స్టీల్ ప్లాంట్ పై దొంగాట ఆడుతున్న బీజేపీ

Saturday, November 16, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకొంటామంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుకు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ కలకలం రేగడంతో ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లడం లేదని గురువారం ఉదయం విశాఖపట్టణంలో ప్రకటించిన కేంద్ర మంత్రి ఫగన్‌సింగ్‌ పరిస్థితులను చల్లార్చే ప్రయత్నం చేశారు. దానితో ప్రైవేటీకరణను అడ్డుకున్న ఘనత తమదే అంటూ ఏపార్టీకి ఆ పార్టీ గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించింది.

కానీ, 24 గంటల లోపలే కేంద్ర మంత్రి మాటమార్చి మరింత గందరగోళం సృష్టించారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం లేదని తాను చెప్పలేదని, మరింత బలోపేతం చేస్తామని మాత్రమే చెప్పానని అంటూ గురువారం సాయంత్రమే విశాఖపట్టణం దాటాక ముందే  చెప్పారు. ఉదయం చేసిన ప్రకటనపై మరింత స్పష్టత ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు కేంద్ర మంత్రిని కోరారు.

దానితో దానినే అవకాశంగా తీసుకొని, ప్లాంట్‌ను మరింత బలోపేతం చేస్తామని మాత్రమే మీడియాకు చెప్పానని ఆయన స్పష్టం చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ లాభాల్లోకి వచ్చేలా సహకరిస్తామని మాత్రమే చెప్పిన్నట్లు సర్దుబాటు చేసుకున్నారు.

పైగా, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకొనే అంశం తన చేతుల్లో లేదని, కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో కార్మిక సంఘాల నేతలు కేంద్ర మంత్రితో సమావేశం నుంచి బయటకు వచ్చేశారు.

ఇదే సమయంలో స్టీల్ ప్లాంట్ ను కాపాడుకొనేందుకు ఉపక్రమించవలసింది పోయి, ఏపీ బిజెపి నేతలు అక్కడకు వచ్చి బీడ్ వేస్తానంటున్న కేసీఆర్ పై మాటల దాడులు ప్రారంభించారు. విశాఖ పట్నం స్టీల్‌ప్లాంట్‌‌ను ఆదుకోడానికి కంటే ముందు సింగరేణిలో ఆంధ్రప్రదేశ్ వాటాల సంగతి తేల్చాలని ఏపీ బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ స్టీల్‌ ప్లాంట్‌ అంశాన్ని రాజకీయంగా వినియోగించు కుంటోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధవ్‌ ఆరోపించారు. సింగరేణి గనుల్లో ఆంధ్ర రాష్ట్రానికి వాటా ఉందని, ముందు ఆ వాటా తేల్చాలని డిమాండ్‌ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌పై బీఆర్‌ఎస్‌కు అంత చిత్తశుద్ధి ఉంటే పోలవరానికి సహకరించాలని, స్టీల్‌ ప్లాంట్‌కు రూ.5 వేల కోట్లు నిధులు ఇచ్చేందుకు ముందుకు రావాలని హితవు చెప్పారు. రెండు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తులను పంచవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యత కూడా కేంద్రానిదే. స్టీల్ ప్లాంట్ కు రూ 5,000 కోట్ల నిధులు ఇవ్వాలనుకొంటే కేంద్ర ప్రభుత్వంకు పెద్ద మొత్తం కానేకాదు.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏపీ అభివృద్ధిని ఎంతగా అడ్డుకొంటున్నా నోరుమెదపలేని ఏపీ బిజెపి నేతలు, కనీసం ఈ విషయమై వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని కూడా నిలదీయలేని అసమర్థులు, సంబంధం లేని తెలంగాణ ప్రభుత్వం చేయాలని అడిగేందుకు మాత్రం సిగ్గుపడటం లేదు. కనీసం విశాఖ స్టీల్ కు గనులు కేటాయించమని మోదీ ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం లేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles