స్టీల్ ప్లాంట్ పేరుతో మోదీ, జగన్ మరో `డ్రామా’

Sunday, November 17, 2024

విభజన చట్టంలోని హామీలను అమలు పరచకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక వంక వంచనకు గురిచేస్తుంటే, హామీల అమలు గురించి కేంద్రాన్ని నిలదీయలేని దుస్థితిలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడికక్కడ రాజీ పడుతూ, ప్రజలకు కల్లబొల్లి  కబుర్లు చెబుతున్నారు. 

ఇప్పటికే విభజన చట్టం ప్రకారం దక్కవలసిన వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి నిధులతో పాటు అనేక సదుపాయాలను ఏపీ, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా మోసానికి గురవుతున్నది. కడపలో స్టీల్ ప్లాంట్ నెలకొల్పుతామని 2014 ఎన్నికల సమయంలో బిజెపి నాయకులు వాగ్ధానాలు గుప్పించారు. 

అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత దాని గురించే పట్టించుకోలేదు. తరచుగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుర్తు చేస్తుంటే ఏదో కమిటీ వేశామని, కమిటీ  నివేదికకు ఎదురు చూస్తున్నామంటూ కాలయాపన చేశారు. చివరకు ఆ కమిటీ నివేదిక ప్రకారం అక్కడ స్టీల్ ప్లాన్ నిర్మాణం లాభదాయకం కాదంటూ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. 

అయితే, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏనాడూ కేంద్ర వాదనలను తిప్పికొట్టే ప్రయత్నం చేయలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని ఇచ్చిన మాట ప్రకారం, చట్టం ప్రకారం అక్కడ స్టీల్ ప్లాంట్ నెలకొల్పామని ఒత్తిడి చేయలేదు. పైగా, ఇప్పుడు ఆయనే రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని చెబుతున్నారు. ఆయన అక్కడ శంకుస్థాపన చేసి రెండేళ్లు పూర్తయినా ఇప్పటి వరకు ఆ దిశలో ముందుకు కదలడం లేదు.

పైగా, రెండేళ్ల క్రితమే రాష్ట్ర బడ్జెట్ లో రూ 250 కోట్లు కేటాయించారు కూడా. గతంలో వై ఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బ్రాహ్మణి స్టిల్స్ పేరిట గాలి జనార్దన్ రెడ్డికి అక్కడ విలువైన భూములను, ఆ ఫ్యాక్టరీ పేరుతో గనులను కూడా కట్టబెట్టారు.  అయినా ఒక్కడుగు కూడా ముందుకు పడకుండానే రాజశేఖరరెడ్డి పరమపదించగా, జనార్ధనరెడ్డి జైలుకు వెళ్లారు. ఇప్పుడు 

ఎన్నికలు రాబోతున్నాయని మరోసారి హడావుడిగా స్టీల్ ప్లాంట్ ను ప్రస్తావిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుండగా? ప్రైవేట్ వ్యక్తులకు కట్టజెప్పుతున్నారా? స్పష్టత లేదు.  ఈ సందర్భంగా కడప ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటు రంగంలో నెలకొల్పుకొంటామని కేంద్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి  ఉత్తరం వ్రాశారని అంటూ బిజెపి అధికార ప్రతినిథి పార్థసారథి ఒక టివి ఛానల్ చర్చలు పేర్కొనడం గమనార్హం.  

ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వమే ఈ విషయం వెల్లడించలేదు. బిజెపి నేతకు ఏ విధంగా తెలిసింది ? ఇద్దరు కలసి నాటకం ఆడుతున్నారా? పలు అనుమానాలు కలుగుతున్నాయి. నిజంగా జగన్ అటువంటి ఉత్తరం వ్రాస్తే కేంద్ర ప్రభుత్వం తక్షణం బహిర్గతం చేయాలి. 

జగన్మోహన్ రెడ్డి రెండు, మూడు రోజుల క్రితం కడప జిల్లాలో మాట్లాడుతూ విభజన చట్టంలో కడప ఉక్కు కర్మాగారం నెలకొల్పాలని పేర్కొన్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొనడం గమనార్హం. మరి ఆ విషయమై కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేక  పోతున్నారు?

కడప ఉక్కు కర్మాగారాన్ని విభజన చట్టం మేరకు ప్రభుత్వ రంగంలో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పాలని జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా డిమాండ్ చేశారా? లేదా, బిజెపి ప్రతినిథి తెలియజేసినట్లు ప్రయివేటు రంగంలో నెలకొల్పుకొంటామని ఉత్తరం వ్రాశారా! 
ఈ విషయమై తలెత్తుతున్న అనుమానాలను ప్రజానీకానికి తెలియజేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్నది.

లేని పక్షంలో కేంద్రం, రాష్ట్రం కలిసి నాటకాలు ఆడుతూ రాష్ట్ర ప్రజలను వంచనకు గురిచేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. 
కడప ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పడం లాభదాయకం కాదని మోదీ  ప్రభుత్వం చెప్పి వెనుకబడ్డ రాయలసీమను దగా చేసిన విషయం వాస్తవం కాదా! జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు స్పష్టం చేయాలి. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles