ఒక వంక సోము వీర్రాజు నేతృత్వంలో ఏపీ బిజెపి కార్యవర్గ సమావేశాలు భీమవరంలో కేంద్ర నాయకుల సమక్షంలో జరుగుతూ, 2024 ఎన్నికలకు రాష్ట్రంలో పార్టీ వ్యూహాలపై చర్చిస్తుండగా, ఆ సమావేశాలకు పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దూరంగా ఉండడమే కాకుండా, గుంటూరు జిల్లాలో ఆయన మద్దతుదారులు బహిరంగంగా వీర్రాజుపై దాడులు చేయడం బీజేపీలో పెను దుమారం రేపింది.
రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలికి వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నట్లు- పల్నాడు జిల్లా మాజీ అధ్యక్షుడు కర్ణా సైదారావు వెల్లడించారు. కన్నా వర్గమనే కక్షతో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు సైతం తమను ఆహ్వానించలేదని తెలిపారు. ఫ్లెక్సీల్లో మిత్రపక్ష జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫొటోలు వేసినా బెదిరింపులకు దిగుతున్నట్లు ఆయన ఆరోపించారు. కన్నా లక్ష్మీనారాయణ వర్గంగా పేర్కొంటూ అడుగడుగునా అవ మానిస్తున్న నేపధ్యంలో పార్టీలో ఇమడలేక రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు
వీర్రాజు తన ఆస్తులను పెంచు కోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని పెదకూరపాడు బీజేపీ ఇంఛార్జి గంధం కోటేశ్వరరావు ఆరోపించారు. కన్నా వర్గమనే పేరుతో చాలామందిని సోము పక్కన పెట్టారని అన్నారు. పెద్ద ఎత్తున నిర్వహించిన సమావేశంలో ఐదొందల మంది వరకు కార్యకర్తలు పాల్గొని పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.
సోము వీర్రాజు వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడనున్నట్లు అనుచరుల రాజీనామాల ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.తొందరపడి పార్టీని వీడవద్దని పార్టీ జాతీయనేతలు ఆయనను కోరుతున్నా సోము వీర్రాజు వ్యవహారశైలిని సరిదిద్దే ప్రయత్నం మాత్రం చేయడం లేదు.
ఇటీవల ఢిల్లిలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలకు కన్నా హాజరు కాలేదు. ఇంట్లోని ఓ శుభకార్యం ఉందంటూ అఖిల భారత సంఘటనా మంత్రి సంతోష్ అనుమతి తీసుకొని వెళ్లలే దని తెలిసింది. వచ్చే నెలలో తాను స్వయంగా వచ్చి కలుస్తానంటూ సంతోష్‌కు కన్నా వివరించారు. అయితే రోజు రోజుకూ మారుతున్న రాజకీయ సమీకరణాల నేపధ్యంలో జాతీయ నాయకత్వాన్ని కన్నా కలవడం సందేహంగానే మారింది.