విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించడం, ప్లాంట్ బీడ్ లో సింగరేణి కాలరీస్ పాల్గొని ప్రైవేట్ పరం కాకూండా అడ్డుకొంటామని ప్రకటించిన సమయంలోనే ‘విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఇప్పటికిప్పుడు ప్రైవేటుపరం చేయాలనుకోవడం లేదు. దీనిపై ప్రస్తుతానికి ముందుకెళ్లడం లేదు’ అని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ మొత్తం క్రెడిట్ కేసీఆర్ దే అన్నట్లుగా బిఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారు.
అయితే కేంద్ర మంత్రి మాటలను స్టీల్ ప్లాంట్ కార్మికులు నమ్మడం లేదు. ఇప్పటివరకు వారు హర్షం ప్రకటిస్తూ ప్రకటన చేయలేదు. దృష్టి మళ్లించే ఎత్తుగడగానే భావిస్తున్నారు. కానీ ఏపీ రాజకీయాలలో అడుగు పెట్టేందుకు తమకు ఒక బలమైన ప్రాతిపదిక దొరికినదని బిఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకొంటున్నారు.
మరోవంక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మొత్తం క్రెడిట్ తమ పార్టీది అన్నట్లుగా మాట్లాడుతున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అవ్వకుండా, కార్మికుల పక్షాన తొలి నుండి పోరాడుతూ, కేంద్రంతో సంప్రదింపులు జరిపిన ఏకైక పార్టీ జనసేన అని గుర్తు చేశారు. గతంలో తాము కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలసి ఈ అంశంపై వినతిపత్రం ఇచ్చిన సందర్భాన్ని ప్రస్తావించారు.
ఏది ఏమైన్నప్పటికీ కేసీఆర్ జాతీయ స్థాయిలో బిజెపిని లక్ష్యంగా పెట్టుకొని విశాఖ ఉక్కులో అడుగు పెట్టారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయంగా బిజెపిపై ఎటువంటి ప్రభావం ఉంది అవకాశం కనిపించడం లేదు. కానీ ఏపీలోని రెండు ప్రధాన రాజకీయ పక్షాలైన వైసిపి, టిడిపి మాత్రం ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది.
మొదటి నుండి మొక్కుబడిగా నాలుగు మాట్లాడు మాట్లాడటం తప్ప విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తీరంగా అడ్డుకొనే ప్రయత్నాలు ఈ రెండు పార్టీలు చేయలేదు. ఈ అంశం అటు, ఇటు తిరిగి బిఆర్ఎస్ – వైసిపి మంత్రుల మధ్య హద్దులుమీరి మాటల యుద్దానికి దారితీయడం గమనార్హం. వాస్తవానికి ఈ రెండు పార్టీల నేతలు ఇప్పటి వరకు ఈ రీతిలో రచ్చ చేసుకున్న సందర్భం లేదు.
ఇప్పటి వరకు ఈ విషయంలో టిడిపి నేతల నుండి ఎటువంటి స్పందన రాకపోవడం గమనార్హం. కేసీఆర్ ఎత్తుగడల విషయమై సీఎం వైఎస్ జగన్ కన్నా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు ఎక్కువగా అవగాహన ఉంది. అందుకనే, ఉద్దేశ్యపూర్వకంగా ఆయన మౌనం పాటిస్తున్నారా? అనే అభిప్రాయం కలుగుతుంది.
ఏపీలో తిరిగి బలోపేతం కావడం పట్ల దృష్టి సారిస్తున్న చంద్రబాబు నాయుడు అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకొని, కేసీఆర్ కు రాజకీయంగా మైలేజ్ ఇవ్వడం ఎందుకనే అభిప్రాయంలో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ విషయం రాజకీయంగా మరింత రాజుకుంటే వైసీపీతో పాటు టీడీపీ కూడా స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్పుడు వైసీపీ, టీడీపీ లను కేసీఆర్ ఎత్తుగడలు మరేవిధంగా టార్గెట్ చేస్తాయో చూడవలసి ఉంది.
ఏపీలో బిఆర్ఎస్ ఆవిర్భావ సూచకంగా విశాఖపట్టణంలో మొదటి బహిరంగసభ నిర్వహించాలని ఎదురు చూస్తున్న కేసీఆర్ ఇప్పుడు విశాఖ ఉక్కు అంశమంపై విజయోత్సాహంతో ముందడుగు వేసే అవకాశం ఉంది.