సెంటిమెంట్ కోసమే బిఆర్ఎస్ – వైసీపీ మంత్రుల రగడ!

Sunday, January 19, 2025

రెండు తెలుగు రాష్ట్రాలలోని అధికార పక్షాలు ఎవ్వరి పాట్లు వారు పడుతూ, పక్క రాష్ట్రం గురించి పట్టించుకోని విధంగా వ్యవహరిస్తున్నాయి. ఒక విధంగా తమ ఉమ్మడి శత్రువుగా టిడిపిని పరిగణిస్తూ, ఆ పార్టీని కట్టడి చేసే విషయంలో మాత్రం లోపాయికారిగా సహకరించుకొంటున్నాయి. అప్పుడప్పుడు కృష్ణా జలాలు, ఉమ్మడి ఆస్తుల పంపకం వంటి అంశాలపై పరస్పరం విమర్శలకు దిగినా కేవలం తమ తమ రాష్ట్రాలలోని ప్రజలను మెప్పించడం కోసమే అన్నట్లు రాజకీయంగా వివాదాలు సృష్టించే వరకు వెళ్లడం లేదు.

కానీ అకస్మాత్తుగా తెలంగాణ సీఎం కేసీఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయసే ప్రయత్నాలు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తుండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం, దానిని అడ్డుకొంటామని తెలంగాణ మంత్రులు పేర్కొనడంతో రెండు రాష్ట్రాల మధ్య కొన్ని ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. స్టీల్ ప్లాంట్ బీడ్ లో పాల్గొనేందుకు సింగరేణి కాలరీస్ అధికారులు విశాఖ వెళ్లడాన్ని ఏపీ మంత్రి అమరనాథ్ విమర్శించారు.

అంతలో ఏపీ నుండి వచ్చిన వలస కార్మికులను ఉద్దేశించి రెండు రాష్ట్రాలలో పరిస్థితులు చూడండి, తెలంగాణాలో ఉన్నట్లు ఏపీలో రోడ్లు, బతుకు తెరువు లేవుగదా.. ఇక్కడే ఉండండి, అక్కడి ఓట్లను కూడా రద్దు చేసుకోండి అంటూ ఆర్థిక మంత్రి హరీష్ రావు సూచించడం నిప్పురవ్వ రాజేసిన్నట్లయింది. దానితో పలువురు ఏపీ మంత్రులు ఆయనపై మండిపడటం ప్రారంభించారు.

ఏపీ మంత్రి ఓ అడుగు ముందుకేసి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లతో పాటు కవిత `ప్రాంతీయ ఉగ్రవాదులు’ అంటూ తీవ్రమైన విమర్శలు గుప్పించారు. తెలంగాణ మంత్రులు ఎదురు తిరుగుతూ “ప్రత్యేక హోదా అడగరు… విశాఖ ఉక్కును పట్టించుకోరు, స్వప్రయోజనాల కోసం ప్రజలను గాలికి వదిలేశారు” అంటూ వైఎస్ జగన్ పాలనపై విరుచుకు పడ్డారు.

పనిలో పనిగా, వైసీపీతో పాటు తెలంగాణాలో బలం పెంచుకోవాలని చూస్తున్న టిడిపిని కూడా ఎండగట్టారు. “ప్రత్యేక హోదా కావాలన్నారు.. ఇప్పుడేమో ప్రత్యేక హోదాను కేంద్రం ఎగబెట్టినా అడగరు.. విశాఖ ఉక్కును తుక్కుకు అమ్ముతున్నా ఎవ్వరు అడగరు.. ప్రజలను గాలికి వదిలేసి మీ ప్రయోజనాలను చూస్తూకొంటున్నారు” ఏపీ రాజకీయ పార్టీలు అన్నింటిని దుమ్మెత్తి పోశారు.

రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య ఈ మాటల యుద్ధం యాదృశ్చికంగా తలెత్తింది కాదని, వ్యూహాత్మకంగా రెండు రాష్ట్రాల ప్రజలలో `ప్రాంతీయ సెంటిమెంట్’ ను రగిల్చి, వచ్చే ఎన్నికలలో ప్రయోజనం పొందాలని ఎన్నికల వ్యూహకర్తలు ఆలోచనలమేరకే ప్రయోగిస్తున్నారని పలువురు భావిస్తున్నారు.

ఒకరిద్దరు నేతలు నోరు జారీ, పొరుగు రాష్ట్రం నేతలపై విమర్శలు గుప్పొంచినా గతంలో ఎప్పుడూ రెండు రాష్ట్రాల మంత్రులు ఇంతగా పరస్పరం మాటల దాడులు చేసుకున్న దాఖలాలు లేవు. `తెలంగాణ సెంటిమెంట్’ తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన పార్టీ టిఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చి `బిఆర్ఎస్’గా మార్చడంతో ఇప్పుడు ఆ సెంటిమెంట్ పనిచేయదు. దానితో ఏదో విధంగా స్థానిక సెంటిమెంట్ రగిల్చి లబ్ది పొందేందుకు ఎత్తుగడ వేస్తున్నట్లు స్పష్టం అవుతుంది.

ఇటువంటి ఎత్తుగడ అటు వైఎస్ జగన్ ప్రభుత్వంకు సహితం రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంటుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles