ఏపీలో పరిపాలనలో, ఇతరత్రా క్రైస్తవ మత ప్రచారంకు దోహదపడటమే కాకుండా, తన పాలనలో పలు దేవాలయాలపై, దేవత విగ్రహాలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నా పట్టించుకోని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి `ఆధ్యాత్మిక గురువు’ గా పేరొందిన విశాఖ శారద పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అకస్మాత్తుగా మతమార్పిడులపై ఆవేదన వ్యక్తం చేయడం రాజకీయ వర్గాలలో విస్మయం కలిగిస్తోంది.
దేవాలయాలపై దాడులు జరుగుతున్నా, దేవాలయ ఆస్తులను, నిధులను ప్రభుత్వం దుర్వినియోగపరుస్తున్నా, హిందువులపై పలు సందర్భాలలో వివక్షతను ప్రదర్శిస్తున్న ఆయన ఏనాడూ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేయలేదు. పైగా, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి తరచుగా ఆయనను సందర్శించడం, కీలక అంశాలలో ఆయన సలహాలు తీసుకోవడం జరుగుతుంది.
పలు సందర్భాలలో ఆయన ఆశ్రయంలో జరిగే ఉత్సవాలలో జగన్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. జగన్ ను ప్రసన్నం చేసుకోవాలనుకునే వైసిపి నేతలు, మంత్రులు, ఉన్నత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సహితం తరచుగా ఆయనను దర్శించుకుంటున్నారు.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అనే పేరుతో అక్కడ వైసిపి నేతలు విచ్చలవిడిగా సాగిస్తున్న భూదందాలకు ఆయన ఆశీస్సులు ఉన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పైగా, స్వయంగా పలు భూఅక్రమణలో ఆయన ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. సింహాచలం దేవస్థానం పాలకవర్గాన్ని, ఆస్తులను కైవసం చేసుకొనేందుకు జగన్ ప్రభుత్వం పలు దుస్సహలకు పాల్పడి, హైకోర్టు మందలింపులు గురైన సందర్భాలలో సహితం ఆయన ఏనాడూ నోరువిప్పిన సందర్భం లేదు.
కానీ ఇప్పుడు అకస్మాత్తుగా క్రిష్టమస్ రోజున మతమార్పిడుల పట్ల, ముఖ్యంగా గిరిజనుల ప్రాంతాలలో జరుగుతున్న మత మార్పిడిల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మత మార్పిడి విపరీతంగా పెరిగిందని, దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పిలుపిచ్చారు.
గిరిజన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మత మార్పిళ్లు యథేచ్ఛగా ప్రయత్నాలు సాగుతున్నాయని పేర్కొంటూ అటువంటి దుర్మార్గమైన మతం..అంటూ ఆయన మండిపడ్డారు. ఎవరూ కూడా మతం మారకూడదని.. మన మతంలో మనం ఉండాల్సిన అవసరం ఉందని స్వామి స్వరూపానందేంద్ర స్పష్టం చేశారు.
మన మతంలో మనం ఉండాలనే పిలుపును ఇవ్వడానికి డిసెంబర్ 25వ తేదీ నాడు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నామని గిరిజన ప్రాంతాల్లో మత మార్పిళ్లను అడ్డుకోవడానికి ఇవ్వాళ గిరిజన, ఆదివాసీ, ఏజెన్సీ ప్రాంతాల్లో భగవద్గీతను పంపిణీ చేశామని స్వరూపానందేంద్ర సరస్వతి వెల్లడించారు.
ఏజెన్సీల్లో నివసించే గిరిజన తల్లులు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ వైద్య సదుపాయాన్ని కల్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఏజెన్సీలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.
మత మార్పిడులపై ఆయన చేసిన విమర్శలు అన్ని దాదాపుగా పలువురు స్వామిలు, హిందూ ధార్మిక సంస్థలు వైఎస్ జగన్ ప్రభుత్వంపై గత మూడున్నరేళ్లుగా చేస్తున్నావే. రెండు, మూడు రోజుల క్రితం విజయనగరంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగసభకు అనూహ్య స్పందన రావడంతో రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఇబ్బందులు రాకుండా ఉండటం కోసమే వ్యూహాత్మకంగా ఈ వాఖ్యలు చేశారా? లేదా నిజంగానే జగన్ పాలనలో జరుగుతున్న అకృత్యాల పట్ల ఆవేదన చెందుతున్నారా? ఇటువంటి సందేహాలే పలువురికి కలుగుతున్నాయి.