వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధినేత జగన్మోహన్ రెడ్డి వేసవి సెలవులు ఇవ్వబోతున్నారనే వార్తలు ఆ పార్టీ శ్రేణులు, క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను కోఆర్డినేట్ చేసే నాయకులకు వీనులవిందుగా ధ్వనిస్తున్నాయి. జగన్ తాకిడి, దానిద్వారా కలిగే అదనపు ఆర్థిక భారం నుంచి తాము కొంత కాలమైనే తప్పించుకుని నిశ్చింతగా ఉండగలం అని నాయకులు తమలో తాము మురిసిపోతున్నారు. జగన్ తన ప్యాలెస్ లోంచి అడుగు బయటపెట్టకుండా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని పురమాయించేస్తున్నా.. తాను స్వయంగా ట్వీట్లకు మాత్రమే పరిమితం అవుతూ.. చావులు జైలు పరామర్శలకుమాత్రం ఇంటినుంచి బయటకు కదులుతున్నా.. క్షేత్ర స్థాయి నాయకులకు భారం తప్పడం లేదు. అలాంటిది.. వేసవి కారణంగా పార్టీ కార్యక్రమాలకు బ్రేక్ ఇవ్వాలని జగన్ అనుకుంటున్నారని, వానాకాలం వచ్చేదాకా పార్టీ కార్యక్రమాలంటూ పెద్దగా ఏమీ ఉండవని వార్తలు వస్తుండడంతో.. నాయకులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కేవలం ఒక వ్యక్తి కేంద్రంగా నడిచే పార్టీగా జగన్ తయారుచేసేశారు. పార్టీలో మరొకరు ఎదిగితే ఎక్కడ తనకే చెక్ పెట్టేలా తయారవుతారో అనే భయంతో గడిపే జగన్.. ఆ రకంగా పార్టీని తెలియకుండానే చాలా బలహీన పరిచారు కూడా. అధికారం ఉన్నంత కాలమూ విర్రవీగుతూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డికి.. ఒక్కసారిగా అధికారం పొరలు వీడిపోగానే.. అసలు ఏం చేయాలో కూడా తోచడం లేదు. సంక్రాంతి తర్వాత.. జిల్లాల టూర్లకు వస్తానని జగన్ డిసెంబరు చాలా డాంబికంగా ప్రకటించారు. ప్రతి జిల్లాలో రెండు రోజులు బసచేసి మరీ.. అక్కడి ప్రజలసమస్యలు తెలుసుకుంటానని, పార్టీ కార్యకర్తలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తానని కూడా ఆయన వెల్లడించారు.
దారుణంగా ఓడిపోయిన పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు ఇలాంటి చర్యలు ఉపకరిస్తాయని కార్యకర్తలు కూడా అనుకున్నారు. అదే సమయంలో.. నాయకులు మాత్రం.. జగన్ యాత్రలకు వస్తున్నారంటే.. ఆర్థిక భారం మొత్తం తమ నెత్తిన పడుతుందని.. పార్టీనుంచి పైసా కూడా విదిలించరని భయపడ్డారు. దానికి తగ్గట్టుగానే ఆయన జిల్లా టూర్ల గురించి ప్రకటించిన వెంటనే కొందరు కీలక నేతలు, మాజీ మంత్రులు రాజీనామాలు చేసేశారు కూడా!
మరొకవైపు తాను చెప్పిన గడువు దాటి మూడు నెలలు అవుతుండగా జగన్ మాత్రం.. జిల్లా టూర్ల గురించి పట్టించుకోనేలేదు. ప్రజల్లో విలువలేని, ప్రజలు పట్టించుకోని చిల్లర అంశాల గురించి.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఆయన రకరకాల ఆందోళనలకు పిలుపు ఇస్తూ వచ్చారు. అయితే.. ఆ కార్యక్రమాలు నిర్వహించడం నాయకులకు తలకుమించిన భారం అవుతోంది. జనాన్ని పోగేయడానికి భారీగా ఖర్చవుతోందని వారు భయపడుతున్నారు. రాబోయే వేసవి రోజుల్లో పార్టీ కార్యక్రమాలు ప్రకటిస్తే.. డబ్బులు ఇచ్చి జనాన్ని తోలదలచుకున్నా కూడా ఎవరూ రారని జగన్ కు అర్థమైందని అంటున్నారు. అందుకే వానాకాలం వచ్చేదాకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టరాదని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. జగన్ ఇప్పటికే ప్రతి గురువారం బెంగుళూరు యలహంక ప్యాలెస్ లో గడపడానికి భార్యాసమేతంగా వెళుతూ.. తిరిగి సోమ మంగళవారాల్లో వస్తున్నారు. ఈ వేసవిలో ఆయన బెంగుళూరులోనే ఎక్కువ కాలం గడపదలచుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తానికి ఆయన పార్టీ కార్యక్రమాలకు బ్రేక్ ఇవ్వడం నాయకులకు పెద్ద ఊరటగా కనిపిస్తోంది.
హమ్మయ్య.. పార్టీకి వేసవి బ్రేక్ ఇస్తున్న జగనన్న!
Monday, March 31, 2025
