సొంత గూడు కాంగ్రెస్ వైపు చూస్తున్న  రాజగోపాల్‌రెడ్డి!

Friday, November 15, 2024

కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణాలో సహితం రాజకీయ సమీకరణాలు మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణాలో కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్థకం అనుకొంటూ బీజేపీ, బిఆర్ఎస్ లలో చేరిన నేతలు ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. అన్ని కుదిరితే `సొంత గూటి’కి వచ్చేందుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నారు.

మొన్నటివరకు బిఆర్ఎస్- బీజేపీగా సాగిన తెలంగాణ రాజకీయాలు ఇక ముందు బిఆర్ఎస్ – కాంగ్రెస్ గా మారే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితులను అవకాశంగా తీసుకొని వివిధ కారణాలతో పార్టీని వదిలి వెళ్లిన వారిని తిరిగి అక్కున చేర్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు సహితం సిద్ధపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా గత ఏడాది తమ ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసి మరీ బీజేపీలో చేరి, ఉపఎన్నికలో ఓటమి చెందిన కోమటిరెడ్డి  రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే కథనాలను వెలువడుతున్నాయి. బీజేపీలో చేరినప్పటి నుండి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో ఆయనకు పొసగడం లేదు. తన ఎన్నికలో సహితం సంజయ్ వ్యవహరించిన తీరు తన పరాజయంకు దారితీసిన్నట్లు భావిస్తున్నారు.

రాష్ట్ర అధ్యక్ష పదవిని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు అప్పచెప్పాలని పార్టీ అధిష్టానం వద్ద చెప్పిన వారిలో ఆయన కూడా ఉన్నారు. అయితే, కర్ణాటక ఎన్నికల అనంతరం రాష్ట్ర అధ్యక్షుడిని మార్చినా తెలంగాణాలో బిజెపి చేయగలిగింది పెద్దగా ఏమీ ఉండబోదనే నిర్ణయానికి వచ్చిన్నట్లు తెలుస్తున్నది.

పైగా, ఉపఎన్నికలో గెలుపొందితే తన సోదరుడైన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అప్పట్లో బీజేపీలో చేరేందుకు సిద్ధపడ్డారు. అయితే ఉపఎన్నిక తర్వాత ఆయన బిజెపి పట్ల ఆసక్తి చూపడం లేదు. అందుకనే ఇద్దరం ఒక పార్టీలో ఉంటేనే పాత నల్గొండ జిల్లాలో బలమైన జంటగా ఉండవచ్చనే అభిప్రాయంలో ఉన్నట్లు చెబుతున్నారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా నల్గొండ అసెంబ్లీకి పోటీ చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరే విషయమై తన ముఖ్య అనుచర వర్గంతో చర్చలు చేస్తున్నట్లు ప్రచారం కొనసాగుతోంది. బీజేపీలోనే కొనసాగాలా? మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లాలా? అన్న విషయమై రాజగోపాల్‌ మూడు రోజులుగా చర్చలు చేస్తున్నారు.

కర్ణాటక ఫలితాల అనంతరం బిజెపి మరింతగా బలహీన పడిందని, తెలంగాణాలో పుంజుకునే అవకాశాలు లేవని తన అనుచరులతో అన్నట్లు చెబుతున్నారు.  అయితే కాంగ్రెస్ లోకి వెళ్లటానికి రాజగోపాల్ రెడ్డికి ఎక్కడా అడ్డంకులు లేకపోయినా టిపిసిసి అధ్యక్షడు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలనే షరతును ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తున్నది.

గత ఏడాది ఉపఎన్నిక సందర్భంగా ఝార్ఖండ్‌లో తన కంపెనీకి రూ.18వేల కోట్ల టెండర్‌ దక్కడం కోసమే తాను బీజేపీలో చేరానని అప్పట్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని, ఆయన బహిరంగ క్షమాపణ చెప్తే తాను తిరిగి కాంగ్రె్‌సలో చేరే విషయమై ఆలోచిస్తానని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అయితే, ఈ విషయమై రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు ఏవిధంగా స్పందిస్తారో చూడవలసి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles