సోము వీర్రాజు భూకబ్జా యత్నాలపై దళిత సంఘాల కన్నెర్ర

Sunday, December 22, 2024

బిజెపి రాష్ట్ర కార్యాలయం నిర్మాణం కోసం బెదిరించి దళితుల భూములను ఆక్రమించే రాష్ట్ర బిజెపి నాయకుల ప్రయత్నాలు బెడిసికొట్టాయి. తాడేపల్లికి సమీపంలో కోట్ల రూపాయలతో అత్యాధునిక పార్టీ కార్యాలయం నిర్మించాలనే ప్రయత్నాలకు ఆదిలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయి.

దళితుడైన వరప్రసాద్‌ను తుపాకితో బెదిరించి భూ కబ్జాకు పాల్పడిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, మీడియా కన్వీనరు లక్ష్మీపతి రాజా, వారి అనుచరులపై హత్యాయత్నం, భూ కబ్జా కేసులు, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్‌ చేసింది. వరప్రసాద్‌కు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

వరప్రసాద్ తోపాటు భూమికి రక్షణ కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని, డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాల ఎదుట ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేయాలని, ఎస్‌సి కమిషన్‌ ఛైర్మన్‌ మారుముడి విక్టర్‌ ప్రసాద్‌, డిజిపికి వినతిపత్రాలు ఇవ్వాలని ఐక్యవేదిక రౌండ్‌ టేబుల్‌ సమావేశం తీర్మానించింది.

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు అధ్యక్షతన విజయవాడ గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వరప్రసాద్‌ 2014 మే 19న మంగళగిరి మండలం చినకాకానికి చెందిన షేక్‌ మగ్భూల్‌ నుంచి సర్వే నెంబరు 233/బిలో సుమారు 4404 చదరపు గజాలను రూ.46.50 లక్షలకు కొనుగోలు చేసి రిజిస్టర్‌ చేయించుకున్నాడని తెలిపారు.

సోము వీర్రాజు, లక్ష్మీపతి రాజా భూమి దగ్గర తమ మనుషులను పెట్టి వరప్రసాద్‌ను భూమిలోకి రానీయకుండా చంపేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. వరప్రసాద్‌ భూమితోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో సిమెంటు తయారీ కోసం ఎసిసి కంపెనీ సుమారు 500 ఎకరాలు లీజు, కొంత భూమి కొనుగోలు చేసి సున్నపురాయిని తవ్వుకుని సిమెంటు ఉత్పత్తి చేసేదని గుర్తు చేశారు.

 అనంతరం ఎసిసి కంపెనీ మూతబడి ఆ భూముల్లో కొంత అమ్ముకుని లీజుకిచ్చిన భూమిని తిరిగి హక్కుదారులకే ఇచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎసిసి కంపెనీకి లీగల్‌ అడ్వ్తెజరు బద్రిరెడ్డి వెంకటరెడ్డి ఎసిసి కంపెనీకి పవర్‌ ఆఫ్‌ అటార్నీ హోల్డర్‌గా ఉన్నారని, తప్పుడు డాక్యుమెంట్లు కొనుగోలు చేసి ఇటువంటి భూములను కొనుగోలు చేస్తున్నారని వెంకటేశ్వర్లు ఆరోపించారు.

భూముల వివాదం నడుస్తుందని గ్రహించిన బిజెపి మీడియా కన్వీనరు లక్ష్మీపతి రాజా, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు దృష్టికి తీసుకెళ్లారని, అయన అనుచరులను పంపించి వరప్రసాద్‌ను పిలిపించి రూ.5 కోట్లు ఇస్తామని, లేకపోతే చంపేస్తామని తుపాకీ చూపి భయభ్రాంతులకు గురిచేశారని కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్ రిఆరోపించారు. 

సమావేశానంతరం కెవిపిఎస్‌ నేతృత్వంలో ఎస్‌సి కమిషన్‌ ఛైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కాగా, గత వారం బాధితుడు వరప్రసాద్, కొందరు దళిత నాయకులు గుంటూరు ఎస్పీని కలసి ఈ విషయమై వినతిపత్రం సమర్పించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles