స్వతంత్ర అభ్యర్థిగా రాజా సింగ్ పోటీ… టార్గెట్ కిషన్ రెడ్డి!

Wednesday, January 22, 2025

ప్రవక్త ముహమ్మద్ పై గత ఏడాది చేసిన వ్యాఖ్యలకు గోషామహల్ బిజెపి ఎమ్యెల్యే రాజాసింగ్ ఆరు నెలలకు పైగా సస్పెన్షన్‌లోనే ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యగా దొంగ కేసులు నమోదుచేసి, అరెస్ట్ చేసిందని పేర్కొంటూ తన భర్తపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆయన భార్యా స్వయంగా పార్టీ కీలక నాయకులు అందరిని కలిసి కోరారు.

అయినా, ఇప్పటి వరకు సస్పెన్షన్ ఎత్తి ఎయడం గాని, కనీసం క్రమశిక్షణ కమిటీలో సస్పెన్షన్ విషయమై చర్చించడం గాని చేయడం లేదు. కేవలం రాష్ట్రంలోని కొందరు కీలక బిజెపి నాయకులు తీసుకువస్తున్న వత్తిడి కారణంగా పార్టీ జాతీయ నాయకత్వం ఈ విషయంలో ఉదాసీనంగా ఉన్నట్లు తెలుస్తున్నది. మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అప్పటి వారంటూ సస్పెన్షన్ ను అట్లాగే ఉంచి, ఎన్నికలలో పార్టీ సీట్ రాకుండా చేయాలని ఎత్తుగడగా భావిస్తున్నారు.

రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయకుండా జాతీయ నాయకత్వాన్ని అడ్డుకోవడంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కీలక పాత్ర వహిస్తున్నట్లు భావిస్తున్నారు. అందుకనే సస్పెన్షన్ ఎత్తివేయమని కోరడం రాజాసింగ్ మానివేశారు. ఏదేమైనా పార్టీ సీట్లు ఇవ్వని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, తన సత్తా నిరూపించుకోవాలని సిద్ధమవుతున్నారు. అయితే, తన సొంత నియోజకవర్గం గోషామహల్ నుండి కాకుండా, కిషన్ రెడ్డి నియోజకవర్గం అంబర్ పెట్ నుండి పోటీచేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలిసింది.

గత ఎన్నికలలో ఓటమి చెందిన కిషన్ రెడ్డి ఈ పర్యాయం పార్టీ అనుమతిస్తే తాను స్వయంగా గాని లేదా తన భార్యను గాని లేదా తన సన్నిహితులు ఎవరినైనా గానీ నిలబెట్టాలని చూస్తున్నారు. తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితులు ఏర్పడితే ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు ఈ నియోజకవర్గం ఆసరాగా ఉంటుందని భావిస్తున్నారు. అందుకనే అక్కడి నుండే పోటీచేసి, కిషన్ రెడ్డి అభ్యర్థిని ఓడించి తన బలమేమిటో చూపేందుకు రాజాసింగ్ కసరత్తు చేస్తున్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికలలో కిషన్ రెడ్డి, డా. కె లక్ష్మణ్, బండి సంజయ్ వంటి కీలక నేతలతో సహా బిజెపి అభ్యర్థులు అందరూ ఓటమి చెందినా, పోటీచేసిన వారిలో 100 మందికి పైగా డిపాజిట్ కోల్పోయినా మొత్తం తెలంగాణాలో గెలుపొందిన ఏకైక బీజేపీ అభ్యర్థి రాజాసింగ్. పైగా, వరుసగా రెండోసారి గెలుపొందారు. వాస్తవానికి అతనికి సీట్ ఇవ్వరాదని రాష్ట్రంలోని బీజేపీ కీలక నాయకులు, చివరకు ఆర్ఎస్ఎస్ నాయకులు పట్టుబట్టినా లెక్కచేయలేకుండా నాటి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా ఇచ్చారు.

సీట్ ఇచ్చినా ఆయన నియోజకవర్గంలో రాష్ట్ర బీజేపీ నేతలు ఎవ్వరూ ప్రచారంలో పాల్గొనలేదు. పార్టీ కార్యకర్తలు ఎవ్వరో పాల్గొనవద్దని అనధికారికంగా ఆదేశాలు జారీచేశారు. ప్రచారం కోసం రాష్ట్రంకు వచ్చిన జాతీయ నాయకులలు ఎవ్వరిని కూడా ప్రచారం చేయనీయలేదు. కేవలం యోగి ఆదిత్యనాథ్ మాత్రమే చేశారు.

తమందరిని కాదని సొంతంగా ఇమేజ్ పెంచుకొంటున్నాడని రాజాసింగ్ పై రాష్ట్రంలో బీజేపీ నాయకులు అందరూ ఆగ్రహంగా ఉంటూ వచ్చారు. కిషన్ రెడ్డి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, శాసనసభా పక్ష నేతగా ఉన్నప్పుడు రాజాసింగ్ తో కనీసం మాట్లాడుకోవడం కూడా లేదు. అసెంబ్లీలో బీజేపీ నుండి మాట్లాడే అవకాశమే ఇచ్చేవారు కాదు. అయినా నానాటికి రాజాసింగ్ `హిందుత్వ టైగర్’గా ఇమేజ్ పెంచుకొంటూ ఉండడంతో మిగిలిన నాయకులంతా అసహనంకు గురవుతున్నారు.

కేవలం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం మొదటినుండి రాజాసింగ్ ను ప్రోత్సహిస్తున్నారు. ఆయనను గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా చేయాలని చూసారు. ఆ విధంగా చేస్తే రాష్ట్రంలో బలమైన నేతగా గుర్తింపు పొందుతారని భయంతో గ్రేటర్ హైదరాబాద్ ను ఆరు జిల్లాలుగా విభజించి, ఆరుగురు అధ్యక్షులను నియమించి ఇక్కడ బలమైన నేతలు ఎవ్వరు వచ్చే అవకాశం లేకుండా చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles