా వినిపిస్తున్న పుకారు. కొన్ని వారాలుగా జరుగుతున్న పరిణామాలు.. తాజాగా ఢిల్లీ టూర్ అన్నీ కలిసి.. షర్మిల తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడం దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లే.

తాజాగా షర్మిల ఢిల్లీ వెళ్లారు. అయితే ఢిల్లీనుంచి తిరిగివచ్చిన తర్వాత.. షర్మిల, కోమటిరెడ్డి ఇద్దరూ మీడియాతో పొడిగా మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా షర్మిలకు ఎప్పుడైనా కాంగ్రెసులో ఆహ్వానం ఉంటుందని కోమటిరెడ్డి ప్రకటించారు. ఆమె ద్వారా తమ పార్టీకి నాలుగు ఓట్లు వచ్చినా నాలుగు వందల ఓట్లు వచ్చినా.. తమకు మంచిదేనని ఆయన వెల్లడించారు. ఆమెను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఆయన ఎయిర్ పోర్ట్ వద్ద అన్నారు. అదే సమయంలో షర్మిలను మీడియా ప్రశ్నించినప్పుడు.. ఆమె తేల్చిచెప్పలేదు. ‘చూద్దాం అన్నా చూద్దాం’ అంటూ వెళ్లిపోయారు. అయితే.. షర్మిల తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసే విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి ప్రకటిస్తారని అంటున్నారు.

అయితే వైఎస్సార్ తనయను తమ పార్టీలో చేర్చుకోవడం వెనుక కాంగ్రెసు పార్టీ ఆమెకు ఎలాంటి వరాలు ప్రకటించింది.. అనేది సస్పెన్స్ గానే ఉంది. అయితే.. ఆమెను కేవలం తెలంగాణ రాజకీయాలకు పరిమితం చేయడం ఉండదని అంటున్నారు. ఆమె తెలంగాణ రాజకీయాల ద్వారానే చట్టసభల్లోకి రావాలని అనుకుంటే ఓకే గానీ.. ఆమె సేవలను ఏపీలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఖచ్చితంగా వాడుకుంటారనే ప్రచారం ఉంది. జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకున్న తీరు.. ఏపీలో కాంగ్రెస్ పార్టీని సమూలంగా దెబ్బకొట్టింది. పైగా విభజన తర్వాత.. కాంగ్రెస్ కోలుకోలేని స్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల ను ఏపీ రాజకీయాల్లో వాడుకుంటూ.. అక్కడ ప్రచారం నిర్వహించినా కూడా.. తమ పార్టీకి కొన్ని సీట్లు దక్కుతాయని కాంగ్రెస్ నమ్ముతోంది. అయితే షర్మిల ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిందంటే మాత్రం.. జగన్మోహన్ రెడ్డికి చాలా పెద్ద నష్టం తప్పదనే అభిప్రాయం విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. జగన్ ను దెబ్బకొట్టడానికి కీలక అస్త్రంగా షర్మిలను కాంగ్రెసు పార్టీ ప్రయోగిస్తుందని పలువురు భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే.. షర్మిల బలం కూడా జతకలిసిన కాంగ్రెసు పార్టీ ఏపీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి జగన్ కు మేలు చేస్తుందా? లేదా, కరడుగట్టిన వైసీపీ కార్యకర్తల ఓటు బ్యాంకును చీల్చి జగన్ ను దెబ్బ కొడుతుందా? అనేది వేచిచూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles