సెల్ఫీతో జగన్ కు సవాల్ విసిరిన లోకేష్!

Wednesday, January 22, 2025


టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ `యువగళం’ పాదయాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హుషారుగా సాగుతుంది. కీలక వైసిపి నేతల నియోజకవర్గాలలో సహితం జోరుగా, జనంతో మమేకమవుతూ సాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఎక్కడికక్కడ జనంతో మాటలు కలుపుతూ, ఇంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన పనులను ప్రస్తావిస్తూ, జగన్ ప్రభుత్వంకు సవాళ్లు విసురుతున్నారు.

తాజాగా, సత్యవేడు నియోజకవర్గంలో 21వ రోజు పాదయాత్ర జరుగుతూ ఉండగా ఎదురైన ఓ బస్సు లోకి వెళ్లి, అందులోని ప్రయాణికులతో సెల్ఫీలు దిగుతూ, ఆ బస్సు ఏ కంపెనీదో తెలుసుకొని నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సవాలు విసిరారు. ముఖ్యంగా కొద్దిరోజులలో విశాఖపట్నంలో జగన్ ప్రభుత్వం అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు జరుపుతున్న సమయంలో ఈ సవాల్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసిన్నట్లుంది.

ఆ బస్సు డిక్సన్ కంపెనీ ఉద్యోగులది అని తెలిసి లోకేష్ రెచ్చిపోయారు. ఆ కంపెనీ టిడిపి ప్రభుత్వం హయాంలో ఏర్పాటైన కంపెనీ కావడం గమనార్హం. చంద్రబాబు నాయుడు హయాంలో ఇటువంటి అనేక కంపెనీలు రాష్ట్రంలో ఎటువైపు వెళ్లినా కనిపిస్తున్నాయి. వాటిల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కనిపిస్తున్నారు. ఆ కంపెనీల కారణంగా పరిసరాలు అభివృద్ధి చేసిన అనేక ప్రాంతాలు తారసపడుతున్నాయి.

డిక్సన్ కంపెనీ బస్సు ముందు, ఉద్యోగులతో కలిసి సెల్ఫీలు దిగిన నారా లోకేష్.. సీఎం జగన్ కు ఓ సవాల్ విసిరారు. రాష్ట్రంలో పెట్టుబడులు రావడం లేదని టీడీపీ చేస్తున్న విమర్శల్ని గుర్తుచేస్తూ “మిస్ట‌ర్ జ‌గ‌న్ రెడ్డీ నేను తెచ్చిన డిక్స‌న్ కంపెనీ ఇది.. అందులో ఉద్యోగాలు చేస్తున్న అక్కాచెల్లెళ్లు వీరు.. నువ్వు ఒక్క కంపెనీ అయినా తెచ్చాన‌ని చెప్పుకోగ‌లవా!?, ఒక్క ఉద్యోగ‌మైనా ఇప్పించ‌గ‌లిగాన‌ని ప్ర‌క‌టించ‌గ‌ల‌వా” అంటూ సీఎం జగన్ కు ప్రశ్నలు సంధించారు. దీంతో ఈ సెల్ఫీ సవాల్ వైరల్ అవుతోంది.

ఈ సందర్భంగా లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. ఆ బ‌స్సు నిండా అక్కాచెల్లెళ్లు, వారిలో ఆనందం కనిపించిందన్నారు. తన క‌ళ్ల వెంబ‌డి ఆనంద‌భాష్పాలు అప్ర‌య‌త్నంగానే రాలాయని తెలిపారు. నాలుగేళ్ల క్రితం తాను ఐటీ-ఎల‌క్ట్రానిక్స్ శాఖా మంత్రిగా తీసుకొచ్చిన కంపెనీ ఈ రోజు ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా వేలాది మందికి ఉపాధి క‌ల్పిస్తోందని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
 తాను ఇప్పుడు ప‌ద‌విలో లేనని.. కానీ తన ప్ర‌య‌త్నం వేలాది మంది జీవితాల‌కు ఉపాధి మార్గం చూపింది పేర్కొన్నారు. రాష్ట్రానికి ఆదాయం తెచ్చే ఒక వ‌న‌రు అయ్యిందని.. ఆంధ్ర అభివృద్ధిలో డిక్స‌న్ కూడా ఒక భాగ‌మైంది చెప్పారు

రైతులను దగా చేస్తున్న జగన్

కేవీబీపురం మండలం, రాజులకండ్రిగలో రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయం.. అనుబంధ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, రైతులకు సబ్సిడీ రుణాలు ఇవ్వకుండా ప్రభుత్వం దగా చేస్తోందని విమర్శించారు. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ సీఎం జగన్ రాష్ట్రాన్ని రైతు లేని రాజ్యoగా తయారు చేశారని మండిపడ్డారు.

రుణమాఫీ, సబ్సిడీ రుణాలు, గిట్టుబాటు ధర, భూసార పరీక్షలు లేకుండా జగన్ ప్రభుత్వం రైతులను దగా చేసిందని లోకేష్ ఆరోపించారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. రాయలసీమలో వ్యవసాయ రంగాన్ని నీరుగార్చారని, సీమపై ప్రేమ లేని జగన్ రెడ్డి రాయలసీమలో ఎలా పుట్టారని అన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకున్న ఘనత టీడీపీ ప్రభుత్వందేనని లోకేష్ వ్యాఖ్యానించారు.

కోర్టు దొంగ వ్యవసాయ శాఖ మంత్రి అయ్యారని చెబుతూ ఎవరైనా దొంగతనం చేసి కోర్టుకు వెళ్తారు.. కానీ ఈ మంత్రి కోర్టులోనే దొంగతనం చేశారని నారా లోకేష్ ధ్వజమెత్తారు. దొంగ వ్యవసాయ శాఖ మంత్రి అయితే రైతుల పరిస్థితి ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు.

టిడిపి జెండాలు, బ్యానర్లను తొలిగించిన పోలీసులు

ఇలా ఉండగా, లోకేష్ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న పోలీసులు మార్గంలో టీడీపీ శ్రేణులు కట్టిన జెండాలు, బ్యానర్లను స్వయంగా తొలగించి.. పోలీసు వాహనాల్లో తరలిస్తున్నారు. ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి ఉత్తర్వులు లేకుండానే పోలీసులు ఓవరాక్షన్  చేస్తున్నారు. దీనిపై ప్రశ్నించిన టీడీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శిస్తూ.. కేసులు పెడతాం అంటూ బెదిరిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles